ఎస్.పి.బి

- October 03, 2020 , by Maagulf
ఎస్.పి.బి

ఒక వ్యక్తి, ఎన్నో కోట్ల హృదయాలలో నిలవటం మాటలా? సాధ్యమా? అనితర సాధ్యాలను సుసాధ్యం చేసిన మహనీయుడి మన బాలు. ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి ఆయన గురించి?  అందరికి ఆత్మబంధువైనవాని గురించి యెంత చెప్పినా తక్కువే. ఈయన పరిణితి చెందిన మానవత్వానికే ప్రతిరూపం.  వినయం, విధేయత, వాక్చాతుర్యం, భాష మీద పట్టు/అభిమానం, సమయస్ఫూర్తి, నిరాడంబరత, మొక్కవోని ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ, పెద్దలయందు గౌరవ మర్యాదలు, పిల్లలయందు ప్రేమ, సాటివారిపై అభిమానం, సమయపాలనపై మక్కువ, ఆచార వ్యవహారాలపట్ల మమకారం, సంస్కృతి సాంప్రదాయాలపట్ల విశ్వాసం, దేశవిదేశాల్లో ఎనలేని ప్రతిభ, లెక్కకు మిక్కిలి అవార్డులు / గౌరవ పత్రాలు, పదహారు భాషల్లో నలభైవేల పైచిలుకు పాటలు, కొన్ని వేల వేదికల్లో గాత్రదానం మరియు మరెన్నో విలక్షణమైన లక్షణాలన్నీ కాలబోసిన ప్రతిరూపమే మన డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

మధురమైన, మరచిపోని, మరులారాని, మరువరాని మంచి గాత్రంతో మమ్ముల్ని మంతముగ్దుల్ని చేసి, యదగలేని ఎత్తుకు ఎదిగి, అందరి ఎండల్లో వొదిగి, ప్రస్తుతం శాశ్విత విశ్రామ మందిరంలో సేదదీరుతున్నావు.  ఇంత కష్టపడ్డమీకూ విశ్రాంతి అవసరమేకదా ! కానీ ఎందుకో మనస్సు ఒప్పుకోవడం లేదు, ఈ భరించరాని చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి.  నీవు కేవలం ఒక వ్యక్తి కాదు.  అపార శక్తివి.  అందుకే నీవులేక, ఎన్నో వేలమంది బలహీనులయ్యారు.  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి దైవం అయ్యావునీవు.  నీ గాత్రంతో గానానికి ప్రాణం పోశావు.  లాలి పాటలు, చిలిపి పాటలు, చలాకీ పాటలు, యుగళగీతాలు, దేవుళ్లపై లెక్కకు మిక్కిలి స్తోత్రాలు, ఒకటేమిటి నవరసాలను నీగాత్రంతో మాకు చూపించావు. 

ఐదు దశాబ్దాలుగా కొనసాగిన నీ సినీ ప్రస్థానంలో నీకు రాని అవార్దులు ఎమన్నా ఉన్నాయా ఇంకా? అవార్డు నీకుగాదు, నీవు అవార్డులకు గుర్తింపు తెచ్చేవనడంలో  ఆవగింజయినంతయూ అవమానం లేదు కదా! ఇంత మంది మనస్సులు ఎలా దోచావయ్యా? ఇంకా ఆత్మబంధువులందరూ శోక సముద్రంలో తెలియాడుతూనే వున్నారు. వీరికి కుల, మాత, జాతి, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత విభేదాలు కూడా లేవయ్యా! ముఖ్యంగా తెలుగు కళామ్మతల్లికి ఎంత సేవ చేసావయ్యా! నీ మాటలు వింటుంటే కోటానుకోట్లమంది పులకరించిపోయేవారు.  రెండు దశాబ్దాలుగా పాడుతా తీయగా అనే కార్యక్రమం మాముందుంచి నిన్ను నేవే ప్రాణంతో నిలుపుకున్నావు.  ఇక నీకు మరణమేలేదు.  నీవు మాకందించిన సంగీత విభావరుల ఎన్సైక్లోపీడియా ఈ విశ్వము ఉన్నంతవరకూ ఉండేటట్లు జాగ్రత్తపడి నీవులేని లోటుని నువ్వే మాకు దీర్చావు.  ఈ తెలుగు జాతి ఏంచేస్తే నీ ఋణం దీర్చుకుంటుంది చెప్పు? ఒకటా, రెండా? ఏకంగా నాలుగు తరాలవారికి నీ గళాన్ని అందించావు. ఇది ఎవరికీ సాధ్యంగాని విషయం. కానీ నిజమని నిరూపించావు. మా హృదయాల్లో చిరాస్ధాయిగా నిలచిపోయావు. ఒక్క మనిషి, మాటలలో వివరించలేనంత ప్రభావాన్ని కలుగజేసిన మీరే అసలు సిసలైన భారతరత్నం మాకు. మీరే మా గుర్తింపు. మీరే మా మారని చిరునామా. 

ఇట్లు
శ్రీపతి పండితారాధ్యుల సోమసుందర్ 
షార్జా, యూఏఈ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com