పండగ చేస్కో: రివ్యూ
- May 29, 2015
యునైటెడ్ మూవీస్ నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం సంగీతం : తమన్ నిర్మాత : కిరీటి పరుచూరి దర్శకత్వం : గోపీచంద్ మలినేని విడుదల తేదీ : 29 మే 2015 రామ్ నటించిన చివరి మూడు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. విజయం కోసం కొత్త కథలు, స్క్రిప్ట్స్ పై దృష్టి పెట్టడంతో గత ఏడాది ఒక్క చిత్రం కూడా విడుదల చేయలేకపోయానని రామ్ చెప్పాడు. రెండున్నర ఏళ్ళుగా కష్టపడిన 'పండగ చేస్కో' నేడు విడుదలయింది. ఈ చిత్రం అతనికి విజయాన్ని అందించిందా.. కథ కొత్తగా ఉందా.. చిత్రం ఎలా ఉందో.. రివ్యూ చదివి తెలుసుకోండి. కధ :: కార్తీక్(రామ్) పోర్చుగల్లో ఉంటాడు. పాతికేళ్ళకు మల్టీమిలీనియర్ అయిన కుర్రాడు. తను డిజైన్ చేసిన యాప్, గేమ్ అప్లికేషన్ వల్ల కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. మనుషులకు తక్కువ, మనీకి ఎక్కువ విలువిస్తాడు. తనలా ఆలోచించే అనుష్క అలియాస్ స్వీటీ (సోనాల్ చౌహాన్)ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అనుష్కతో పెళ్లి కార్తీక్ తల్లికి ఇష్టం లేదు. ఎంగేజ్మెంట్ జరిగిన రోజున ఇండియాలో ఉన్న తన అన్నయ్య, అన్నయ్యతో గొడవలు గురించి కొడుకుతో చెప్తుంది. వెంటనే కార్తీక్ ఇండియా బయలుదేరుతాడు. తన మావయ్య ఇంట్లో పండగ తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. తన ప్రయత్నంలో భాగంగా మావయ్య కూతురు దివ్య(రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమిస్తాడు. దివ్యకు కార్తీక్ అంటే ఇష్టం లేదు. కార్తీక్ అంటే దివ్యకు ఎందుకు కోపం..? అనుష్కతో ఎంగేజ్మెంట్ అతనికి ఎన్ని చిక్కులు తీసుకొచ్చింది..? మావయ్య ఇంట్లో గొడవలను చక్కదిద్దడానికి, వాళ్ళ మనసుల్లో ప్రేమను చిగురింపజేయడానికి ఎంత కష్టపడ్డాడు..? మధ్యలో వీకెండ్ వెంకట్రావ్(బ్రహ్మానందం) ఎలా సహాయపడ్డాడు..? అనేది చిత్రం చూసి తెలుసుకోవాలి. నటీనటుల పనితీరు :: ఎప్పటిలా రామ్ హుషారైన, చురుకైన కుర్రాడి పాత్రలో చలాకీగా నటించాడు. పాటల్లో డాన్స్ బాగా చేశాడు. ఫైట్స్ బాగున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్.. ప్రతి చిత్రంలో తన నటనతో, అందంతో మరింత కట్టిపడేస్తుంది. పొగరుబోతు అమ్మాయి పాత్రలో సోనాల్ చౌహాన్ సరిగ్గా సరిపోయింది. 'దొరికాడే దొరికాడే..' పాటలో బికినీతో అందాలను ఆరబోసింది. సోనాల్ అల్ట్రా గ్లామరస్ కాస్ట్యూమ్స్.. సెక్సీ చూపులు యువతను ఆకట్టుకుంటాయి. అలవాటైన పాత్రలో వీకెండ్ వెంకట్రావ్ గా బ్రహ్మీ మరోసారి నటించాడు. ప్రతి చిత్రంలో హీరో చేతిలో బకరా అయ్యే పాత్రలో తన శక్తివంచన లేకుండా నవ్వించే ప్రయత్నం చేశాడు. కొందరు నవ్వితే.. మరికొందరికి రొటీన్ అనిపిస్తుంది. రెండు మూడు సన్నివేశాల్లో వెన్నెల కిషోర్ నవ్వించాడు. స్వర్గీయ ఎమ్మెస్ నారాయణ పాత్రకు డబ్బింగ్ సెట్ కాకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. సంపత్ రాజ్, సాయి కుమార్, రఘుబాబు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, జయప్రకాష్ రెడ్డి ఇలా చాలా మంది ఆర్టిస్టులు చిత్రంలో నటించారు. వారు బాగానే నటించినా ఆయా పాత్రల్లో కొత్తదనం లేదు. సాంకేతికవర్గం సంగీతం :: తమన్ పాటల్లో కొత్తదనం, సాహిత్యంలో విలువలు వెతకడం అత్యాశే అవుతుందేమో..! నేపధ్య సంగీతాన్ని గమనిస్తే చాలా చిత్రాలు గుర్తొస్తాయి. తమన్ సంగీతంలో సంబంధం లేకుండా పాటలన్నిటినీ అందంగా చిత్రీకరించారు. సన్నివేశాలను కూడా రంగుల హరివిల్లుగా తీర్చిదిద్దారు. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. పోర్చుగల్, ఇండియాలో లొకేషన్లను అందంగా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. ఫైట్స్ ఓకే. రామ్ స్టైలింగ్ విషయంలో ప్రయోగాలు ఎక్కువయ్యాయి. సన్నివేశాల్లో కాస్ట్యూమ్స్ బాగున్నాయి. కానీ, పాటల్లో రంగులతో వింతలు చేశారు. యువతను ఎంతవరకు ఆకర్షిస్తాయో..? చూడాలి. కథ దర్శకత్వం :: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లోపం లేదు. అతను ఎంపిక చేసుకున్న కథలోనే ప్రేక్షకులను కట్టిపడేసి సత్తా, కనికట్టు చేసే మాయ లేదు. వెలిగొండ శ్రీనివాస్ రాసిన కథ.. రామ్ కెరీర్లో హిట్ సినిమా రెడీ, ఇండస్ట్రీ హిట్ 'అత్తారింటికి దారేది'లను గుర్తుకు తెస్తుంది. పాత కథను సరికొత్తగా ఆవిష్కరించడానికి, ప్రేక్షకులను అలరించడానికి గోపీచంద్ చాలా తీవ్రంగా కృషి చేశాడు. ప్రతి ఫ్రేమ్, సీన్, సాంగ్ కలర్ ఫుల్ గా తీశాడు. కథలో సత్తా లేనప్పుడు ఎన్ని కమర్షియల్ హంగులున్నా అనవసరమే. విశ్లేషణ :: తెలుగు దర్శకులు, రచయితల వద్ద కొత్త కథలు లేవా..? అనే సందేహం కలుగుతుంది ఈ చిత్రం చూసిన తర్వాత. ప్రధమార్ధంలో హీరో పరిచయ గీతం, ప్రేమలో పడడం, మధ్యలో ప్రతినాయకుడితో ఓ ఫైట్, రెండు పాటలతో ఇంటర్వెల్ కార్డు వద్ద ట్విస్ట్... ద్వితీయార్ధంలో అంతా ఓ ఇంట్లో చేరి కామెడీ చేయడం, బ్రహ్మానందంను బకరా చేయడం.. రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ శ్రీనువైట్ల ఫార్ములా. దానికి అతీతంగా 'పండగ చేస్కో' ఏమి లేదు. కాకపోతే 'అత్తారింటికి దారేది' క్లైమాక్స్ తో కొత్త కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. రెడీ సినిమా ప్లస్ అత్తారిల్లు క్లైమాక్స్ ఈజ్ ఈక్వల్ టు 'పండగ చేస్కో'. లాజిక్స్, కొత్త కథలు అవసరం లేదు, లౌక్యం తరహాలో కాస్త కామెడీ ఉంటే చాలు.. అనుకునే ప్రేక్షకులను 'పండగ చేస్కో' మెప్పిస్తుంది. మిగతా వారికి దండగలా అనిపిస్తుంది. పాత కథలో కొత్త కామెడీ చేయడం కోసం దర్శక రచయితలు చాలా కష్టపడ్డారు. బ్రహ్మానందం చేత ఎన్టీఆర్, బాలకృష్ణ స్పూఫ్ డైలాగులు చెప్పించారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'ను పేరడీ చేసి ఓ ఎపిసోడ్ చేశారు. చెప్పుకుంటూ పోతే చిత్రంలో ఇలా చాలానే ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు నవ్విస్తే.. మరికొన్ని సహనాన్ని పరీక్షించాయి. బ్రాహ్మి, కిషోర్ వెన్నెల అక్కడక్కడా కోన వెంకట్ మార్క్ పంచ్ డైలాగులతో నవ్వించారు. రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్.. రకుల్ ప్రీత్, సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత.. కాస్త కామెడీ.. అదే 'పండగ చేస్కో'. వీకెండ్ లో ముఖ్యమైన పనులు లేకపోతే.. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా.. సరదాగా రకుల్, సోనాల్, వీకెండ్ వెంకట్రావ్ అలియాస్ బ్రాహ్మిని చూడడానికి వెళ్ళండి. రేటింగ్ : 2/5 'పండగ చేస్కో' :: 'రెడీ'గా అత్తారిల్లు సినిమా.
మాగల్ఫ్.కాం రేటింగ్: 2.75/5
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









