హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 72వ రిపబ్లిక్ డే వేడుకలు

- January 26, 2021 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  72వ రిపబ్లిక్ డే వేడుకలు

హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు 72వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో దేశభక్తి పూరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, అతిథుల సమక్షంలో  ప్రదీప్ పణికర్, సీఈఓ-జీహెచ్ఐఎఎల్, జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుని, భారత గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని వివరించారు. విమానయాన పరిశ్రమపై కోవిడ్ ప్రభావం గురించి మాట్లాడుతూ,  జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోందని, ప్రయాణీకుల సంఖ్య త్వరలో కోవిడ్ పూర్వ కాలానికి చేరుకుంటుందనే నమ్మకం తనకుందని అన్నారు. ప్రయాణీకుల భద్రత కోసం విమానాశ్రయంలో చేపట్టిన ఈ-బోర్డింగ్, కాంటాక్ట్ లెస్ కియోస్క్‌లు, కాంటాక్ట్ లెస్ హెల్ప్ డెస్క్‌, కాంటాక్ట్ లెస్ ఎలివేటర్‌లాంటి పలు కాంటాక్ట్‌లెస్, డిజిటల్ సొల్యూషన్స్ గురించి వెల్లడించి, వీటి వల్ల ప్రయాణీకుల విశ్వాసం పెరుగుతోందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత వల్ల విమాన రాకపోకలు మరింత పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. 

ఇటీవల హైదరాబాద్-చికాగో డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించడం గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి మరిన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు కనెక్టివిటీని పెంచే పనిలో ఉన్నామన్నారు. GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో యొక్క సామర్ధ్యాలను వివరించి, ప్రపంచంలోని టీకాల ఉత్పత్తిలో 1/3 వ వంతు హైదరాబాద్ నుంచే జరుగుతుందని, కోవిడ్ వ్యాక్సిన్ రవాణాలో ఎగుమతి, దిగుమతులను సమర్థంగా నిర్వహించడానికి కార్గో బృందం తన సామర్థ్యాలను పెంచుకుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ భయం తగ్గిపోతుండడంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టును వేగవంతం చేసిందని తెలిపారు.

ఇలాంటి విపత్కర సమయాల్లో సిఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్), రెగ్యులేటరీ ఏజెన్సీలు, విమానాశ్రయ భాగస్వాములందరూ సమిష్టిగా పనిచేసి ప్రయాణీకుల సురక్షిత ప్రయాణానికి సహకరిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఎంకే సింగ్, డిఐజి & చీఫ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ (కాసో), సిఐఎస్ఎఫ్ యూనిట్, ఆర్జీఐఏ; భరత్ కామ్దార్, హెడ్-సెక్యూరిటీ, జీహెచ్ఐఎల్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందితో పాటు ARFF (ఎయిర్పోర్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్), రక్షా సెక్యూరిటీ సిబ్బంది విశిష్ట అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. CISF స్నిఫర్ డాగ్ స్క్వాడ్ తమ సామర్థ్యాలను ప్రదర్శించగా, CISF క్విక్ రెస్పాన్స్ టీమ్ కమాండోలు తమ ఆయుధ సామర్థ్యాలను ప్రదర్శించారు. విమానాశ్రయంలో ప్రదర్శించిన ఈ దేశభక్తి కార్యక్రమం ప్రయాణికులు, సందర్శకులు, భాగస్వాములను అలరించింది. 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com