మ‌రికాసేప‌ట్లో కాబినెట్ స‌మావేశం..ఉద్యోగులకు వేతన సవరణ వంటి పలు అంశాల పై చర్చ

- June 08, 2021 , by Maagulf
మ‌రికాసేప‌ట్లో కాబినెట్ స‌మావేశం..ఉద్యోగులకు వేతన సవరణ వంటి పలు అంశాల పై చర్చ

హైదరాబాద్: ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మ‌రికాసేప‌ట్లో రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం భేటీ కానుంది. ప్ర‌గతి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌రుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ఫైల్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. ఉద్యోగుల వేతన సవరణపై చర్చించనున్నట్టు సమాచారం. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పూర్తి వివరాలతో నోట్‌ను ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖ రూపొందించినట్టు తెలిసింది. ఈ నోట్‌ను మంత్రివర్గం ముందుంచనున్నారు.

దీనిపై చర్చించి నిర్ణయం తీసుకొన్నాక ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన జీవోలను సర్కారు విడుదలచేసే అవకాశం ఉన్నది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే వేతన సవరణను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతూ మార్చి 23న అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు వెంటనే విడుదలైనా, ఉద్యోగుల ఫిట్‌మెంట్‌కు సంబంధించిన ఉత్తర్వులు వివిధ కారణాల వల్ల వెలువడలేదు.

మరోవైపు కరోనా సెకండ్‌వేవ్‌ రాష్ర్టాన్ని అతలాకుతలం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా కరోనా విధుల్లో నిమగ్నమైంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. కరోనా ఉద్ధృతి తగ్గి పరిస్థితి కుదుటపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులకు వేతన సవరణ అమలుచేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆర్థిక శాఖ అధికారులు క్యాబినెట్‌కు పూర్తి వివరాలతో ప్రత్యేకంగా నోట్‌ తయారు చేసినట్టు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఫైల్‌ ఆమోదం పొందగానే ఉద్యోగుల ఫిట్‌మెంట్‌తోపాటు ఇతర అంశాలపై అధికారికంగా జీవోలు విడుదలచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రరూపం దాల్చటంతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇంటింటికీ జ్వర సర్వేతోపాటు పరీక్షలు నిర్వహించటం, పాజిటివ్‌ వచ్చిన వారిని ఐసొలేషన్‌ చేయటం, వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి వైద్యం అందించటం వంటి చర్యలు చేపట్టింది. వివిధ వర్గాలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టింది. ముఖ్యంగా హైరిస్క్‌ ఉన్న గ్రూపులను గుర్తించి వ్యాక్సిన్‌ ఇచ్చింది. మరోవైపు కఠినంగా లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నది. ఫలితంగా కరోనా తీవ్రత బాగా తగ్గింది. ఈ సమయంలో లాక్‌డౌన్‌పై ఏమి చేయాలన్నదానిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, వానకాలం పంటలు, సాగునీటి పారుదల అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపింది? తీసుకోవాల్సిన చర్యలేంటి? తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం తగిన నిర్ణయాలు తీసుకోనున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com