సంగీతం, నృత్యంతోనే జీవితం మరింత పరిపూర్ణం:ఉపరాష్ట్రపతి

- October 27, 2020 , by Maagulf
సంగీతం, నృత్యంతోనే జీవితం మరింత పరిపూర్ణం:ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ:కరోనా మహమ్మారి నేపథ్యంలో నెలకొన్న నిరాశ, మానసిక ఒత్తిడి నుంచి సంగీతం, నృత్యం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుందని గౌరవ ఉపరాష్ట్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నాట్య తరంగిణి సంస్థ ఐక్యరాజ్యసమితి సమన్వయంతో నిర్వహిస్తున్న ‘పరంపర సిరీస్ 2020 – జాతీయ సంగీత, నృత్యోత్సవం’ను అంతర్జాల వేదిక ద్వారా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగీతం, నృత్యం ద్వారా సరికొత్త శక్తిని పొందవచ్చని తద్వారా మన జీవితాలు మరింత పరిపూర్ణమయ్యే దిశగా మార్గం సుగమం అవుతుందని తెలిపారు. అంతర్గత శక్తిని ప్రజ్వలింపజేసి, నిరాశ, నిస్పృహలను మన మనసుల నుంచి పారద్రోలేందుకు వీలుకలుగుతుందన్నారు. 

23 ఏళ్లుగా పరంపర సిరీస్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న నాట్య తరంగిణి సంస్థ.. కరోనా సమయంలోనూ ఆ పరంపరను కొనసాగించడాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. ‘పరంపర అంటే సంప్రదాయం. సంప్రదాయ సంపదను తరువాతి తరానికి అందించడమే పరంపర ఉద్దేశం’ అని ఆయన పేర్కొన్నారు. 

లాక్ డౌన్ కారణంగా నెలకొన్న పరిస్థితులతో సామాజిక అనుసంధానత తగ్గిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం సందర్భోచితమని... దీని నిర్వహణకు ఇంతకన్నా గొప్ప సమయం మరొకటి ఉండదన్నారు. 

ఈ సందర్బంగా సంగీత ప్రధానమైన సామవేదాన్ని, భరతముని నాట్యశాస్త్రాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. భారతదేశానికి ఘనమైన నాట్య, సంగీత సంపద ఉందని తెలిపారు. మన నాట్య, సంగీత, కళా రూపాలు మన నాగరికతను, మన శాంతి-సామరస్య విలువలను, ఐకమత్య, సోదరభావాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. దీంతోపాటు మానవ అస్తిత్వానికి, నవరసాలకు, ఆధ్యాత్మిక, భక్తిభావాలకు ఈ నాట్య, సంగీత, కళారూపాలు ప్రతిబింబాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

ఇంతటి విలువైన సంప్రదాయ సంపదను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ.. ఆధునీకరించుకుంటూ ముందుకెళ్లాలని సూచించిన ఉపరాష్ట్రపతి, ఈ పరంపర కొనసాగేందుకు వీలుగా విద్యావ్యవస్థలోనూ నాట్య, సంగీత సంప్రదాయాన్ని చొప్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వీటిని నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడంతోపాటు.. వారిలో అంతర్గతంగా ఉన్న నైపుణ్య, సృజనాత్మకత బయటకు వస్తాయని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక, శారీరక సంతులనంతో సామరస్య పూర్వక జీవనం ప్రతి ఒక్కరికీ అవసరమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ప్రకృతికి మానవాళి వల్ల కలుగుతున్న నష్టానికి ప్రతిక్రియగానే ఇలాంటి విపత్తులు ముంచుకొస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సమస్య నుంచి భవిష్యత్ తరాలను రక్షించేందుకు పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా గుర్తించాలని, వివిధ సామాజిక సంస్థలు, ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఈ దిశగా మరింత దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన నాగరికత ఎప్పుడూ.. పర్యావరణ హితంగానే ఉండేవని, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించాయని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి,కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లు, కళావేదికలు, కొన్ని నెలలుగా మూతబడి ఉన్నాయని.. దీని ద్వారా కళాకారులపై తీవ్ర ప్రభావం కనిపించిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కళాకారులు, కళాసంస్థలు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ మన ప్రాచీన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ తర్వాతి తరాలకు ఈ ఘనమైన వారసత్వాన్ని అందించేందుకు కృషిచేయాలని సూచించారు. 

ఈ సందర్భంగా కూచిపూడి కళారూపాన్ని సజీవంగా ఉంచడంతోపాటు తర్వాతి తరాలకు అందజేసే లక్ష్యంతో యువతకు, విద్యార్థులకు కూచిపూడి శిక్షణను ఇస్తున్న డాక్టర్ రాజా రెడ్డి - రాధారెడ్డి, కౌశల్య రెడ్డి వారి కుటుంబ సభ్యులను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఐక్యరాజ్యసమతిని, ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ రెనటా దేసాలిన్ ను కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు.ఈ కార్యక్రమంలో జీఎంఆర్ సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు పాల్గొని, ప్రసంగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com