సంగీత సునామీ,...

- March 04, 2016 , by Maagulf
సంగీత సునామీ,...

ముంచెత్తనుంది... సంగీత సునామీ అంతర్జాతీయ సంగీతోత్సవానికి వేదికైన నగరం దేశంలోనే మొదటిసారిగా సెన్సేషన్‌ బృందం ప్రదర్శన ఈ నెల 5న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహణ, మాదాపూర్‌ మన నగరం మరో అంతర్జాతీయ సంగీతోత్సవానికి వేదిక కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన రాక్‌ మ్యూజిక్‌ బృందాలు అద్భుతమైన ప్రదర్శనతో నగరవాసులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 34 దేశాల్లో వందకుపైగా ప్రదర్శనలతో ఖ్యాతిగాంచిన 'సెన్సేషన్‌' మ్యూజిక్‌, డ్యాన్స్‌ ఫెస్టివల్‌ మొదటిసారి భారత్‌లో జరగనుంది. ఆ బృంద సభ్యులు హైదరాబాద్‌ని వేదికగా ఎంచుకున్నారు.ఈ నెల 5న గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో వేడుక నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి శాఖ సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి దాదాపు 20వేల మంది సంగీత ప్రియులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.దేశంలోని ఇతర నగరాలు, విదేశాల నుంచి సైతం సందర్శకులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. గురువారం సాయంత్రం మాదాపూర్‌లో నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. సినీనటులు రకుల్‌ప్రీత్‌సింగ్‌, రెజీనా, అక్కినేని అఖిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఆమ్‌స్టర్‌డ్యాం కేంద్రంగా వివిధ దేశాల్లో ప్రదర్శనలిస్తున్న సెన్సేషన్‌ బృందం జనరల్‌ మేనేజర్‌ బ్రెంద మున్‌స్టర్‌మన్‌ వేడుకకు సంబంధించి 'న్యూస్‌టుడే'తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలిలా.... 16 సంవత్సరాలుగా... 2000 సంవత్సరంలో ఆమ్‌స్టర్‌డ్యాం మొదటి ప్రదర్శనతో ప్రారంభమైన సెన్సేషన్‌ 34 దేశాల్లో ప్రదర్శనలిచ్చింది. మొదటిసారి భారత్‌లో ప్రదర్శనకు విచ్చేసింది. అంతర్జాతీయంగా పేరుగడించిన డీజేలు అఫ్రోజాక్‌, ఆక్స్‌వెల్‌, లేడ్‌బ్యాక్‌లుక్‌, లోస్ట్‌ఫ్రీక్వెన్సిస్‌, మిస్టర్‌ వైట్‌ బృందాలు తమ రాక్‌ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించనున్నారు. తెల్లపు రంగు దుస్తుల్లోనే రావాలి మా బృందం ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా అక్కడ డ్రెస్‌ కోడ్‌ కచ్చితంగా ఉంటుంది. ప్రారంభం నుంచి తెలుపురంగు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేస్తున్నాం.సెన్సేషన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు 2001లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయనకు నివాళి అర్పించేందుకు రెండో ప్రదర్శన నుంచి తెలుపు రంగు డ్రెస్‌ కోడ్‌ను ప్రవేశపెట్టాం. భారీ కంటైనర్లలో సామగ్రి సంగీతోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. కళాకారులు ప్రదర్శించే వేదిక చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 242 అడుగుల పొడవు, 75 అడుగుల ఎత్తుతో వేదిక రూపొందిస్తున్నారు. 11,42,400 వాట్స్‌ సౌండ్స్‌, 800 లైటింగ్స్‌ ఆకర్షణగా నిలవనుంది. 30మంది ఇంజినీర్లుతోపాటు 500 మందిపనిచేస్తున్నారు. వేదికకు సామగ్రి, సౌండ్‌సిస్టమ్‌, లైటింగ్‌ పరికరాలను ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి సముద్రమార్గంలో 13 కంటైనర్లలో భారత్‌కు తెప్పించాం. నిర్వహణకు 1.5 మిలియన్‌ యూరోస్‌ ఖర్చుచేస్తున్నాం. భారతీయ కళాకారులకు చోటు భారతీయ కళాప్రదర్శనలూ ఇక్కడ ఉంటాయి. ఒక డీజే ప్రదర్శనకు మరో డీజే ప్రదర్శనకు మధ్య ఉండే సమయంలో ఇతర కళాప్రదర్శనలు ఉంటాయి. ఇందులో పలు కళారూపాలను భారతీయులు ప్రదర్శించనున్నారు. తెలంగాణ సర్కారు సహకరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com