కరోనా దెబ్బ..బుర్జ్ ఖలీఫా ను కట్టిన కంపెనీకే ఆ పరిస్థితి

- October 03, 2020 , by Maagulf
కరోనా దెబ్బ..బుర్జ్ ఖలీఫా ను కట్టిన కంపెనీకే ఆ పరిస్థితి

దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలతో పాటు యూఏఈలో పలు ఇంజినీరింగ్ అద్భుతాలను ఆవిష్కరించిన అరబ్‌టెక్ హోల్డింగ్ కంపెనీ... కరోనా దెబ్బకు కుదేలైంది. అప్పుల ఊబిలో కూరుకుని ఇక కోలుకోలేని పరిస్థితి నెలకొనడంతో మూసివేత దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీని మూసివేయాలంటూ షేర్ హోల్డర్లు పరస్పరం చర్చించుకుంటున్నట్టు ఈమెయిల్స్ బయటికి వచ్చిన మరుసటి రోజే కంపెనీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. వాస్తవానికి 2009 దుబాయ్ సంక్షోభం మొదలు తిరిగి నిలదొక్కుకునేందుకు దశాబ్ద కాలంపాటు తీవ్ర ప్రయత్నాలు చేసిన అరబ్‌టెక్.. గతేడాది నాటికి వందల మిలియన్ల డాలర్ల అప్పులు, నష్టాల్లో కూరుకుపోయింది. తాజాగా కరోనా కల్లోలంతో కంపెనీ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అబూదాబీ అధికార పత్రిక ది నేషనల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అరబ్‌టెక్ చైర్మన్ వలీద్ ముహైరీ పేర్కొన్నారు.

ఇప్పటికే దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ అరబ్‌టెక్ కంపెనీ షేర్ల ట్రేడింగ్‌ను కూడా నిలిపివేసింది. అరబ్‌టెక్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో అబూదాబికి చెందిన ముబదలా కూడా ఉంది. 1975లో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది మొదలు అరబ్‌టెక్‌ కంపెనీ అనేక ఆకాశ హార్మ్యాలతో పాటు చమురు, సహజవాయువులను తరలించేందుకు అవసరమైన నిర్మాణాలను చేపట్టింది. 2,717 అడుగుల ఎత్తున దుబాయ్‌కి అత్యాధునిక సొబగులను జోడిస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడంగా పేరు పొందిన బూర్జ్ ఖలీఫాతో పాటు లౌరే అబూదాబీ వంటి ల్యాండ్‌మార్కులు అరబ్‌టెక్ నిర్మించినవే. కాగా ఈ కంపెనీ మూసివేత నిర్ణయంతో దాదాపు 40 వేల మందికి పైగా ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com