ఖతార్: కోవిడ్ వ్యాక్సిన్ పై అనుమానాల నివృతికి ఆరోగ్య శాఖ కసరత్తు

- December 31, 2020 , by Maagulf
ఖతార్: కోవిడ్ వ్యాక్సిన్ పై అనుమానాల నివృతికి ఆరోగ్య శాఖ కసరత్తు

కోవిడ్ 19 వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఖతార్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సమాజ ఆరోగ్య భద్రతకు 70 శాతం మందికి వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. అప్పుడే మళ్లీ సాధారణ స్థాయి పరిస్థితులు నెలకొనేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. క్లినికల్ ట్రయల్స్ తర్వాత అత్యవసరంగా ఆమోదం పొందిన ఫైజర్-బయోన్టెక్ వ్యాక్సిన్ పై ప్రజల్లో ఇంకా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. సైడ్ ఎఫెక్ట్స్ పై ప్రజల్లో ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో...ప్రజల సందేహాలను తీర్చేలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది ఆరోగ్య శాఖ. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పలువురు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న వెంటనే శరీరంలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందవని...రెండో డోసు తర్వాతే తగిన స్థాయిలో యాంటీ బాడీల అభివృద్ధి జరుగుతుందని వివరించారు. అందుకే తొలి డోసు తర్వాత కూడా ఆరోగ్య శాఖ సూచించినట్లు ఫేస్ మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ కొత్తదన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని..ఇది ఎంత కాలం వైరస్ ను నిలువరిస్తుందని ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పలేమని స్పష్టతనిచ్చారు. అయితే..నాలుగైదు నెలలు మాత్రం ఖచ్చితంగా వైరస్ నుంచి కాపాడుతుందని..ఇది 95 శాతం మేర ప్రభావ వంతంగా పని చేస్తుందని మాత్రం చెప్పగలమన్నారు. ఇక రెండు డోసులు వేసుకున్న తర్వాత కూడా కొద్ది మందిలో తగినంతగా యాంటీబాడీలు అభివృద్ధి చెందకపోవచ్చని అన్నారు.

ఇక ఫైజర్-బయోన్టెక్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న ఆందోళన వ్యక్తం చేసిన వారికి సమాధానం ఇస్తూ...వ్యాక్సిన్ నూతనంగా వచ్చిన మాట నిజమే అయినా..అందరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండాల్సిన అవసరం లేదని వివరించారు. శరీర తత్వాన్ని బట్టి కొద్ది మందిలో మాత్రం స్వల్పంగా జ్వరం, తలనొప్పి, వికారంగా అనిపించటం, ఇంజెక్షన్ చేసిన చోట దురద, మంట వంటి లక్షణాలు వెలుగు చూశాయని, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఇతర వ్యాక్సిన్ వేసినప్పుడు కూడా సాధారణంగా కనిపించే లక్షణాలే కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. కొత్త వ్యాక్సినే అయినా....ఇప్పటివరకు అమెరికాలో 20 లక్షల మంది, బ్రిటన్ లో పది లక్షల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్న విషయం గమనించాలన్నారు. ఖతార్ తో పాలు పలు దేశాలు ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తున్నాయన్నారు. ఇప్పటివరకు ఆందోళన చెందాల్సిన స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని వివరించారు. అయితే..గర్భిణులు, 16 ఏళ్ల లోపు వారికి మాత్రం ప్రస్తుతానికి వ్యాక్సిన్ అందించటం లేదని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com