ఆ లోటు తీర్చటానికే నేను వస్తున్నా..షర్మిల

- February 09, 2021 , by Maagulf
ఆ లోటు తీర్చటానికే నేను వస్తున్నా..షర్మిల

హైదరాబాద్: వైఎస్ షర్మిల అభిమానులతో ఆత్మీయ సమ్మేళనానికి ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాల అభిమానులు, అనుచరులు, నేతలతో మాట్లాడుతున్నానని.. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని షర్మిల చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడానికే తాను ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నల్గొండతో పాటు ప్రతి జిల్లా నేతలను కలుస్తానన్నారు. 

‘వైఎస్సార్‌లేని లోటు తెలంగాణలో ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. ఎందుకు అలా లేదన్నదే నా ఆలోచన. నేను ఎందుకు రాకూడదు.. ఎందుకు పార్టీ పెట్టకూడదు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాను. కచ్చితంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం. అభిమానులకు చెప్పకుండా నేను పార్టీ పెట్టను. అందరితోనూ మాట్లాడే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను’ అని షర్మిల చెప్పారు. అయితే పార్టీ పేరు ఏంటో చెప్పండి అని షర్మిలను అడగ్గా సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానంటూ సమావేశానికి ఆమె వెళ్లిపోయారు. కాస్త ఓపికగా ఉండండి అన్ని వివరాలు చెబుతానని మీడియాకు షర్మిల చెప్పారు.

మొత్తానికి చూస్తే.. కొత్త పార్టీ విషయాన్ని మాత్రం షర్మిల కొట్టేయలేదు. ప్రస్తుతం ముఖ్యనేతలతో ఆమె సమావేశమయ్యారు. ఆ తర్వాత అభిమానులను ఉద్దేశించి షర్మిల ప్రసంగించనున్నారు. సుమారు అరగంటపాటు షర్మిల మాట్లాడతారని సమాచారం. మరోవైపు.. అభిమానులు, అనుచరులతో లోటస్‌పాండ్‌ కోలాహలంగా మారింది. ‘జై షర్మిల.. జై జై షర్మిల’ అంటూ నినాదాలతో అభిమానులు హోరెత్తిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com