కేసులకు భయపడేటంత చిన్నవాడిని కాదు: ఈటల రాజేందర్‌

- May 03, 2021 , by Maagulf
కేసులకు భయపడేటంత చిన్నవాడిని కాదు: ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌: పథకం ప్రకారం తనపై కుట్ర పన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ సమాజం అసహ్యించుకునే స్థితిలో ప్రచారం చేశారని మండిపడ్డారు. పార్టీ కోసం 19 ఏళ్ల పాటు చాలా కష్టపడి పనిచేశానన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని.. హుజూరాబాద్‌ ప్రజలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని ఈటల తెలిపారు. చావునైనా భరిస్తా.. ఆత్మగౌరవాన్ని వదులుకోనన్నారు. ‘‘గతంలో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేసి మళ్లీ గెలిచా. 2008లో 16 మంది రాజీనామా చేస్తే ఏడుగురు గెలిచారు.. అందులో నేను ఒకడిని. శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ నాకు అవకాశం కల్పించారు. ఉద్యమ నేతగా, మంత్రిగా పార్టీకి మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఆనాడు కేసీఆర్ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారు. ఆనాడు కేసీఆర్‌ ఎప్పుడూ డబ్బును నమ్ముకోలేదు. ఆనాడు కేసీఆర్ అణచివేతకు భయపడలేదు. అలాంటి కేసీఆర్‌ తన శక్తిని మొత్తం నాపై పెట్టారు. ఒక వైపు రెవిన్యూ, విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులతో విచారణ జరిపించారు. ఇలాంటి చర్యలు కేసీఆర్ గౌరవాన్ని పెంచవు’’అంటూ ఈటల వ్యాఖ్యానించారు. నాది వ్యాపార ధోరణి కాదు.. ఉద్యమంలోనే పనిచేశానని  ఈటల పేర్కొన్నారు. ఉద్యమానికి ముందే తనకు పౌల్ట్రీ వ్యాపారం ఉందని తెలిపారు. ‘‘అసైన్డ్‌ భూములు నేను కొనుగోలు చేస్తే నేను శిక్షకు అర్హుడ్ని. అసైన్డ్ భూముల్లో చిన్న నిర్మాణం చేసినా చర్యలు తీసుకోండి. భూములు కొలవాలంటే 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. రాజ్యం మీ చేతుల్లో ఉంది.. అధికారులు మీరు చెప్పిందే రాస్తున్నారు. భూముల సర్వేపై మాకు నోటీసులు ఇచ్చారా?. భయానక వాతావరణం సృష్టించి భూ సర్వే చేశారు. రాజ్యానికి ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. నాపై కేసులు పెట్టే అధికారం కూడా మీకు ఉంది. చట్టాన్ని గౌరవించాలి కానీ అతిక్రమించడం కరెక్ట్ కాదు. అధికారులు రూపొందించిన రిపోర్ట్ తప్పులతడకగా ఉందని’’ ఈటల అన్నారు. తనకు ఇప్పటివరకు కలెక్టర్‌ నివేదిక అందలేదని.. తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి అరెస్ట్‌పై ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ శిష్యరికంలో నేను కూడా ప్రజలనే నమ్ముకున్నా. నేను కచ్చితంగా కోర్టుకు వెళ్తానని’’ ఈటల స్పష్టం చేశారు. మీకు నిజాయితీ, నిష్పక్షపాతం ఉంటే అసైన్డ్ భూముల ఘటనలు ఎన్ని జరగలేదు? మీ వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు అసైన్డ్ భూముల నుంచి వేయలేదా?’’ అంటూ సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌ ప్రశ్నలు సంధించారు. మీరే ప్రలోభపెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. వ్యక్తులు కాదు.. వ్యవస్థ శాశ్వతం అని ఈటల అన్నారు. ‘‘మహిళా పారిశ్రామికవేత్తపై ఈ విధంగా చేయడం మీకు తగునా?. నిన్న ఎన్నికల ఫలితాల్లో ప్రజాగ్రహం ఏ విధంగా ఉంటుందో చూశాం. అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. మీ అరుపులకు, కేసులకు భయపడేటంత చిన్నవాడిని కాదు. సాంబశివుడు చనిపోయిన నేను వెళ్తే నయీం ముఠా కూడా నన్ను భయపెట్టింది.. కానీ నేను భయపడలేదు. నయీం లాంటి హంతక ముఠా చంపుతానంటే నేను భయపడలేదని’’ ఈటల పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com