మహోన్నత దర్శకుడు బాపు

- December 21, 2020 , by Maagulf
మహోన్నత దర్శకుడు బాపు

వంశీ వ్యవస్థాపకులు కళాబ్రహ్మ, సేవా మహాత్మ, శిరోమణి,డా వంశీ రామరాజు నిర్వహణలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ చిత్రకారుడు బాపు 87 వ జయంతిని పురస్కరించుకుని 15 అంతర్జాతీయ సంస్థలతో కలిసి  వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, వేగేశ్న ఫౌండేషన్ ఇండియా, అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాలంలో డిసెంబర్ 20 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12 గంటల పాటు జరిగిన బాపు పాటకు పట్టాభిషేకం  కార్యక్రమంలో 5 ఖండాల లోని 10 దేశాలలోని 50 మంది గాయనీ గాయకులు బాపు దర్శకత్వం వహించిన చిత్రాల నుంచి 130 ఆణిముత్యాల వంటి పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాపు అభిమానులను తమ గానంతో అలరించారు...చి అనఘాదత్త రామరాజు ప్రార్థన తో కార్యక్రమం ప్రారంభం అయింది..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్యాలముగ్గు నాయిక సంగీత ఆ చలన చిత్ర దర్శకులు బాపుకు ఘన నివాళి అర్పిస్తూ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మహోన్నత దర్శకుడుగా, మహామనిషిగా కీర్తించారు.. ముత్యాలముగ్గు చిత్రంలో తను ఏ విధమైన మేకప్ లేకుండా నటించానని, కొన్ని సన్నివేశాలలో బాపు ఎలా నటించాలో కూడా నటించి చూపించారని, బాపు-రమణల రుణం తీర్చుకోలేనని  తనను అందరూ ముత్యాలముగ్గు సంగీత అంటూ గౌరవిస్తారనీ, ఆ గౌరవం వారి వల్లేనని చెప్పారు.. అంతేకాకుండా ఆ చిత్రంలో తాను నటించిన సన్నివేశంలోని "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" పాట పాడి వినిపించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా కె.వి రమణ మాట్లాడుతూ "బాపు కు ఎంతో ఆలస్యంగా పద్మశ్రీ వచ్చిందనీ, కొంత మందికి పద్మశ్రీ లతో సంబంధం లేకుండానే వారి ప్రతిభ ద్విగుణీకృతంగా  వెలుగుతుందని "అన్నారు..ఈ కార్యక్రమంలో ప్రజానటి,కళాభారతి జమునా రమణా రావు మాట్లాడుతూ బాపు చిత్రంలో తను పోషించిన కైక పాత్రను గుర్తు చేసుకున్నారు..ప్రముఖ  నేపథ్య గాయకులు జి ఆనంద్, అమెరికా హాస్యబ్రహ్మ డా వంగూరి చిట్టెన్ రాజు, సింగపూర్ కళా సంస్థ శ్రీ సాంస్కృతిక కళాసారధి  వ్యవస్థాపకులు రత్న కుమార్, శారదా కళా సమితి అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు, మలేషియా తెలుగు సంఘం ఉపాధ్యక్షులు డా వెంకట ప్రతాప్, తెలుగు ఉపాధ్యాయిని సత్యా దేవి మల్లుల, డాక్టర్ తోటకూర ప్రసాద్, అమెరికా గానకోకిల శారద ఆకునూరి, ప్రముఖ సినీ  దర్శకులు రేలంగి నరసింహారావు ప్రసంగించారు.. భారతదేశం, లండన్ ,అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్ ఆస్ట్రేలియా, హాంకాంగ్, సౌత్ ఆఫ్రికా, మలేషియా దేశాలనుంచి గాయనీ గాయకులు పాల్గొన్నారు..
ఈ కార్యక్రమం వంశీ గ్లోబల్ అవార్డ్స్ వారి వంశీ గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయినట్లుగా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com