తెలంగాణ ను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ

- January 08, 2021 , by Maagulf
తెలంగాణ ను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ

ఏడాది కాలంగా కరోనావైరస్ తో వణికిపోతున్న ప్రజలను భయపెట్టటానికి కరోనా స్ట్రైయిన్ ఒకటి అడుగు పెట్టింది. దాని గురించి జాగ్రత్తలు తీసుకునే లోపలే దేశంలోకి బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రవేశించి దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ప్రజలను కలవరపెడుతోంది. బర్డ్ ఫ్లూ-ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (Avian Influenza) వైరస్ ఇప్పటికే రాజస్థాన్‌లో 400 పక్షులు దీనిబారిన పడి మరణించాయి. ఈ వైరస్ హిమాచల్ ప్రదేశ్, కేరళ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వ్యాపించింది. ఈ వైరస్ పక్షుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలోని కొన్నిజిల్లాలో ఈవైరస్ సోకినట్లు అనుమానాలు రావటం ఇప్పుడు కలకలం రేపుతోంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌లో 120 నాటు కోళ్లు మృతి చెందాయి. స్థానికంగా పశు వైద్యాధికారులు వాటిని పరీక్షించి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని తెలిపినా స్థానికుల్లో ఆందోళన మాత్రం తగ్గలేదు.

అయితే మృతి చెందిన కోళ్ళను పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్ కు పంపించిన నమూనాల ఫలితాలు వచ్చే వరకు వరంగల్ అర్బన్ జిల్లాలో సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. అటు పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో వారం రోజులుగా 300 కోళ్లు మృతి చెందాయి. వాటిని స్థానికంగా ఉండే పంట కాల్వలో వేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

బర్డ్ ఫ్లూ అనే పేరు బైటకొచ్చినప్పుడల్లా చికెన్ రేట్లు పడిపోవడం, మ్యాడ్ కౌ అనే పుకార్లు వ్యాపించినప్పుడల్లా మటన్ రేట్లు నేలను తాకడం తెలిసిందే. తాజాగా.. బర్డ్ ఫ్లూ వార్తలు చికెన్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు రేట్లు తగ్గించి అమ్మడానికి వ్యాపార వర్గాలు ఇష్టపడకపోయినా డిమాండ్ తగ్గిపోవడంతో నష్టాలపాలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజల్లో బర్డ్ ఫ్లూ తో కొత్త ఆందోళన మొదలైంది. గత వారం రోజులుగా బర్డ్‌ఫ్లూ సోకి పక్షులు మరణిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో దాదాపుగా 30వేల పక్షులు మరణించినట్లు చెబుతున్నారు. కోళ్లు, బాతులకు వైరస్‌ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. కాగా….తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెబుతున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 1300 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ జరుపుతూ బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రభల కుండా అనేక చర్యలు తీసుకుంటున్నామని తలసాని తెలిపారు.

అటు ఏపీలోని పులికాట్ సరస్సుకి కూడా బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది, నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సకు ఏటా సైబీరీయా పక్షులు వలస వస్తుంటాయి. జిల్లాలో ప్రతి ఏటా పక్షుల పండగ పేరుతో ఈ సీజన్లో ప్రత్యేక కార్యక్రమం కూడా చేపడతారు. బర్డ్ ఫ్లూ భయంతో అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాతపడ్డాయి. అన్ని రకాల పక్షులపై పూర్తి స్థాయిలో నిఘా పెంచాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వ్యాధి నిరోధించకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా సూచనలు జారీ చేసింది. ఫ్లూ నివారణ చర్యలు, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పాడి పశుసంవర్థకశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది.

బర్డ్ ఫ్ల్యూ బారినపడి చనిపోయిన వాటిలో స్థానిక అటవీ జీవులతోపాటు వలస పక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను ఐసీఏఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీసెస్, భోపాల్ లో పరీక్షించగా.. హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ గా ఉన్నట్లు నిర్ధరణ అయిందని కేంద్ర పాడి పశుసంవర్థకశాఖ తెలిపింది. ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉంది కాబట్టి.. అలా జరగకముందే అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com