దారుణానికి పాల్పడ్డ భారతీయ అమెరికన్ వైద్యుడు

- January 29, 2021 , by Maagulf
దారుణానికి పాల్పడ్డ భారతీయ అమెరికన్ వైద్యుడు

అమెరికా:43 సంవత్సరాల భరత్ నారుమంచి చిన్నపిల్లల వైద్యుడు. భరత్ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఉండగా.. అతడు జీవితం చివరి దశలో ఉన్నాడు. మరికొన్ని వారాలకు మించి బతికే అవకాశాలు లేవు. భరత్ ఇటీవల చిల్డ్రన్ మెడికల్ గ్రూప్ అనే బాలల వైద్య సేవల సంస్థలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అతడి దరఖాస్తును అధికారులు అంగీకరించకపోవడంతో అతడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భరత్ తుపాకీ చేతపట్టుకుని ఆ మెడికల్ గ్రూప్ కేంద్రంలో ప్రవేశించి కొందరిని బందీలుగా పట్టుకున్నాడు. వారిలో కొందరు తప్పించుకోగా, క్యాథరిన్ లిండ్లే డాడ్సన్ అనే లేడీ డాక్టర్ ను భరత్ కాల్చి చంపాడు. ఆపై తాను కూడా కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఆస్టిన్‌లో మంచి హస్తవాసి ఉన్న చిన్నపిల్లల వైద్య నిపుణురాలిగా కేథరిన్‌ లిండ్లే డాడ్సన్‌కు చక్కని పేరుంది. భరత్ నారుమంచి తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని, పోలీసుల దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రెండు పెద్ద బ్యాగులు, ఒక తుపాకీతో ఆ ఆస్పత్రిలోకి భరత్‌ ప్రవేశించారు. ఆస్పత్రిలో పిల్లలు గానీ రోగులు గానీ ఆ సమయంలో లేరు. ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. నారుమంచి ఒక్కసారిగా తుపాకీ ఎక్కుపెట్టి లిండ్లే డాడ్సన్‌ సహా ఐదుగురు వైద్యులను బందీలుగా తీసుకున్నారు. ఆరుగంటల పాటు టెన్షన్‌ నెలకొంది. బందీలైన వైద్యుల్లో నలుగురిని భరత్‌ వదిలేయగా.. మిగిలిన ఒక్క వైద్యురాలు లిండ్లే డాడ్సన్‌ను భరత్‌ తుపాకీతో కాల్చి చంపాడు. ఆపై తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com