అన్నమయ్య సంకీర్తనలు-సామాజిక దృక్పథంపై వీధి అరుగు చర్చా కార్యక్రమం

- April 26, 2021 , by Maagulf
అన్నమయ్య సంకీర్తనలు-సామాజిక దృక్పథంపై వీధి అరుగు చర్చా కార్యక్రమం

ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న తెలుగు వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న "వీధి అరుగు" వేదిక ఆధ్వర్యంలో నాల్గవ కార్యక్రమంగా ఏప్రిల్ 25 సాయంత్రం "అన్నమయ్య సంకీర్తనలు - సామాజిక దృక్పథం" అనే అంతర్జాల కార్యక్రమం ఘనంగా జరిగింది. 
ఈ కార్యక్రామంలో దాదాపు 16 దేశాలు నుండి 400 మందిపైగా తెలుగు వారు పాల్గొని విజయవంతం చేశారు. సుమారు 2,600 మంది Facebook ద్వారా వీక్షించారు.WebEx అంతార్జాల వేదికపై దాదాపు రెండు గంటలు పాటు సాగిన ఈ కార్యక్రమంలో అన్నమయ్య సంకీర్తనలలోని సామాజిక స్పృహ అనే అంశంపై ప్రముఖ సంగీత విద్వాంసురాలు, అన్నమయ్య సంకీర్తనల ప్రచారదీక్షాపరులు, సంఘసేవకులు అమ్మ కొండవీటి జ్యోతిర్మయి గారు అద్భుతంగా ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి సింగపూర్ నుండి ప్రముఖ కథారచయిత్రి, కవయిత్రి, వక్త, వ్యాఖ్యాత అయిన  రాధిక మంగిపూడి గారు అనుసంధానకర్తగా వ్యవహరించారు.మొదటగా జర్మనీ నుండి ప్రముఖ గాయని మరియు ‘పాడుతా తీయగా’ ఫేమ్ శివాని సరస్వతుల  "భావయామి గోపాలబాలం" మరియు "బ్రహ్మమొక్కటే" అనే అన్నమయ్య సంకీర్తనలను తన సుమధుర గాత్రంతో ఆలపించి అందరిని అలరించారు.

అమ్మ జ్యోతిర్మయి మాట్లాడుతూ "కలియుగంలో యుగధర్మానికి అనుగుణంగా జనబాహుళ్యంలోనికి సులువుగా చొచ్చుకుపోయే విధంగా సంకీర్తనామార్గాన్ని ఎంచుకుని, అన్నమయ్య చక్కటి తేట తెలుగు భాషలో శ్రోతల హృదయాంతరాలను తాకే పదాల కూర్పుతో అద్భుతమైన సంకీర్తనలు రచించారని, వాటిని అర్థం చేసుకుని కుల మత జాతి వివక్షతను పక్కనపెట్టి సంఘీభావంతో అన్నమయ్య బోధించిన సామాజిక స్పృహ మరియు మానవతాభావాలను అలవర్చుకొని మనమందరము ప్రవర్తించాలని" ప్రవచించారు. సందర్భోచితమైన అన్నమయ్య సంకీర్తనలను, మధ్యలో ఉదహరించి శ్రావ్యంగా పాడుతూ జ్యోతిర్మయి ఇచ్చిన సందేశం అందరిని మంత్రముగ్ధులను చేసింది. 
అనంతరం, ఆధ్యాత్మికతతో కూడిన నవసమాజాన్ని మన అందరమూ ఎలా నిర్మించవచ్చు అనే అంశంపై ఆలోచన రేకెత్తించే విధముగా సభ్యులతో చర్చిస్తూ అమ్మ జ్యోతిర్మయి ధర్మ సందేహ నివృత్తి గావించారు. 

"అమ్మ జ్యోతిర్మయి గారు నిర్వహిస్తున్న 'అన్నమయ్య 'Yogic  Life' కార్యక్రమం ద్వారా, విపత్కర పరిస్థితుల్లో ఎంతోమందిని నిరాశ నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి దోహదపడే కార్యక్రమాలను, మా  "వీధి అరుగు" వేదిక ద్వారా ప్రవాసులందరికి పరిచయం చేయ సంకల్పించాము" అని నిర్వాహకులు తరిగోపుల వెంకటపతి మరియు, జోజెడ్ల సుబ్బారావు సభాముఖముగా తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో దీర్ఘాసి విజయ్ భాస్కర్,నాగభైరవ రవిచంద్ర,పారా అశోక్  కుమార్, లక్ష్మణ్.పర్రి విజయ్ కుమార్,అన్నపూర్ణ మహీంద్ర, తొట్టెంపూడి గణేష్,కొక్కుల సత్యనారాయణ,దాసరి శ్రీని,గురుభగవతుల శైలేష్,కవుటూరు రత్నకుమార్,నాయుడు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.నార్వే నుండి విశ్వవ్యాప్తముగా ప్రసారమైన, వివిధ ప్రసారమాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలుపుతూ నిబద్దతో ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తాము అని  తెలియచేస్తూ వందన సమర్పణ చేసారు.పూర్తి కార్యక్రమాన్ని వీక్షించుటకు https://fb.watch/55wlCtNeHx/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com