హోరాహోరీగా టీ20

- February 23, 2016 , by Maagulf
హోరాహోరీగా టీ20

నేడు ఇండియా బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఢాకా: ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త సమరానికి నేడు తెరలేవనుంది. ఆసియా కప్‌లో తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. బుధవారమిక్కడ జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇండియా, ఆతిథ్య బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. టీ20ల్లో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌కు సన్నాహంగా జరుగుతున్న ఈ పొట్టి ఫార్మాట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సన్నద్ధమైంది. మరోవైపు బంగ్లాదేశ్‌ జట్టు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది. ఆసియా కప్‌ టోర్నీ తొలిసారిగా ట్వంటీ20 ఫార్మాట్‌లో జరుగుతున్నందున ఈ టోర్నీలో ఎవరు ఫేవరెటో చెప్పడం కష్టం.
ఎందుకంటే ఆసియా జట్లు ఉప ఖండంలో ఎక్కడ ఆడినా సొంత గడ్డపై ఆడినట్టే ఉంటుంది. ఇక్కడి స్పిన్‌ పిచ్‌లపై ప్రతి జట్టుకు మంచి అవగాహన ఉంది. బంగ్లాజట్టు ఈ టోర్నీ లో టైటిల్‌ ఫేవరెట్‌ కాకపోవచ్చు. కానీ సొంత గడ్డపై ఆ జట్టు చాలా ప్రమాదకర మైంది. ఈ మ్యాచ్‌లో ఎవరెవరి మధ్య తీవ్ర పోటీ ఉంటుందో ఓసారి చూద్దాం.
1. రోహిత్‌ ముస్తాఫిజుర్‌: వీరిద్దరి పోరును చూడకుండా ఉండలేం. ఎందుకంటే గతంలో వీరిద్దరు తారసపడినప్పుడు టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ కంటే ఈ ఎడమ చేతి సీమ్‌ బౌలర్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. కానీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను ముస్తాఫిజుర్‌ మునుపటిలా కట్టడి చేయడం కాస్త కఠినమైన పనే. అతని అత్యుత్తమమైన ఆఫ్‌ కట్టర్లు ప్రత్యర్థిని ఇబ్బంది పెడతాయనడంలో ఎటువంటి సందేహమూలేదు. కానీ ఈసారి అవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది కాలమే చెప్పాలి.2. శిఖర్‌ ధావన్‌ ముష్రఫే మోర్తజా: ఢిల్లిdకి చెందిన ఈ ఎడమ చేతి బ్యాట్స్‌మన్‌ కూడా మాంచి జోరు మీదున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ధావన్‌ అత్యధిక పరుగులు చేసిన వాడిగా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో కెప్టెన్‌ ధోనీ ఏదైతే కోరుకున్నాడో ధావన్‌, రోహిత్‌ కలిసి టీమిండియాకు అలాంటి ఆరంభాన్నే ఇచ్చారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లలో బంగ్లా కెప్టెన్‌ మోర్తజా తన స్వింగ్‌ బౌలింగ్‌తో ధావన్‌ను ప్రభావితం చేయొచ్చు. కానీ మోర్తజా తన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ పాటించినంత వరకు భద్రంగా ఉంటాడు. అది కాస్త అటు ఇటు అయిందంటే ధావన్‌ వీర బాదుడు ప్రారంభిస్తాడు.3. కోహ్లీ షకీబ్‌: ప్రస్తుతం కోహ్లీ తన బ్యాటింగ్‌లో ఎలాంటి తప్పులూ చేయడం లేదు. ప్రపంచ టీ20 క్రికెట్‌లో 50కిపైగా సగటుతో కొనసాగుతున్న ఏకైక క్రికెటర్‌ కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌లోనూ దాన్ని కొనసాగించే అవకాశముంది. షకీబ్‌ అల్‌ హసన్‌ చాలా తెలివైన బౌలర్‌. ఫ్లైటెడ్‌ డెలివరీస్‌తో బ్యాట్స్‌మన్‌ను బురిడీ కొట్టించగలడు. కుడి చేతి బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్‌ చేసేటప్పుడు మోర్తజా ఓ ప్రత్యేకమైన కోణంలో బౌలింగ్‌ చేస్తాడు. కనుక ఇతని బౌలింగ్‌లో కోహ్లీ కాస్త జాగ్రత్తగా ఆడాలి.4. ఆశిష్‌ నెహ్రా సౌమ్య సర్కార్‌: బంగ్లాదేశ్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ సౌమ్య సర్కార్‌ టాపార్డర్‌లో టీమిండియాకు ప్రమాదకారి. ఇతను క్రీజులో నిలదొక్కుకుంటే ఒంటి చేత్తో జట్టును గెలిపించగలడు. అంతేకాదు బంగ్లాదేశ్‌కు శుభారంభాన్ని అందించగలడు. అయితే సర్కార్‌ను ఆరంభంలోనే పెవిలియన్‌ పంపే ప్రయత్నాలు నెహ్రా చేయాలి. ఈ ఎడమ చేతి సీమర్‌ తన కుయుక్తులతో కూడినబౌలింగ్‌తో భారత్‌కు ఆరంభంలోనే వికెట్లు సంపాదించిపెట్టగలడు.5. ముష్ఫికర్‌ రహీం అశ్విన్‌: పాకెట్‌ సైజ్‌ డైనమైట్‌ లాంటివాడు ముష్ఫికర్‌ రహీం. ఇతడిని ఎక్కువ సేపు క్రీజులో ఉంచితే విధ్వంసం సృష్టించగలడు. ప్రస్తుత బంగ్లాదేశ్‌ జట్టులో ముష్ఫికర్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఈ వికెట్‌ కీపర్‌/బ్యాట్స్‌మన్‌ చాలా స్పష్టంగా బంతిని బౌండరీలకు తరలించగలడు. ఇతడిని అడ్డుకోవడం ఆశ్విన్‌ లాంటి స్పిన్నర్‌ వల్లే సాధ్యమవుతుంది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అశ్విన్‌ ఓవర్‌కు 3 ఎకానమీ రేట్‌తో పరుగులు ఇచ్చాడు. ఇతను పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకోవడమే కాకుండా వికెట్లు కూడా తీశాడు. వీరిద్దరి మధ్య పోరాటం తప్పక చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com