భారత్‌కు చైనా షాక్.. వందే భారత్ మిషన్ కు బ్రేక్

- November 05, 2020 , by Maagulf
భారత్‌కు చైనా షాక్.. వందే భారత్ మిషన్ కు బ్రేక్

ఇండియా నుంచి వచ్చే వారికి చైనా తాత్కాలికంగా నో ఎంట్రీ అనేసింది. చైనా వీసాలు ఉన్నప్పటికీ.. కొందరు భారతీయులకు కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ ఎంబసీ వెల్లడించింది. దీంతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందే భారత్ మిషన్‌లో భాగంగా నడుస్తున్న సర్వీసులకు చైనాలో తాత్కాలికంగా బ్రేక్ పడింది. నవంబర్ 6న ఢిల్లీ-వూహాన్-ఢిల్లీ సర్వీసుకు సంబంధించి ఇంకా చైనా అధికారుల నుంచి క్లియరెన్స్ రాలేదు. ఇందుకు సంబంధించి మరిన్ని చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ సర్వీసును రీషెడ్యూల్ చేసినట్టు చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

నవంబర్ 3న చైనాలోకి వచ్చిన 19 మంది భారతీయులకు కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశం ప్రకటించింది. నవంబర్‌లో మొత్తం మూడు విమానాలు వూహాన్ నుంచి రావాల్సి ఉంది. అయితే అక్కడి చైనా ఎంబసీ ప్రయాణికుల హెల్త్ డిక్లరేషన్ ఫామ్‌లకు ఇంకా ఆమోదముద్ర వేయలేదు. అయితే దీని వల్ల చైనాకు రావాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ దేశం ప్రకటించింది.

ప్రస్తుతం ఎయిర్ ఇండియా చైనాకు కేవలం వందే భారత్ మిషన్ సర్వీసులను మాత్రమే నడుపుతోంది. అక్టోబర్‌లో ఢిల్లీ నుంచి షాంఘై, గాంగ్జో, వూహాన్‌లకు ఢిల్లీ నుంచి విమానాలు నడిపారు. అయితే ఇదే రకంగా ఆగస్టులో ఇండియా నుంచి వచ్చే విమానాలకు హాంకాంగ్ అనుమతులు రద్దు చేసింది. మలేషియా కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com