భారీగా పెరిగిన భార‌త్‌-యూఏఈ ఫ్లైట్ టికెట్ల రేట్లు..ప్ర‌యాణికుల అవ‌స్థ‌లు

- April 24, 2021 , by Maagulf
భారీగా పెరిగిన భార‌త్‌-యూఏఈ ఫ్లైట్ టికెట్ల రేట్లు..ప్ర‌యాణికుల అవ‌స్థ‌లు

కోవిడ్ తీవ్ర‌త పెరిపోవ‌టంతో భార‌త్ పై తాత్కాలికంగా ప్ర‌యాణ ఆంక్ష‌లు విధించింది యూఏఈ. ఏప్రిల్ 24 శనివారం 11.59 గంట‌ల నుంచి మ‌రో 10 రోజుల పాటు ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయి. అంటే భార‌త్ నుంచి యూఏఈ వెళ్లాలంటే ఇవాళే ఆఖ‌రు ఆవ‌కాశం. మ‌ళ్లీ ప‌ది రోజుల త‌ర్వాత ప‌రిస్థితిని బ‌ట్టి ఆంక్ష‌ల‌ను స‌డ‌లించొచ్చు..లేదంటే పొడిగించొచ్చు. అయితే..ఇత‌ర దేశాల మీదుగా భార‌త్ నుంచి యూఏఈ వ‌చ్చే వారికి, గోల్డెన్ రెసిడెన్సీ వీసాదారులకు, దౌత్య‌వేత‌ల‌కు మిన‌హాయింపు ఉంటుంది. కానీ, ఇత‌ర దేశాల నుంచి యూఏఈ వెళ్లాలంటే ఆయా దేశాల్లో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వ‌స్తుంది. ఈ త‌ల‌నొప్పి అంతా ఎందుకు అనుకున్న వాళ్లు శ‌నివార‌మే యూఏఈ బయ‌ల్దేరితే నేరుగా యూఏఈ చేరుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. దీంతో భార‌త్ నుంచి యూఏఈ వెళ్లే వారి సంఖ్య అమాంతంగా పెరిగింది. ఈ వీకెండ్లోనే 30 నుంచి 40 వేల మంది యూఏఈకి ప్ర‌యాణం అవుతార‌ని ట్రావెల్స్ ఏజెన్సీలు అంచ‌నాగా చెబుతున్నాయి. ప్ర‌యాణిల సంఖ్య అమాంతంగా పెరిగిపోవ‌టంతో టికెట్ బుకింగ్స్ కు విప‌రీత‌మైన పోటీ పెరిగింది. దీంతో టికెట్ల రేట్లు కూడా గ‌తంలో కంటే ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి.

ఒక్కో టికెట్ ధ‌ర స‌గ‌టున Dh4,000కి అమ్ముతున్నారు. కొన్ని విమాన‌యాన సంస్థ‌లు ఏకంగా రెండు మూడు రెట్లు ఎక్కువ ధ‌ర‌కు ప్ర‌త్యేక విమానాల‌ను కూడా ఆప‌రేట్ చేస్తున్నాయి. ఈ వీకెండ్ లో రోజుల‌కు 90 నుంచి 100 విమానాలు యూఏఈకి షెడ్యూల్ అయ్యాయి అంటే డిమాండ్ అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే పెరిగిన‌ట టికెట్ ధ‌ర‌ల‌తో ప్ర‌యాణికుల‌కు అవ‌స్థ‌లు త‌ప్ప‌టం లేదు.  

యూఏఈ వెళ్లేందుకు చివ‌రి అవ‌కాశం కావ‌టంతో ఏదోలా చ‌చ్చి చెడి విమాన టికెట్లు బుక్ చేసుకుందామ‌ని ప్ర‌యాణికుల‌కు పోటీప‌డుతున్నా...టికెట్లు దొర‌క‌టం క‌ష్టంగానే మారింది. ఒక‌వేళ టికెట్లు బుక్ అయినా...పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ క‌రెక్ట్ టైంకి వ‌స్తుందో రాదోన‌ని మ‌రో టెన్ష‌న్‌. స‌మ‌యానికి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అంద‌క‌పోయినా ప్ర‌యాణం ర‌ద్దు చేసుకోవాల్సిందే. దీంతో ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న స్థాయి మ‌రింత పెరుగుతోంది. కొంద‌రు ప్ర‌యాణికులు ఆన్ లైన్లో బుకింగ్ కుద‌ర‌క నేరుగా విమానాశ్ర‌యానికే వెళ్లి కోవిడ్ శాంపుల్స్ ఇచ్చి అక్క‌డే మాన్యువ‌ల్ గా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయినా...స‌మయానికి టెస్ట్ రిపోర్ట్ వ‌స్తుందో రాదోన‌ని టెన్ష‌న్ త‌ప్ప‌ట్లేదు. దీంతో యూఏలో ఉన్న ప్ర‌వాసీయులు త‌మ బంధువుల రాక‌పై ఆందోళ‌నలో ఉన్నారు.

ఇదిలాఉంటే...యూఏఈ నుంచి భార‌త్ వ‌చ్చే విమానాల్లో మాత్రం గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా త‌క్కువ ధ‌ర‌కు విమాన టికెట్లను విక్ర‌యిస్తున్నాయి. భార‌త్‌- యూఏఈ ప్ర‌యాణానికి Dh200 కంటే త‌క్కువ ధ‌ర‌లోనే టికెట్లు ఉన్నాయి.  ఫ్యూచ‌ర్లో మ‌ళ్లీ ఇంత త‌క్కువ ధ‌ర‌కు టికెట్లు దొర‌క్క‌పోవ‌చ్చ‌ని ట్రావెల్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి.  యూఏఈ వెళ్లే వారి కోసం అద‌న‌పు స‌ర్వీసులు న‌డుతున్న విమాన‌యాన‌సంస్థ‌లు రిట‌ర్న్‌లో ఖాళీగా రావాల్సి ఉంటుంద‌ని...ఈ ప‌రిస్థితుల వ‌ల్లే టికెట్లు ధ‌ర‌లు త‌గ్గాయ‌ని అంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com