లులు గ్రూపు చైర్మన్ యూస‌ఫ్ అలీ పెద్ద మ‌న‌సు...

- June 04, 2021 , by Maagulf
లులు గ్రూపు చైర్మన్ యూస‌ఫ్ అలీ పెద్ద మ‌న‌సు...

యూఏఈ: కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌,లులు గ్రూపు చైర్మన్ ఎం.ఏ యూస‌ఫ్ అలీ ఉదార‌త చాటుకున్నారు.ఏకంగా 500,000 దిర్హాములు ప‌రిహారంగా చెల్లించి మరీ ప్ర‌వాస భార‌తీయుడిని ఉరిశిక్ష నుంచి కాపాడారు.వివరాల్లోకి వెళ్తే...కేర‌ళ రాష్ట్రం త్రిసూర్‌కు చెందిన బెక్స్ క్రిష్ణ‌న్ ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. ఈ క్ర‌మంలో 2012 సెప్టెంబ‌ర్‌లో బెక్స్ ప్ర‌యాణిస్తున్న వాహ‌నం రోడ్డుప‌క్క‌న వెళ్తున్న కొంత‌మంది పిల్ల‌ల‌పైకి దూసుకెళ్లింది.ఈ ప్ర‌మాదంలో సుడాన్‌కు చెందిన ఓ బాలుడు చ‌నిపోయాడు.దీంతో ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన బెక్స్‌కు యూఏఈ సుప్రీంకోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించింది.కొంత‌కాలానికి మృతుడి కుటుంబం యూఏఈ నుంచి సుడాన్ వెళ్లిపోయింది.బెక్స్ మాత్రం తొమ్మిదేళ్లుగా యూఏఈలో జైలులోనే మ‌గ్గుతున్నాడు.దీంతో అత‌డి కుటుంబం ఈ విష‌యాన్ని యూస‌ఫ్ అలీ ద‌ష్టికి తీసుకెళ్లింది. ఇక బెక్స్‌కు ఉరి త‌ప్పించాలంటే ఏకైక మార్గం..మృతుడి కుటుంబం క్ష‌మాభిక్ష ప్ర‌సాదించ‌డం మాత్ర‌మే.దాంతో యూస‌ఫ్ అలీ మృతుడి కుటుంబంతో ఆ దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిపారు.ఈ చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో 2021 జ‌న‌వ‌రిలో బాలుడి కుటుంబం క్ష‌మాభిక్ష‌కు అంగీక‌రించింది. 

ఈ విష‌యాన్ని యూఏఈ కోర్టుకు తెలియ‌జేయ‌డంతో నిందితుడు బెక్స్.. మృతుడి కుటుంబానికి 500,000 దిర్హాములు ప‌రిహారంగా ఇవ్వాల‌ని ఆదేశించింది.దాంతో బెక్స్ త‌ర‌ఫున‌ ఈ ప‌రిహారం చెల్లించేందుకు యూస‌ఫ్ అలీ అంగీక‌రించారు.గురువారం బెక్స్ విడుద‌ల‌కు సంబంధించిన అన్ని చ‌ట్ట‌ప‌ర‌మైన ప‌నులు పూర్తి అయ్యాయి.త్వ‌ర‌లోనే జైలు నుంచి విడుద‌లై బెక్స్ స్వ‌దేశానికి రానున్నాడు.ఇక‌ అబుధాబిలోని అల్ వత్బా జైలులో ఉన్న బెక్స్‌ వ‌ద్ద‌కు గురువారం భార‌త రాయబార కార్యాలయం అధికారులు వెళ్లారు.అనంత‌రం విడుద‌ల విష‌యాన్ని తెలియ‌జేశారు.దీంతో అత‌డు భావోద్వేగానికి గురైన‌ట్లు అధికారులు తెలిపారు.త‌న జీవితంలో కుటుంబ స‌భ్యుల‌ను మ‌ళ్లీ క‌లుస్తాన‌ని అనుకోలేదంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడ‌ని పేర్కొన్నారు.తాను జైలు నుంచి విడుద‌లై స్వ‌దేశానికి వెళ్లే ముందు త‌న‌కు మ‌రో జ‌న్మ‌ను ప్ర‌సాదించిన యూస‌ఫ్ అలీని ఒక్క‌సారి క‌ల‌వాల‌ని ఉంద‌ని బెక్స్ చెప్పిన‌ట్లు రాయబార కార్యాలయం అధికారులు వెల్ల‌డించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com