ఏపి డీజీపీకి చంద్రబాబు లేఖ

- December 12, 2020 , by Maagulf
ఏపి డీజీపీకి చంద్రబాబు లేఖ

అమరావతి:ఏపి డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖరాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో అరాచక పాలన, రూల్ ఆఫ్ లా అదృశ్యం, శాంతిభద్రతలు క్షీణించాయని, అవినీతి అరాచక శక్తుల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారంటూ ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో వరుస దాడులు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యానికి గండికొట్టారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి మాఫియా శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయని.. చట్టబద్దమైన పాలన స్థానంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని .. పోలీసులలో అధికార వైసీపీ నాయకులతో కుమ్మక్కై, వారి చెప్పుచేతల్లో పనిచేయడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసిపి మాఫియా ఈసారి పడగ విప్పింది.. కురబలకోట మండలం అంగళ్లు వద్ద అధికార పార్టీ వైకాపాకు చెందిన దాదాపు 200మంది టిడిపి నాయకుల వాహనాలపై దాడికి పాల్పడి ధ్వంసం చేయడమే కాకుండా.. టీటీడీపీ కార్యకర్తలను తీవ్రంగా గాయపర్చారని పోలీసు చీఫ్ దృష్టికి తీసుకెళ్లారు. 11 డిసెంబర్ 2020న టిడిపి నాయకులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి, గుల్లోల్ల శంకర్ యాదవ్, దమ్మాలపాటి రమేష్, చల్లా రామచంద్రారెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాశ్ తదితరులు తంబళ్ల పల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలానికి పర్యటనకు వెళ్లారు. మరణించిన టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి వారంతా వెళ్లడం జరిగింది. ఉదయం 11.30గం ప్రాంతంలో వారంతా బి కొత్తపేట మండలానికి వెళ్తుండగా అంగళ్లు వద్ద వైకాపాకు చెందిన సుమారు 200మంది అడ్డుకున్నారు. ఒక్కసారిగా వారంతా రాళ్లు, కర్రలతో వాహనాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు రాచకొండ మధుబాబును మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.  మరో నాయకుడు చిన్నబాబుతో సహా ఇంకో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ విధ్వంసక దాడి అంతటితో ఆగకుండా ఒక జర్నలిస్ట్ పైకూడా దాడిచేశారు, అతని కెమెరాను లాక్కున్నారని పేర్కొన్నారు. 

ఇక, ఈ దాడికి నిరసనగా టిడిపి నాయకులంతా న్యాయం కోసం శాంతియుతంగా అక్కడికక్కడే నిరసన తెలిపితే.. పోలీసులు వెంటనే 144సెక్షన్ ను ప్రకటించి, నిరసనలో ఉన్న టిడిపి నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసిశారని మండిపడ్డారు చంద్రబాబు.. దాడికి పాల్పడిన అధికార వైసిపి వారిని అరెస్ట్ చేయకుండా, శాంతియుతంగా నిరసన చెప్పే బాధిత టిడిపి నాయకులను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నిందితులకు బదులుగా బాధితులను అరెస్ట్ చేయడం ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే కాకుండా, న్యాయాన్ని అపహాస్యం చేయడమే విడ్డూరంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలపై వేధింపులు, చిత్రహింసలు, హత్యల కేసులు అత్యధికం కావడం ఏమాత్రం యాదృచ్ఛికమైనవి కావనేది, దళిత సమాజంపై దాడులను గమనిస్తే ఎవరికైనా తెలిసిపోతుందన్నారు. ఇప్పటి వరకు వెలుగులోకి వస్తున్న ఈ దుష్పరిణామాలు అన్నింటినీ గమనిస్తుంటే, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుదేలు కావడం మరెంతో దూరంలో లేదని అనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com