డొమస్టిక్ వర్కర్లు వ్యక్తిగతంగా హజరైతేనే డబ్బు బదిలీ..

- October 05, 2020 , by Maagulf
డొమస్టిక్ వర్కర్లు వ్యక్తిగతంగా హజరైతేనే డబ్బు బదిలీ..

దుబాయ్:ఇళ్లలో పని చేసే గృహ కార్మికులు విదేశాల్లోని తమ కుటుంబాలకు డబ్బు పంపించాలంటే ఇక నుంచి ఎక్సేంజ్ కేంద్రాలకు వ్యక్తిగతంగా హజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ నిబంధనలను కఠిన తరం చేసింది. వంట మనుషులు, పని మనిషులు, క్లీనర్లుగా పని చేసే ప్రవాస కార్మికులు తమ కుటుంబాలకు డబ్బు పంపించేందుకు వారే స్వయంగా నగదు బదిలీ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్లు వ్యక్తిగతంగా వెళ్లే పరిస్థితులు లేనప్పుడు..తమ ప్రతినిధులుగా యజమానిని గానీ, ఇతర నమ్మకస్తులనుగానీ పంపించవచ్చు. అయితే..తమ డబ్బును బదిలీ చేసేందుకు తమ ప్రతినిధులుగా వారిని ఆమోదిస్తున్నట్లు అధికారికంగా ఓ లేఖను ఎక్సేంజ్ కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఆ అధికారిక లేఖలో తమ ప్రతినిధులుగా ఎవరికి నగదు బదిలీ హక్కు కల్పిస్తున్నారో పూర్తి

వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. అలాగే ఎవరికి డబ్బు పంపదలుచుకున్నారో వారి వివరాలను కూడా పూర్తిగా పేర్కొనాలి. ఇక తమ ప్రతినిధులుగా ఎవరికైతే  హక్కులను బదిలీ చేస్తూ అధికారిక లేఖ అందిస్తారో..అదే లేఖలో నగదు బదలీ చేసేందుకు అనుమతి ఇస్తున్నారా...లేదంటే నగదు మార్పిడికి ఆమోదం తెలుపుతూ లేఖ ఇస్తున్నారా అనేది కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. నగదు ఎవరి సొంతమో వారి వివరాలు, గుర్తింపు కార్డులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రవాస కార్మికులు మోసపోకుండా ఉండేందుకు వారీ పేరు మీద అక్రమ నగదు బదిలీని జరగకుండా నియంత్రించేందుకు 2018 నుంచే ఈ నిబంధన అమలులో ఉంది. కానీ, ఇన్నాళ్లు ఎక్సేంజ్ కేంద్రాలు నిబంధనల అమలును పెద్దగా పట్టించుకోలేదు. అయితే..ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ నగదు బదిలీ విషయంలో నిబంధనలను తూచ తప్పకుండా ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఎవరైనా మనీ ఎక్సేంజ్ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి యాభై వేల దిర్హామ్ ల నుంచి ఐదు లక్షల దిర్హామ్ ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చిరించింది. ఉల్లంఘన తీవ్రతను బట్టి జరిమానా ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com