సైక్లింగ్ సంస్కృతిని ప్రోత్సహించడం తక్షణావసరం: ఉపరాష్ట్రపతి
- November 28, 2020
న్యూఢిల్లీ:సైక్లింగ్ సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు నగరాలు, పట్టణాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేకమైన ట్రాక్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తక్కువ ఖర్చుకే, కాలుష్యరహిత ప్రయాణంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సైక్లింగ్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు.
‘కరోనానంతర ప్రపంచంలో సైక్లింగ్ పాత్ర' అంశంపై ఏర్పాటుచేసిన అంతర్జాతీయ అంతర్జాల వేదికనుద్దేశించి ఉపరాష్ట్రపతి శనివారం ప్రసంగించారు. పర్యావరణ హిత రవాణా వ్యవస్థను విస్తారంగా వినియోగించేలా భారీ ప్రజా చైతన్యం తీసుకురావాలని.. ఇందుకుగానూ తరచుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్న ఆయన, ఈ అంతర్జాతీయ వెబినార్‌ను సరైన సమయంలో నిర్వహిస్తున్నారని అభినందించారు. భూమండలాన్ని పర్యావరణహితంగా, పచ్చగా, భద్రంగా, క్షేమంగా ఉంచేందుకు అన్నిదేశాలు సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కరోనా మహమ్మారి కారణంగా మన జీవితాల్లో, మనం ఏం కొనాలి, ఏం వాడాలి, మన సమయం, మన రవాణా ఇలా ప్రతి అంశంలోనూ మార్పులు వచ్చాయన్న ఉపరాష్ట్రపతి.. ఆంక్షల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాహనాల వాడకంలో తగ్గుదల కనబడుతోందని.. నడకతోపాటు సైకిళ్ల వినియోగం పెరిగిందని గుర్తుచేశారు.
జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా మన జీవితాల్లో పెరుగుతున్న ముప్పును తగ్గించుకునేందుకు సైక్లింగ్ ఉత్తమమైన మార్గమన్న ఉపరాష్ట్రపతి, ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి ఎన్నో లాభాలుంటాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వీటితో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కనీస అవసరాలకు సైకిళ్లనే ఎక్కువగా వినియోగిస్తారన్నారు. మరోసారి మనం సైకిళ్లవైపు దృష్టిసారించేందుకు కరోనా అవకాశం కల్పించిందని, అందుకోసం.. మళ్లీ సైక్లింగ్‌ను విరివిగా వినియోగించేందుకు పట్టణ, నగర పరిపాలన సంస్థల విధాననిర్ణేతలు ప్రత్యేక చొరవతీసుకోవాలని, సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మించడం ద్వారా ప్రజలను సైక్లింగ్ వైపు ప్రోత్సహించాలని సూచించారు.
‘యూరప్, చైనా, అమెరికా వంటి దేశాల్లో పట్టణ సైక్లింగ్ నెట్‌వర్క్‌ల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలోనూ సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు విస్తృత అవకాశాలున్నాయి. ఇందుకు అనుగుణంగా మౌలికవసతుల కల్పనను పెంచాల్సిన అవసరం ఉంది’ అని ఉపరాష్ట్రపతి సూచించారు. సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ఇది సరైన తరుణమన్న ఆయన.. శబ్దకాలుష్యాన్ని తగ్గించడంతోపాటు రహదారి భద్రతను ప్రోత్సహించడం, ఇంధన దిగుమతి ఖర్చులను తగ్గించుకునేందుకు వీలవుతుందన్నారు.
భారతదేశంలో స్వల్పదూరాలకు ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగానికి బదులు సైకిళ్లను వినియోగిస్తే ఏడాదికి రూ.24.3 బిలియన్ డాలర్ల (దాదాపుగా లక్షా 79వేల కోట్ల రూపాయలు) ఆదా చేయవచ్చన్న తాజా నివేదికలను కూడా ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ఉటంకించారు. సైక్లింగ్‌కు అనువైన వాతావరణాన్ని, ఏర్పాట్లను కల్పించలేని కారణంగా సమాజంలోని అన్ని వర్గాలకు సైక్లింగ్ దూరమవుతూ వస్తోందన్న ఆయన, కరోనానంతర ప్రపంచం పచ్చగా, ఆరోగ్యంగా ఉండాలంటే నగరాలు, పట్టణాల్లో పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కాలుష్యంలేని సమాజం కోసం సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మించాలన్నారు. ఇందుకు అనుగుణంగా పథకాలు, విధానాల్లో మార్పులు తీసుకురావాలన్నారు. పబ్లిక్ బైక్ షేరింగ్ వ్యవస్థను, కార్బన్ క్రెడిట్ వ్యవస్థను సృష్టించడం ద్వారా సైక్లిస్టులకు లబ్ధిచేకూర్చడం, ఈ-బైస్కిల్ లను ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ సైక్లింగ్ అలయెన్స్ అధ్యక్షురాలు రాలుకా ఫైజర్, సంస్థ ఉపాధ్యక్షుడు, కోశాధికారి డీవీ మనోహర్,పారిస్ డిప్యూటీ మేయర్, యురోపియన్ సైక్లిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు క్రిస్టోఫె నజ్దోవ్స్కీ,ఎన్డీఎంసీ చైర్మన్ ధర్మేంద్ర, స్మార్ట్ సిటీస్ మిషన్, మిషన్ డైరెక్టర్ కునాల్ కుమార్, చండీగఢ్ స్మార్ట్ సిటీ కమిషన్, సీఈవో కమల్ కిషోర్ యాదవ్ తోపాటు వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు