దినచర్య, రుతుచర్యలతో ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యం - ఉపరాష్ట్రపతి

- September 29, 2020 , by Maagulf
దినచర్య, రుతుచర్యలతో ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యం - ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ:కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిస్థితులు కుదుటపడే వరకూ అలసత్వాన్ని ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అదే విధంగా ఆరోగ్యకమైన జీవనశైలి కోసం దినచర్య, రుతుచర్యలను పాటించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం పై ప్రజలను చైతన్యపరిచేందుకు మీడియా, వైద్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచించిన మాస్కులు ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం మొదలైన జాగ్రత్తలను పాటించాలని ఆయన పేర్కొన్నారు. 14వ ఫిక్కీ హీల్ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ‘కరోనా అనంతర ప్రపంచం – నూతన ఆరంభం’ ఇతివృత్తంతో నిర్వహించిన అంతర్జాల సదస్సులో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ‘కరోనా విస్తృతి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం ప్రజల బాధ్య అని, దీనితో పాటుగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచిస్తున్న వివిధ జాగ్రత్తలను విధిగా పాటించాలని, ఈ పోరాటంలో మన ఆత్మస్థైర్యం నీరుగారకుండా ఉండేందుకు అలసత్వాన్ని ప్రదర్శించడం తగదని హితవు పలికారు. సమీప భవిష్యత్తులోనే కరోనాకు టీకా విషయంలో శుభవార్త వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అక్కడక్కడ.. కరోనా బాధితులు, మొదటి శ్రేణి పోరాటయోధులపై వివక్షతో వ్యవహరిస్తున్న సంఘటలను తీవ్రంగా ఖండించిన ఉపరాష్ట్రపతి, ఇలాంటి బాధ్యతారాహిత్య చర్యలు ఆమోదయోగ్యం కాదని, వీటికి ఆదిలోనే చరమగీతం పాడాలని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి విషయంలో, లేదా కరోనా బాధితులతో కలిసి ఉంటున్న వారి విషయంలో వివక్ష అవసరం లేదని. వారిపట్ల సహానుభూతితో వ్యవహరిస్తూ సమాజంలో సానుకూలతను పెంచడాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా వయోవృద్ధులు (పెద్దలు), వారి సంరక్షణ చూస్తున్న వారు, వ్యాధిగ్రస్తులు, బాధిత, వెనుకబడిన వర్గాల మానసిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడిందని.. ఇలాంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, వైరస్‌ను ఓడించేందుకు మనమంతా సంయుక్తంగా ముందడుగు వేద్దామని. కరోనా తదనంతర పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కొనడంలోనూ అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని తెలిపారు. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎదుర్కొనేందుకు సన్నద్ధులం కావాలని సూచించారు.
ఈ మహమ్మారి కారణంగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన ఆవశ్యకత తెలిసొచ్చిందన్న ఉపరాష్ట్రపతి.. ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక వ్యాయామం, శారీరక దారుఢ్యంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత కీలకమని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న ఆయన.. దినచర్య, రుతుచర్యలను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలి విషయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వారికి నిపుణుల సహాలు అందజేసేందుకు వైద్యులు, మీడియా కలిసి చొరవ తీసుకోవాలని సూచించారు. ఆహారం విషయంలోనూ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, కాలానుగుణంగా, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన పెద్దలు సూచించిన పౌష్టిక ఆహారం మీద దృష్టి పెట్టాలని సూచించారు. జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళకుండా పోషకాలున్న ప్రాంతీయ వంటకాలను తీసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు.
దేశంలో అసంక్రమిత వ్యాధుల ప్రభావం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. ఇందుకు జీవనశైలిలో వస్తున్న మార్పులో ప్రధాన కారణమన్నారు. వీటిలో మార్పులు చేసుకుని.. శారీరక వ్యాయామాన్ని (నడక, పరుగు, ఎరోబిక్స్, స్ట్రెచింగ్ తదితర) యోగ, ధ్యానాన్ని దినచర్యలో భాగంగా మార్చుకోవాల్సిన తక్షణావసరం ఉందన్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజల జీవనం తీవ్రంగా ప్రభావితమైన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అన్ లాక్ దిశగా దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్న ఉపరాష్ట్రపతి, త్వరలోనే ఈ మహమ్మారి నివారణకు టీకా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పాఠశాలు, కాలేజీల్లో క్రీడలకు తప్పని సరిగా సరైన స్థానం కల్పించాలన్నారు.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, అందుబాటు ధరల్లో  అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించిన ఉపరాష్ట్రపతి, ఇందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ప్రైవేటు రంగం, భాగస్వామ్య పక్షాలు కూడా మద్దతునందిస్తూ.. పబ్లిక్- ప్రైవేటు,పార్ట్‌నర్‌షిప్ ద్వారా గ్రామీణప్రాంతాల్లో ఆధునిక వైద్య వసతుల కల్పన మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో కనీస వైద్య అవసరాలను అందించడంపై దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలోని ఉత్తమ పద్ధతులను విశ్లేషించి మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆత్మనిర్భర భారత్ అభియాన్‌ను సద్వినియోగం చేసుకుంటూ మన దేశంలో వివిధ అధునాతన, హైటెక్ వైద్య పరికరాల తయారీపై ప్రైవేటు రంగం మరింత దృష్టి పెట్టాలని ఈ దిశగా ఫిక్కీ వంటి సంస్థలు చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఫిక్కీ సభ్యుల సహకారాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. కరోనా వ్యాధి నేపథ్యంలో బాధితులు, చిన్న సమస్యలున్నవారు వైద్యులను ఫోన్లో సంప్రదించేందుకు (టెలిమెడిసిన్ కోసం) ‘స్వస్థ్’ మొబైల్ యాప్ ను రూపొందించడంపైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ హెల్త్ కేర్ వ్యవస్థకు ముందడుగు : ప్రతి భారతీయుడికి వైద్యసేవల కల్పన’ నివేదికను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఫిక్కీ అధ్యక్షురాలు, అపోలో ఆసుపత్రుల జాయిండ్ ఎండీ డాక్టర్ సంగీతా రెడ్డి, ఫిక్కీ హెల్త్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, మెడికా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అలోక్ రాయ్, ఫిక్కీ హెల్త్ సర్వీసెస్ కమిటీ కో-చైర్మన్ డాక్టర్ హర్ష్ మహాజన్‌తోపాటు ఇతర ఫిక్కీ సభ్యులు, వైద్యరంగ నిపుణలు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com