ఏలూరు ఘటన పై ప్రాథమిక నివేదిక గురించి ఉపరాష్ట్రపతికి వివరించిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి

- December 12, 2020 , by Maagulf
ఏలూరు ఘటన పై ప్రాథమిక నివేదిక గురించి ఉపరాష్ట్రపతికి వివరించిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి

న్యూ ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు పట్టణంలో అంతు చిక్కని వ్యాధి సృష్టిస్తున్న అయోమయం గురించి తెలుసుకునేందుకు రంగంలోని దిగిన కేంద్ర వైద్య బృందాలు సమస్య గురించి వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని ఈ రోజు ఢిల్లీలోని ఆయన నివాసంలో, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఉమ్మడి కార్యదర్శి  లవ్ అగర్వాల్, ఇతర అధికారులు కలిశారు. ప్రస్తుతం ఏలూరులో పరిస్థితి గురించి తమ ప్రాథమిక నివేదిక అందిందని, తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపిన నేపథ్యంలో వెంటనే ఉపరాష్ట్రపతి ఆరోగ్య శాఖ మంత్రి  హర్షవర్థన్ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు అధికారులతో చర్చించగా, ఉపరాష్ట్రపతి చొరవతో ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన నిపుణులు, పూణెకు చెందిన వైరాలజిస్టుల బృందం ఈ నెల 8న ఏలూరు వచ్చి వివిధ కోణాల్లో వ్యాధి గురించి అధ్యయనం చేస్తున్న  విషయం విదితమే.

ఏలూరులో వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర ఆరోగ్య బృందాల ప్రాథమిక అధ్యయన నివేదికను ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉపరాష్ట్రపతికి వివరించారు. సమగ్ర నివేదికను కేంద్ర బృందాలు ఢిల్లీ చేరాక సిద్ధం చేస్తామని, అవసరమైన ఆరోగ్య సూచనలు రాష్ట్రానికి ఇస్తామని తెలియజేశారు.

ప్రస్తుతం ఏలూరులో కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించిందని, 11వ తేదీన రెండు కేసులు మాత్రమే నమోదైన విషయాన్ని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు.

ఏలూరులో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని వారికి ఉపరాష్ట్రపతి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com