ఫ్లయింగ్ సిఖ్‌ మిల్కా సింగ్ కన్నుమూత

- June 19, 2021 , by Maagulf
ఫ్లయింగ్ సిఖ్‌ మిల్కా సింగ్ కన్నుమూత

చండీగఢ్‌: భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ (91) ఇకలేరు. మే 20న కరోనా వైరస్ బారిన పడిన మిల్కాసింగ్.. మహమ్మారితో పోరాడి ఓడాడు.రెండు రోజుల క్రితం కరోనా నెగటివ్ రావడంతో అతడ్ని ఐసీయూ నుంచి తరలించారు. కానీ.. ‘నాన్న ఇప్పుడే చనిపోయాడు’ అని మిల్కా సింగ్ కొడుకు జీవ్ మిల్కా సింగ్ శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించాడు.

మే నెలలో కరోనా సోకడంతో చండీగఢ్‌లోని ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉండి తొలుత చికిత్స తీసుకున్న మిల్కాసింగ్.. వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజులకే మొహాలిలోని ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్న ఈ ఫ్లయింగ్ సిఖ్.. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినప్పటికీ.. వైద్యుల సూచనల మేరకు ఆక్సిజన్ సాయం తీసుకుంటూ వచ్చాడు. కానీ.. నాలుగు రోజుల్లోనే అనూహ్యంగా మిల్కాసింగ్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా కనిపించడంతో వెంటనే ఐసీయూకి తరలించిన వైద్యులు.. అక్కడ ఉంచి చికిత్స అందించారు.

కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మిల్కాసింగ్ అప్పట్లో గుర్తింపు పొందారు. 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో అంచనాలకి మించి రాణించిన మిల్కా సింగ్ స్వర్ణం గెలిచారు. 1956, 1960, 1964 ఒలిపిక్స్‌లోనూ భారత్‌కి మిల్కాసింగ్ ప్రాతినిథ్యం వహించాడు. భారత ప్రభుత్వం ఈ దిగ్గజ అథ్లెట్‌ని పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్ చేరిన మిల్కాసింగ్.. నాలుగో స్థానంలో నిలిచారు. కేవలం 0.1 సెక్లన తేడాతో పతకం చేజార్చుకున్నారు. కానీ ఒలింపిక్స్‌‌లో ఫైనల్‌కి చేరిన తొలి భారత పురుష అథ్లెట్‌గా అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేశారు.ఆయన మృతికి రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com