అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణ మీద దృష్టి కేంద్రీకరించాలి:ఉపరాష్ట్రపతి
- October 29, 2020
న్యూఢిల్లీ:పర్యావరణ హిత, హరిత భవనాల నిర్మాణాన్ని తప్పనిసరి చేసేందుకు ఇదే మంచి తరుణమని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు, ఆర్థిక సంఘాలు, స్థానిక సంస్థలు నడుం బిగించి.. హరిత భవనాలకు పన్నురాయితీల ద్వారా ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ – 2020’ని గురువారం న్యూఢిల్లీ ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలతోపాటు ఇప్పటికే ఉన్న భవనాల్లోనూ పచ్చదనాన్ని ప్రోత్సహించేలా, పర్యావరణ హిత పద్ధతులను ఆవలంబించేలా, జలసంరక్షణతోపాటు ఇంధన ఆదా జరిగేలా ప్రతి ఒక్కరూ చొరవతీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
తక్కువ కర్బన పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించే సాంకేతికతను వినియోగించడంపై, సుస్థిరమైన పర్యావరణ హిత భవనాల నిర్మాణాలపైనా అవగాహన పెంచే కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా సూచించారు. ‘దృఢమైన భారతంతోపాటు హరిత భారత నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అతివృష్టి, అనావృష్టి, అడవుల్లో కార్చిచ్చు తదితర ఘటనలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి ఉపద్రవాలు విరుచుకుపడుతున్నాయని గుర్తు చేశారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రపంచంలోని దేశాలన్నీ విప్లవాత్మక నిర్ణయాలను పకడ్బందీగా అమలుచేస్తూ భూతాపాన్ని తగ్గించే దిశగా కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో.. అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ రెండు అంశాలను వేర్వేరుగా చూడలేమని రెండింటికీ సమప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ‘మనం ప్రకృతిని కాపాడుకుంటే.. ప్రకృతి సమస్త మానవాళిని సంరక్షిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి’ అని ఆయన సూచించారు.
భవన నిర్మాణంలో 39శాతం కర్బన ఉద్గారాలుగా మారే పదార్థాలను వినియోగిస్తున్నారని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి.. సంపూర్ణ కర్బన ఉద్గార రహిత పర్యావరణహిత భవన నిర్మాణ పద్ధతులు ఊపందుకోవాలని సూచించారు. హరిత భవనాల విధానాన్ని ఉపరాష్ట్రపతి వివరిస్తూ.. ఇంధన, విద్యుత్ శక్తి ఆదా, జలసంరక్షణ, పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడంతోపాటు భవనాల నిర్మాణంలో పర్యావరణహిత, స్థానికంగా లభించే, ఉత్పత్తిచేసే వస్తువుల వినియోగానికి పెద్దపీట వేయాలన్నారు. నిర్మాణాలకు వినియోగించే వస్తువులన్నీ పర్యావరణ అనుకూలంగా, భవిష్యత్ తరాల అవసరాలకు తగ్గట్లుగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ‘నెట్ జీరో కార్బన్ బిల్డింగ్స్’ దిశగా ఉద్యమాన్ని ప్రారంభించాలన్నారు. ఇందులో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రెడాయ్ వంటి సంస్థలు భాగస్వామ్యం వహించాలన్నారు.
భారతదేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. నవీన పద్ధతులు, పర్యావరణహిత విధానాలు కేవలం వ్యాపార కోణంలో మాత్రమే చూడకుండా.. భూతాపాన్ని ఎదుర్కొనడంలో భారతదేశం పాత్రకు తగ్గట్లుగా ఉండాలన్నారు. స్మార్ట్ సిటీస్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉటంకిస్తూ.. అభివృద్ధితోపాటు నివాసయోగ్యమైన పట్టణాల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 761 కోట్ల చదరపు అడుగుల హరిత భవనాల నిర్మాణంతో.. ప్రపంచంలోని తొలి ఐదు దేశాల సరసన భారత్ నిలవడం సంతోషకరమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, సుస్థిర, ఆత్మనిర్భర, ఆరోగ్య భారత నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా అభినందించారు. ప్రపంచ హరిత భవనాల ఉద్యమాన్ని ముందుండి నడిపే సత్తా భారత్‌కు ఉందని.. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రైవేటు రంగం కూడా కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను సమన్వయం చేసే దిశగా సీఐఐ పోషిస్తున్న పాత్రను కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. హరిత భవనాల్లో కరోనా మహమ్మారితో పోరాడేందుకు సీఐఐ ప్రవర్తన నియమ నిబంధనలు రూపొందించడాన్ని ఆయన ప్రశంసించారు.
గ్రామాల్లోనే భారతదేశ ఆత్మ ఉందని, గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అన్న మహాత్ముడి మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, పట్టణాల్లోలాగే గ్రామాల్లోనూ అన్ని వసతులను కల్పించే దిశగా కృషి జరగాలన్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్ మొదలైని గ్రామాలకు అందాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యాచరణను విస్తరింపజేయాలని సిఐఐకి సూచించారు.
సీఐఐ 125వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థను ప్రత్యేకంగా అభినందించిన ఉపరాష్ట్రపతి ఓ సచిత్ర పుస్తకం (కాఫీటేబుల్ బుక్)తో పాటు, ‘రేటింగ్ సిస్టమ్ ఆన్ హెల్త్ కేర్, లాజిస్టిక్స్ అండ్ నెట్ జీరో వాటర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీఐఐ మాజీ అధ్యక్షుడు, సీఐఐ చైర్మన్ జంషిద్ నౌరోజీ గోద్రేజ్, సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ వి.సురేశ్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ వైస్ చైర్మన్ గుర్మీత్ సింగ్ అరోరాతో పాటు నిర్మాణ రంగ ప్రముఖులు, అధికారులు, ఇంజనీర్లు, డెవలపర్లు, బిల్డర్లు, ఆర్కిటెక్ట్ లు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!