అమెరికా ఎన్నికల ఫలితాలు వివాదాస్పదమైతే.. ఏం జరుగుతుంది!

- November 04, 2020 , by Maagulf
అమెరికా ఎన్నికల ఫలితాలు వివాదాస్పదమైతే.. ఏం జరుగుతుంది!

ఎడిటోరియాల్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా విజేతను తేల్చలేకపోయాయి. ట్రంప్ గెలుస్తారా లేక బైడెన్ గెలుస్తారా ఇంకా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం బైడెన్ లీడింగ్‌లో ఉన్నా.. కీలక రాష్ట్రాల్లో తామే విజయం సాధిస్తామని ట్రంప్ అన్నారు. దీంతో అధ్యక్ష రేసు ఆసక్తికరంగా మారింది. వీలైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ట్రంప్ ప్రకటించడం మరి కొంత టెన్షన్ పుట్టిస్తున్నది. ఈ దశలో అసలు అమెరికా ఎన్నికల ఫలితాల పరిణామాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.

న్యాయపోరాటం..
ముందస్తు ఓటింగ్‌లో రిపబ్లికన్ల కన్నా ఎక్కువ శాతం డెమెక్రాట్లు ఓటేసినట్లు తెలుస్తోంది. పెన్సిల్వేనియా, విస్కిన్‌సన్ రాష్ట్రాల్లో ఎలక్షన్ డే వరకు ఆ ఓట్లను లెక్కించలేదు. అయితే తొలుత ఆ రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నా.. పోస్టల్ బ్యాలెట్లు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ట్రంప్ ఆ ఓట్లను లెక్కించవద్దు అన్న సందేశాన్ని వినిపించారు. ఓటింగ్ విధానం, బ్యాలెట్ కౌంటింగ్‌పై కొన్ని రాష్ట్రాలు కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా ఉన్నది. 2000 సంవత్సరంలో జార్జ్ బుష్ కూడా ఫ్లోరిడా విషయంలో కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో అక్కడ రికౌంటింగ్ ఆపేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అమీ కానే బారెట్‌ను ట్రంప్ నియమించారు. దీంతో కోర్టులో ట్రంప్‌కు 6-3 మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కోర్టుకు వెళ్తే, అప్పుడు ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు వెలుబడే అవకాశాలు ఉన్నాయి.

ఎలక్టోరల్ కాలేజ్‌..
అమెరికా ఎన్నికల్లో 538 మంది పోటీపడుతారు. వారిని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వారే దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 2016లో పాపులర్ ఓటింగ్‌లో ట్రంప్ వెనుకబడ్డా.. ఆయన మాత్రం 304 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో హిల్లరీకి 227 ఓట్లు వచ్చాయి. ప్రతి రాష్ట్రంలో పాపులర్ ఓటు గెలిచినవారే.. ఆ రాష్ట్ర ఎలక్టర్లను ఎన్నుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 14వ తేదీన ఆ ఎన్నిక జరగనున్నది. ఆ తర్వాత ఉభయసభలు జనవరి ఆరవ తేదీన ఓట్ల లెక్కింపు కోసం భేటీ అవుతాయి. ఆ సమావేశంలో అధికారికంగా విజేతను ప్రకటిస్తారు. సాధారణంగా గవర్నర్లు ఎలక్టోరల్ విజేతను వెల్లడిస్తారు. కానీ పెన్సిల్వేనియా, మిచిగన్‌, విస్కిన్‌సన్‌, నార్త్ కరోలిన రాష్ట్రాల్లో డెమోక్రటిక్ గవర్నర్లు ఉన్నారు. దీంతో ఆ రాష్ట్రల్లో ట్రంప్‌కు సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాంటింజెంట్ ఎలక్షన్‌..
ఒకవేళ ఏ అభ్యర్థికి కూడా ఎలక్టోరల్ మెజారిటీ దక్కకపోతే.. అప్పుడు రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం కాంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. అంటే.. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ ప్రతినిధులు.. దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇక సేనేట్ ప్రతినిధులు ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒకవేళ 269-269 వచ్చినా.. అప్పుడు కూడా కాంటింజెంట్ ఎలక్షన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓట్లు అయినా.. కోర్టు అయినా ఫలితం మాత్రం కచ్చితంగా జనవరి 20వ తేదీ లోపు తేలాలి. ఒకవేళ ఆ నాటికి కూడా విజేత ఎవరో తెలియనప్పుడు.. హౌజ్ స్పీకర్‌.. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం స్పీకర్‌గా నాన్సీ పెలోసి ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com