జనవరి 21వరకు పర్యాటక వీసా గడువును పొడిగించిన బహ్రెయిన్

జనవరి 21వరకు పర్యాటక వీసా గడువును పొడిగించిన బహ్రెయిన్

మనామా:బహ్రెయిన్ లో ఉన్న విదేశీయులకు సంబంధించి అన్ని రకాల పర్యాటక వీసాల గడువును మరోసారి పొడిగించింది ప్రభుత్వం. ఈ నిర్ణయం మేరకు వచ్చే ఏడాది జనవరి 21 వరకు పర్యాటక వీసాదారులు అందరూ బహ్రెయిన్ లో ఎలాంటి అదనపు ఫీజు చెల్లించకుండా నిశ్చింతగా ఉండొచ్చు. క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలోని ఎగ్జిక్యూటీవ్ కమిటీ నిర్ణయానికి అనుగుణంగా విజిట్ వీసా గడువు పెంచినట్లు జాతీయ గుర్తింపు, నివాస అనుమతులు, పాస్ పోర్టు వ్యవహారాల శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాదు..గడువు పెంపు అటోమెటిక్ గా అమలులోకి వస్తుందని..ఇందుకోసం వీసాదారులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఈ వెసులుబాటును దృష్టిలో ఉంచుకొని పర్యాటకులు అందుకు తగినట్లుగా నివాస ఏర్పాట్లను చేసుకోవచ్చని, ఒకవేళ వారి దేశాలకు విమాన సౌకర్యాలు ఉంటే గడువు ముగిసేలోగా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలాఉంటే కోవిడ్ 19
ప్రబలిన నాటి నుంచే బహ్రెయిన్ ప్రభుత్వం విదేశీ పర్యాటకులు, ప్రవాసీయుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ 19 కారణంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో మానవతా దృక్పథంతో వారికి కావాల్సిన నివాస ఏర్పాట్లు చేస్తోంది. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Back to Top