రమదాన్ టెంట్లు రద్దు..నిర్దిష్ట ప్రణాళికతో ఇఫ్తార్

రమదాన్ టెంట్లు రద్దు..నిర్దిష్ట ప్రణాళికతో ఇఫ్తార్

అజ్మన్:రమదాన్ పవిత్ర మాసంలో నిర్వహించే  రమదాన్ టెంట్లకు ఈ సారి అనుమతి ఇవ్వటం లేదని అజ్మన్ పాలనా యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే..గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్దిష్టమైన ప్రణాళిక మేరకు ఇఫ్తార్ మీల్స్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తామని వెల్లడించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పవిత్ర  రమదాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వటం అనవాయితీ. పేదలు, కార్మికులకు మసీదుల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు ప్రముఖులు ఇఫ్తార్ విందు ఇస్తూంటారు. అయితే..విందు ఏర్పాటు ద్వారా కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని, భౌతిక దూరం పాటించటంలోనూ విఫలం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అజ్మన్ పాలనా యంత్రాంగం అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొనే  రమదాన్ టెంట్లకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. అయితే..ఎండోమెంట్స్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అనుమతి పొందిన స్వచ్ఛంద సంస్థలు..కౌన్సిల్ సూచనల ప్రకారం ఇఫ్తార్ మీల్స్ ను పంపిణీ చేసేలా నిర్ధిష్ట ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 

Back to Top