రేపే బిహార్‌ ఫలితాలు.. క్షీణించిన లాలూ ఆరోగ్యం

- November 09, 2020 , by Maagulf
రేపే బిహార్‌ ఫలితాలు.. క్షీణించిన లాలూ ఆరోగ్యం

పట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. రేపు(నవంబర్‌ 10) బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు వైద్యులు తెలిపారు. లాలూకు డయాలసిస్‌ కొనసాగుతుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం లాలూ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ 2017 నుంచి జైలులో ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నానని, అయినప్పటీకి ఇప్పటివరకు ఆయనకు డయాలసిస్‌ చేయాల్సిన అవసరం రాలేదని వైద్యులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్‌ చేస్తున్నట్లు రిమ్స్‌ వైద్యులు పేర్కొన్నారు.

కాగా, ఇటీవల జరిగిన బిహార్‌ ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్‌ పాల్గొననప్పటికీ,  ప్రతి రోజు పార్టీ కార్యక్రమాలు, ప్రజల అభిప్రాయాలను టీవీ చానళ్లు, వార్త పత్రికల ద్వారా సమీక్షించేవాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను కూడా ఆయన పరిశీలించారని చెప్పారు. రేపే ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, అందుకే ఆరోగ్యం క్షీణించిందని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. కాగా, 243 అసెంబ్లీ స్థానాలకు ఉన్న బిహార్‌లో మూడు విడతలుగా  ఎన్నికలు జరిగాయి. నవంబర్‌ 10న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఆర్జేడీ-కాంగ్రెస్‌- కూటమికే జైకొట్టాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com