తెలంగాణలో శుక్రవారం నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్‌

- December 10, 2020 , by Maagulf
తెలంగాణలో శుక్రవారం నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్‌

హైదరాబాద్:తెలంగాణలో శుక్రవారం నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైకోర్ట్‌ ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 3 నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్‌లు శుక్రవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. హైకోర్ట్‌లో విచారణ, ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రజలకు నిరీక్షణ ఫలించింది. హైకోర్ట్‌ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

అటు.. ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై గురువారం హైకోర్ట్‌లో సుదీర్ఘ విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్‌లపై ఎలాంటి స్టే ఇవ్వలేదని హైకోర్ట్‌ మరోసారి స్పష్టం చేసింది. పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేస్తే అభ్యంతరం లేదని తెలిపింది. మరోవైపు... CARD పద్దతిలో రిజిస్ట్రేషన్‌లు కొనసాగించాలని పిటిషన్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చూడాలని అడ్వకేట్ జనరల్ హైకోర్ట్‌కు తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు ప్రాపర్టీ ట్యాక్స్‌ గుర్తింపు కార్డ్ తప్పనిసరిగా ఉండాలని అడ్వకేట్‌ జనరల్‌ విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డ్‌, ధరణిలో ఎంట్రీ వివరాలు అడగవద్దని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్ట్ స్టే ఇవ్వకుండా, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఆపిందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ధరణిపై మాత్రం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్‌ అదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు చేసుకోవచ్చని హైకోర్ట్‌ తెలిపిన నేపథ్యంలో.. ప్రభుత్వ సానుకూల నిర్ణయం మేరకు శుక్రవారం నుంచి ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్‌లు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com