రోడ్డు ప్రమాదంలో 130కు పైగా వాహనాలు ఢీ...

- February 12, 2021 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో 130కు పైగా వాహనాలు ఢీ...

టెక్సాస్‌:అమెరికాలోని టెక్సాస్‌లో వాహనాలు బీభత్సం సృస్టించాయి.తీవ్రమైన మంచు తుపాను కారణంగా 130కు పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి.ఒక వాహనం మరోదాన్ని ఢీకొందని తెలుసుకుని, దానిలోని వారు బయటకు వచ్చేలోగానే, వెనుక నుంచి వస్తున్న మరో వాహనం దాన్ని ఢీకొందని ప్రత్యక్ష వర్గాలు వెల్లడించాయి.దాదాపు గంటకు పైగా ఇలాగే జరుగగా, కిలోమీటర్ల దూరం వాహనాలు తుక్కు తుక్కుగా పడివున్నాయి.ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు.విషయం తెలుసుకున్న పోలీసులు, రహదారిని మూసివేసి, ప్రమాద స్థలికి ప్రత్యేక బృందాలను పంపించారు. వారు ఒక్కో వాహనాన్ని పరిశీలిస్తూ, అందులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ఈ ప్రమాదంలో చిక్కుకున్న అత్యధిక వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి.దీంతో సహాయక చర్యల నిమిత్తం వచ్చిన బృందాలు సైతం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.కాగా, తొలుత ఫెడ్ ఎక్స్ కు చెందిన ఓ ట్రక్కు అదుపుతప్పి బారియర్ ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోగా, మరికొన్ని టక్కులు దాన్ని ఢీకొన్నాయి.దీంతో ప్రమాదం మొదలైంది.టెక్సాస్ రాష్ట్రాన్ని షర్లీ మంచు తుపాను వణికిస్తున్న కారణంగా కెంటకీ, వెస్ట్ వర్జీనియా పరిధిలోని 1.25 లక్షల నివాసాలతో పాటు ఎన్నో వాణిజ్య ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. తుపాను కారణంగా ఇప్పటి వరకూ 9 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com