గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయాలి...గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి: గల్ఫ్ JAC

- December 30, 2020 , by Maagulf
గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయాలి...గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి:  గల్ఫ్ JAC

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బోర్డు ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాల తగ్గింపు, గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన కార్మికుల జీతాల దొంగతనం అనే అంశాలపై గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న మంద భీంరెడ్డి

టిఆర్ఎస్ పార్టీ 2014 లో ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన ప్రకారం 'తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం బోర్డు' (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని, సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ కోరారు.

కొత్తగా గల్ఫ్ వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం సెప్టెంబర్ లో జారీచేసిన రెండు సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని బిఎలెఫ్ ట్రేడ్ యూనియన్ నాయకులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం,  చర్చలు చేపట్టకుండా ఒక్క కలం పోటుతో  ఏకపక్షంగా గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలు  తగ్గించడం భారత్ ను 'చీప్ లేబర్' (తక్కువ జీతానికి పనిచేసే కార్మికులు) అడ్డాగా  మార్చడమే. ఇది వెట్టిచాకిరి, బానిసత్వానికి దారి తీస్తుంది. ఇది మానవ హక్కుల, కార్మిక హక్కుల ఉల్లంఘన అని ఆయన అన్నారు. 

కరోనా సందర్బంగా గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు మరియు బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ఇప్పించాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. 

రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న సిస్టర్ లిసీ జోసెఫ్

'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలని) విదేశీ లేబర్ కోర్టులలో న్యాయ పోరాటానికి కావలసిన 'లీగల్ ఎయిడ్' (న్యాయ సహాయం) అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి కోరారు. 

రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్నఅంబాసిడర్ వినోద్ కుమార్

రిటైర్డ్ ఇండియన్ అంబాసిడర్ డా బిఎం వినోద్ కుమార్, సిస్టర్ లిసీ, గల్ఫ్ దేశాల నుండి వచ్చిన జనగామ శ్రీనివాస్, కుంబాల మహేందర్, గంగుల మురళీధర్, సయిండ్ల రాజిరెడ్డి, ఇలియాస్, హజరా సాలం, రేణుక, ఆన్, సిద్ధి రాములు, బొంగు వెంకటేష్, మూర్తి తదితరులు ప్రసంగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com