విడిపోతున్నామంటూ ప్రకటించి షాకిచ్చిన బిల్ గేట్స్ దంపతులు
- May 04, 2021
ఇటీవలే ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సైతం తన భార్య మాకెంజీ స్కాట్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో మరో ప్రపంచ కుబేరుడు సైతం నడించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ కుబేరులలో ఒకరు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందాగేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్(65), ఆయన సతీమణి మిలిందా గేట్స్(56) సంచలన ప్రకటన చేశారు. 27 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తామిద్దరం విడాకులు తీసుకోబోతున్నట్టు ఈ జంట ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా సోమవారం అర్థరాత్రి దాటాక ప్రకటించి షాక్ ఇచ్చారు. గత 27 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు పొందిన ఈ జంట.. ఇకపై దంపతులుగా కలిసి ఉండలేమని భావిస్తున్నట్లు తెలిపారు.
జీవితంలో ఇక భార్యాభర్తలుగా కలిసి ఉండలేమని ఇరువురు సంయుక్త ప్రకటన చేశారు. అయితే, తమ బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. "ఎన్నో సమాలోచనలు, ఎంతో ఆవేదన తర్వాత 27 ఏళ్ల మా వైవాహిక బంధానికి ముగింపు పలకాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాం. ప్రపంచంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, మెరుగైన జీవనం కల్పించే ఫౌండేషన్ను స్థాపించాం. ఈ ఫౌండేషన్ కోసం మేము కలిసే పనిచేస్తాం. కానీ, జీవితంలోని తర్వాతి దశల్లో మేము దంపతులుగా కొనసాగలేమని భావిస్తున్నాం." అని తమ సంయుక్త ప్రకటనలో బిల్‌గేట్స్ దంపతులు వెల్లడించారు.
ఇక ప్రస్తుతం బిల్‌గేట్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి విలువ సుమారు 137 బిలియన్ డాలర్లు. ఇక 2000లో స్థాపించిన బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకూ 53 బిలియన్ డాలర్లను వివిధ స్వచ్ఛంద కార్యాక్రమాలకు వినియోగించారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ వయసు 65 కాగా.. మెలిందా వయసు 56 ఏళ్లు. 1994లో వివాహబంధంతో ఒక్కటైన బిల్ గేట్స్ దంపతులు 27 ఏళ్ల తర్వాత విడిపోతుండడం గమనార్హం. మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి బిల్‌గేట్స్ సీఈవోగా ఉన్న సమయంలో మిలిందా ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరారు. అప్పట్లో కంపెనీలో చేరిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో ఏకైక మహిళ మెలిందాయే కావడం విశేషం.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







