రాజ్ భవన్‌లో ఘనంగా 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

- January 25, 2021 , by Maagulf
రాజ్ భవన్‌లో ఘనంగా 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

విజయవాడ:ఎన్నికల సమయంలో ఓటు హక్కు ఒక యాంత్రిక సాధనం కాదని, అది ప్రజల చేతిలో శక్తివంతమైన ఆయుధం వంటిదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఓటు హక్కును వినియోగించడం అనేది ప్రజాస్వామ్యం యొక్క గొప్ప సంప్రదాయమన్నారు. రాజ్ భవన్ దర్బార్ హాలు వేదికగా సోమవారం గవర్నర్ హరిచందన్ 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ మాట్లాడుతూ, ఓటు హక్కు రాజ్యాంగం అందించిన అన్ని హక్కులకు తల్లి వంటిదన్నారు. ఓటు హక్కును సద్వినియోగ పరచటంతో యువత కీలక భూమిక పోషించాలన్నారు. ఓటు హక్కు రాజ్యాంగ విధి మాత్రమే కాక, దేశ పౌరుల అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని, సమాజం యొక్క వృద్ధికి గణనీయమైన సహకారాన్ని నిర్ధారిస్తుందన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటర్లు ఎటువంటి ఒత్తిడికి, భయానికి లోనుకాకుండా తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోగలిగే స్వేచ్ఛ ఉందన్నారు. ఓటు హక్కకు అర్హత సాధించిన తర్వాత యువత వారంతట వారు ముందుకు వచ్చి ఓటర్లుగా నమోదు  కావాలని గవర్నర్ పిలుపు నిచ్చారు. ముఖ్య ఎన్నికల అధికారి కె. విజయానంద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ) ఏర్పడగా, గత పదకొండు సంవత్సరాలుగా ఆతేదీన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను 2021 జనవరి 15 న ప్రచురించామని చెప్పారు.

తొలుత గవర్నర్ హరిచందన్ విశాఖపట్నం కలెక్టర్ వి. వినయ్ చంద్, విజయనగరం కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, ప్రకాశం కలెక్టర్ డాక్టర్ పోలా బాస్కర్, రాష్ట్ర శాసన సభ కార్యదర్శి  పి. బాలకృష్ణమాచార్యులు, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌళిక వసతుల కల్పనా సంస్ధ నిర్వహణా సంచాలకులు వి.విజయ రామరాజు, మదనాపల్లె సబ్ కలెక్టర్ మెడిద జాహ్నవి, విజయనగరం, కెఆర్‌ఆర్‌సి, ఎస్‌డిసి కె. బాలా త్రిపుర సుందరి, అనంతపురం, కెఆర్‌ఆర్‌సి, ఎస్‌డిసి ఎం. విశ్వశ్వర నాయుడు, ముఖ్య ఎన్నికల ఎన్నికల అధికారి కార్యాలయంలో ప్రాజెక్ట్ మేనేజర్ చైతన్య భారతి తదితరులకు అవార్డులు బహుకరించారు.కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా,  కృష్ణా జిల్లా పాలనాధికారి ఎ.ఎమ్.డి. ఇంతియాజ్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com