ప్రతి మహిళ మరో పది మంది మహిళలకు చేయూతనివ్వాలి:ఎమ్మెల్సీ కవిత

- March 08, 2021 , by Maagulf
ప్రతి మహిళ మరో పది మంది మహిళలకు చేయూతనివ్వాలి:ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్:మహిళలంతా ఉన్నత స్థితికి చేరుకుని, మరో పది మంది మహిళలకు చేయూతనందించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 

ముందుగా సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో దళిత్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, దాదాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ కవిత నివాళి అర్పించారు.వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళలను ఎమ్మెల్సీ కవిత సన్మానించారు.అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఆర్థిక స్వావలంబనతో మహిళలకు నిర్ణయాధికారం పెరుగుతుందన్నారు.ఏడాది పొడవునా,మహిళలకు అన్ని రంగాల్లో ప్రధాన్యత కల్పించాలని పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా దళితులు వివిధ రకాలుగా వివక్షకు గురవుతున్నారన్న ఎమ్మెల్సీ కవిత,దళిత మహిళలపై ‌కుల వివక్ష సైతం ఉందన్నారు.దాదాసాహెబ్ అంబేద్కర్ ప్రతి విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలవడంతో పాటు, దళితులు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

మహిళలు ఆర్థికంగా బలపడాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం 'టీ-ప్రైడ్' ద్వారా దళిత మహిళల పారిశ్రామికాభివృద్దికి అనేక రకాలుగా చేయూతనిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. డిక్కీ సంస్థ, అనేక మంది దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు  కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. అంతేకాదు డిక్కీ సేవలను త్వరలో సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. డిక్కీ జాతీయ అధ్యక్షులు నర్రా రవికుమార్, డిక్కీ తెలంగాణ అధ్యక్షురాలు అరుణ దాసరి, దళిత స్త్రీ శక్తి సంస్థ కన్వీనర్‌ గడ్డం ఝాన్సీ, కూచిపూడి నృత్య కారిణి దీపికా రెడ్డి, బాల నగర్ డీసీపీ పద్మజ, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత, పర్వతారోహకురాలు మాలవత్ పూర్ణ, పలువురు దళిత పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జవాబు దొరికేదాకా ప్రశ్నించాలి..

దూలపల్లిలోని మల్లారెడ్డి మహిళా క్యాంపస్ లో మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, మహిళలంతా అన్యాయాలు, అసమానతలపై సమాధానం దొరికే వరకూ ప్రశ్నించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళ గొంతెత్తితే ఏడాదిలో ప్రతి రోజూ తమదే అవుతుందన్నారు. మహిళా విద్య కోసం ప్రభుత్వం అనేక విద్యాసంస్థలను ప్రారంభించిదన్న ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యల కారణంగా తెలంగాణలో బాల్య వివాహాలు తగ్గిపోయాయన్నారు.  మహిళలు, పురుషులు సమానమేనని అందరికీ ఓటు కల్పించారని, ఈ నెల 14 న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ కవిత  కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రశ్నలకు ఎమ్మెల్సీ కవిత సమాధానాలు..

మహిళా దినోత్సవం సందర్భంగా అక్షర విద్యాససంస్థలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జూమ్ యాప్ ద్వారా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్సీ కవిత,మహిళలకు సంబంధించిన అనేక విషయాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.మహిళల హక్కులు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు ఎమ్మెల్సీ కవిత సమాధానాలు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com