అటల్‌ టన్నెల్‌ ప్రారంభించిన మోడీ

- October 03, 2020 , by Maagulf
అటల్‌ టన్నెల్‌ ప్రారంభించిన మోడీ

హిమాచల్:ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి సొరంగంగా పేరు తెచ్చుకున్న అటల్‌ టన్నెల్‌ ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో ప్రధాని మోడీ ఈ భారీ సొరంగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌, మరో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌తో పాటు పలువురు సైనికాధికారులు పాల్గొన్నారు. కోవిడ్‌ కారణంగా కేవలం 200 మందినే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. టన్నెల్‌ ప్రారంభోత్సవం తర్వాత కాసేపు నడిచిన ప్రధాని నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఓపెన్‌ టాప్ జీపులో ప్రయాణిస్తూ టన్నెల్‌ను పరిశీలించారు. భారత్‌లోని హిమాలయ పర్వతాల్లోని పీర్‌ పంజాల్‌ శ్రేణుల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీ నుంచి కాశ్మీర్‌ నుంచి లేహ్‌ 9.02 కిలోమీటర్లు పొడవైన ఈ సొరంగాన్ని పూర్తి చేయాలని మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ 2000 సంవత్సరంలోనే సంకల్పించారు. 2002లో దీని నిర్మాణానికి శంఖుస్ధాపన చేశారు. 2019లో కేంద్రం దీని నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు అటల్‌ టన్నెల్‌ గా నామకరణం చేసింది. మనాలీ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో 3060 మీటర్ల అడుగుల ఎత్తున దీన్ని నిర్మించారు.

డబుల్‌ లేన్‌లో నిర్మించిన ఈ సొరంగం ద్వారా లేహ్‌-మనాలీ మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. ప్రయాణ సమయం కూడా నాలుగు నుంచి ఐదు గంటల మేర తగ్గనుంది. ఈ టన్నెల్ నిర్మాణం వల్ల ఏడాది పొడవునా మంచు కురుస్తున్నా ఈ లేహ్‌ నుంచి మనాలీ వేళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఒకేసారి 3000 కార్లు, 1500 ట్రక్కులు ప్రయాణించేందుకు వీలుంది. 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా దీన్ని నిర్మించారు. ప్రతీ 150 మీటర్లకూ ఫైర్‌ హైడ్రెంట్ పరికరాలు, సీసీ కెమెరాలు, ప్రతీ 60 మీటర్లకు ప్రమాదాలు జరిగితే ఆటోమేటిగ్గా గుర్తించే పరికరాలు ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ టన్నెల్‌ వ్యూహత్మకంగా ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com