అమెరికాలో కోటికి చేరిన కరోనా కేసులు!

- November 09, 2020 , by Maagulf
అమెరికాలో కోటికి చేరిన కరోనా కేసులు!

అమెరికా‌:అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. అయితే అక్కడ ఆదివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య కోటి దాటింది. కరోనా మొదలైన తర్వాత ఈ స్థాయి కేసులు నమోదైన తొలి దేశం ఇదే. ఇటీవలి కాలంలో రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య 10 మిలియన్ మార్క్ ను అధిగమించింది. గడచిన పది రోజుల్లోనే యూఎస్ లో పది లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

న్యూయార్క్ టైమ్స్ గణాంకాల మేరకు గడచిన 24 గంటల వ్యవధిలో 1.26 లక్షలకు పైగా కొత్త కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 1,00,51,300కు చేరింది. గత ఏడు రోజులుగా రోజుకు సగటున లక్షకు పైగా కేసులు అమెరికాలో నమోదవుతుండటం గమనార్హం. ఇక, కేసులు అధికంగా ఉన్నాయని భావిస్తున్న ఇండియా, ఫ్రాన్స్ లతో పోలిస్తే, 29 శాతం కేసులు అమెరికాలోనే కొత్తగా వస్తున్నాయి.

ఇదే సమయంలో యూఎస్ లో మహమ్మారికి 1,013 మంది బలయ్యారు. ప్రపంచంలో సంభవిస్తున్న ప్రతి 11 మరణాల్లో ఒకటి అమెరికాలోనే నమోదవుతోంది. ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, విస్కాన్సిస్, నెబ్రాస్కా, ఐయోవాల్లో కేసులు అధికంగా ఉండగా, ఇల్లినాయిస్ లోనూ మహమ్మారి విస్తరిస్తోంది. 10 శాతం కేసులు టెక్సాస్ లోనే వస్తుండటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నవంబర్ తొలివారంలో 1.05 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. వీటిల్లో 6.22 శాతం నమూనాలు పాజిటివ్ గా తేలాయన్నారు. గతంలో 6.17 శాతంగా ఉన్న పాజిటివ్ రేటు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com