టిఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్‌ రాజీనామా

- June 04, 2021 , by Maagulf
టిఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్‌ రాజీనామా

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధానికి... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలో ఉన్న తన నివాసంలో రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ... తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని అన్నారు. ఉద్యమం నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీలో తన పాత్రను వివరించడంతోపాటు తనకు ఎదురైన ఇబ్బందులను ఈ సందర్భంగా మీడియా ముందు వెల్లడించారు.

టిఆర్‌ఎస్‌ నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. అప్పటి సిఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో తనను అవహేళన చేశారని, పట్టుమని పది సీట్లు గెలవలేదని ఆయన విమర్శించారని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లామన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్‌ ప్రజలు గెలిపించారని అన్నారు.

అప్పుడు కెసిఆర్‌ ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చు కానీ అది ఎల్లకాలం సాగదు. ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పారు. ప్రగతి భవన్‌ కాదు.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పానని ఎద్దేవా చేశారు. సిఎంఒ లో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారైనా ఉన్నారా ? అని ప్రశ్నించారు.ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండబోరని అన్నారు.దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పారు.నల్గండ,హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసునని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com