బహ్రెయిన్ లో దారుణం..బతికున్న కవలల్ని చనిపోయినట్లు నిర్ధారించిన డాక్టర్

- October 24, 2020 , by Maagulf
బహ్రెయిన్ లో దారుణం..బతికున్న కవలల్ని చనిపోయినట్లు నిర్ధారించిన డాక్టర్

మనామా:బహ్రెయిన్ లో ఓ డాక్టర్ నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన ఇద్దరు కవల శిశువులను బలితీసుకుంది. ఆ పసిగుడ్డులు కళ్లు కూడా తెరవకముందే కనుమూశారు. నెలలు నిండక ముందే పుట్టిన ఆ శిశువుల్ని ట్రీట్ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటమే కాకుండా...చనిపోయినట్లు నిర్ధారించారు. వాళ్లిద్దర్ని ఖననం చేసే సమయంలో అంతా షాక్ అయ్యారు. చనిపోయారనుకున్న శిశువులు బతికే ఉండటంతో ఆ తండ్రి హడావుడిగా ఆస్పత్రికి పరిగెత్తాడు. కానీ, అతనికి మరోసారి గుండెకోత తప్పలేదు. అప్పటికే సమయం మించిపోవటంతో చిన్నారులు ఇద్దరు చనిపోయారు. దీంతో కడుపు మండిన ఆ కన్నతండ్రి తన బిడ్డలను ఉసురు తీసిన ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్ నిర్లక్ష్యాన్ని కళ్లకు కడుతూ సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ కావటంతో వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖస్పందించి సదరు డాక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. బహ్రెయిన్ లోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.

సల్మానియా ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం 22 వారాల గర్భంతో ఉన్న ఓ మహిళ ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో ఈ నెల 15న రాత్రి 8 గంటల సమయంలో తమ ఆస్పత్రికి వచ్చిందని, వెంటనే చికిత్స ప్రారంభించామని, ఆమె ఇద్దరు కవల శిశువులకు జన్మ ఇచ్చిందని, అందులో ఒక్కరు పుట్టగానే మరణించగా..మరొక చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ కి తరలించామని తెలిపారు. అయితే..కొద్ది గంటల్లోనే ఆ చిన్నారి కూడా మరణించినట్లు వెల్లడించారు.


అయితే..చిన్నారుల కన్నతండ్రి మాత్రం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన బిడ్డలు చనిపోయారని ఆరోపిస్తున్నారు. తాను ఆస్పత్రి వెళ్లిన కొద్ది గంటల్లోనే చిన్నారులు ఇద్దరు చనిపోయారని..వాళ్లను ఓ బ్యాగులో పెట్టి ఇచ్చారని తండ్రి చెబుతున్నాడు. అయితే..వారిని ఖననం చేస్తున్న సమయంలో ప్రాణాలతో ఉండటం గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని, కానీ, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆన్ లైన్ అతను పోస్ట్ చేసిన డాక్యుమెంట్ వైరల్ కావటంతో వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఘటనపై ఉన్నత విచారణకు ఆదేశించిన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ..విచారణ ముగిసే వరకు డాక్టర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. బహ్రెయిన్ లోని ఏ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది అయినా..ప్రజల ప్రాణాలను కాపాడటమే అంతిమ లక్ష్యంగా విధులు నిర్వహించాలని..నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని సంహించే ప్రసక్తే లేదని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com