ఏలూరును వణికిస్తున్న అంతుపట్టని వ్యాధి..పిట్టల్లా పడిపోతున్న జనాలు..

- December 06, 2020 , by Maagulf
ఏలూరును వణికిస్తున్న అంతుపట్టని వ్యాధి..పిట్టల్లా పడిపోతున్న జనాలు..

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో భయానక పరిస్థితి నెలకొంది. ఉన్నట్లుండి నోటి వెంట నురగలు కక్కుతూ చిన్నారులు, యువకులు, వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఏలూరులోని పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట, వంగాయగూడెం, కొబ్బరితోట ప్రాంతాల్లో బాధితులు అత్యధికంగా మూర్చతో పడిపోతున్నారు. ఇలా స్థానికులందరూ ఒక్కొక్కరుగా దాదాపు 140 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ఏలూరు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

కాగా, గత మూడు రోజులుగా తాగునీరు రంగు మారి వస్తుందని బాధితులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని బోరున విలపిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆస్పత్రిలో చేరినవారెవరికీ ప్రాణాపాయం లేదని డీసీహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ వెల్లడించారు. చికిత్స అనంతరం కోలుకుతున్న బాధితుల్లో కొందరిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంతమంది అస్వస్థతకు గురవడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com