ఎన్నికల అధికారిపై ట్రంప్ వేటు

- November 18, 2020 , by Maagulf
ఎన్నికల అధికారిపై ట్రంప్ వేటు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ తను చేస్తున్న ఆరోపణలకు విరుద్ధంగా స్పందిన ఓ ప్రముఖ ఎన్నికల నిర్వహణ అధికారిపై డోనల్డ్ ట్రంప్ వేటువేశారు.

ఓటింగ్‌, కౌంటింగ్‌లపై వ్యాఖ్యలు చేసినందుకే సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సిసా) అధిపతి క్రిస్ క్రెబ్స్‌పై వేటు వేసినట్లు ట్రంప్ స్పష్టంచేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ట్రంప్ అంగీకరించని సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపిస్తున్నారు.

అయితే, అమెరికా చరిత్రల్లోనే అత్యంత భద్రంగా, నిజాయితీగా జరిగిన ఎన్నికలు ఇవేనని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజంలేదని, అవన్నీ వదంతులేనని సిసా వెబ్‌సైట్ కొట్టిపారేసింది. దీంతో సిసా అసిస్టెంట్ డైరెక్టర్ బ్రియన్ వారేతో గతవారం వైట్‌హౌస్ రాజీనామా చేయించింది. అనంతరం సిసా డైరెక్టరైన క్రెబ్స్‌ పైనా తాజాగా చర్యలు తీసుకుంది.

''ఎన్నికల నిర్వహణ వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయని చెబుతున్న ఆరోపణలపై 59 మంది ఎన్నికల భద్రతా నిపుణులు విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇవన్నీ వదంతులు మాత్రమే'' అని క్రెబ్స్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆయన్ను తొలగిస్తున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత భద్రంగా జరిగాయని గతవారం ప్రకటించిన సీనియర్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారుల్లో ఆయన కూడా ఒకరు.

''ఓటింగ్ యంత్రాల గురించి నిరాధారమైన వార్తల్ని రీట్వీట్ చేయొద్దు. అవి అమెరికా అధ్యక్షుడు చేసిన ట్వీట్లు అయినా సరే..'' అంటూ ఓ ఎన్నికల నిపుణుడు చేసిన ట్వీట్‌ను కూడా క్రెబ్స్ రీట్వీట్ చేశారు.

తనపై చర్యలు తీసుకున్న తర్వాత కూడా క్రెబ్స్ మరో ట్వీట్‌ చేశారు.

''నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదని భావిస్తున్నాను. నేడు వ్యవస్థలకు మద్దతు పలకండి. భవిష్యత్‌ను భద్రం చేసుకోండి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు'' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com