దుబాయ్ లో మరో ఆకర్షణ..ప్రపంచపు మొట్టమొదటి 'ఫ్లోటింగ్ హౌసెస్' షురూ!!

- May 25, 2021 , by Maagulf
దుబాయ్ లో మరో ఆకర్షణ..ప్రపంచపు మొట్టమొదటి \'ఫ్లోటింగ్ హౌసెస్\' షురూ!!

దుబాయ్: అనునిత్యం ఏదో ఒక సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది దుబాయ్ మహా నగరం. డబ్బుంటే రాజాల్లాంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు కొత్త కొత్త ఆలోచనలతో కవ్విస్తుంది దుబాయ్. తాజాగా 'ఫ్లోటింగ్ హౌసెస్'...అదేనండి 'తేలియాడే ఇళ్ళు' అనే వైవిధ్యమైన ఆలోచనతో ముందుకొచ్చింది. మరి దాని కధ ఏంటో చదివేయండి..

యూఏఈ కి చెందిన ఓడల తయారీ సంస్థ సీగేట్ షిప్‌యార్డ్ తన ఫ్లోటింగ్ సీ రిసార్ట్ 'నెప్ట్యూన్' యొక్క మొదటి యూనిట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి పర్యావరణ అనుకూలమైన తేలియాడే గృహంగా అవతరించింది.

900 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన రెండు అంతస్తుల ఈ తేలియాడే గృహంలో, కిచెన్, లివింగ్ రూమ్, అటాచ్డ్ వాష్‌రూమ్‌లు కలిగిన నాలుగు బెడ్ రూములు, బాల్కనీ, ఒక గ్లాస్ స్విమ్మింగ్ పూల్, రెండు మెయిడ్ రూములు ఉన్నాయి. ఈ ఇంటికి గ్లాస్ ఫ్లోరింగ్ ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. 

ప్రత్యేక హైడ్రాలిక్ ఇంజిన్లను కలిగిన ఈ ఇళ్ళు, సురక్షితంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళగలవు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, ఇంటిని పూర్తిగా స్మార్ట్ ఆటోమేటెడ్ సిస్టమ్‌తో పాటు స్వీయ-స్టెరిలైజింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఫ్లోటింగ్ హౌస్ లు తమ వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి సౌర శక్తి మరియు స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తాయి. ఒక్కో ఫ్లోటింగ్ హౌస్ ధర 20 మిల్లియన్ దిర్హాములు.

రస్ అల్ ఖైమాలోని అల్ హమ్రా పోర్టులో ప్రారంభమై దుబాయ్ లోని జుమైరాలో స్థిరపడేందుకు వస్తుంది ఈ ఫ్లోటింగ్ హౌస్.

నెప్ట్యూన్ యొక్క మొదటి ఇల్లు ను దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త బల్విందర్ సహాని..20 మిల్లియన్ దిర్హాములకు కొనుగోలు చేశారు. దీనిని అబూ సబా అని కూడా పిలుస్తారు.

'దుబాయ్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభించటానికి ప్రధాన కారణాలు ఎమిరేట్ యొక్క ప్రధాన పర్యాటక మరియు పెట్టుబడి గమ్యస్థానం, దాని సౌకర్యవంతమైన ఆర్థిక విధానాలు మరియు బలమైన మౌలిక సదుపాయాలే కారణం' అని తెలిపారు సీబేట్ షిప్‌యార్డ్ సిఇఒ ముహమ్మద్ ఎల్బహ్రావి.

ఈ ప్రాజెక్టులో 12 రెసిడెన్షియల్ ఫ్లోటింగ్ బోట్ల వలయంలో 156 సూట్లు మరియు గదులతో కూడిన లగ్జరీ హోటల్ ఉంటుంది. ఎల్బాహ్రావి మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో 870 మిలియన్ డాలర్ల ప్రాజెక్టును ప్రారంభిస్తామని, ఈ ప్రాజెక్ట్ 2023 మొదటి త్రైమాసికంలో పూర్తవుతుందని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com