నన్నా పిలిచింది?

- July 09, 2021 , by Maagulf
నన్నా పిలిచింది?

'యెన్ ... ..ఖై..తా....యూ ...ప్యాడ్.....యయ్ ...యూలా'

'యెన్ ..ఖై...తా...యూ...ప్యాడ్...యయ్...యూలా'

కౌంటర్ లో ఉన్న రిసెప్షనిస్ట్.  డెస్క్  పైన దేనినో తీక్షణంగా చూస్తోంది... భృకుటి ముడి వేసింది ...దీర్ఘంగా  ఊపిరి తీసుకుంటూ. ఈ సారి ఇంకొంచెం గట్టిగా పిలిచింది.

'యెన్ ..ఖై...తా...యూ...ప్యాడ్...యయ్...యూలా'

ఇప్పటికి మూడు నిమిషాలు గా  రిసెప్షన్ కౌంటర్ దగ్గర నుంచి  రిసెప్షనిస్ట్  పిలుస్తోంది. కాదు.. కాదు... అరుస్తోంది.

అది ఒక  క్లినిక్ లోని విశాలమైన హాల్.అవి నేను సింగపూర్ కొత్తగా వచ్చిన రోజులు.  నాకు  అప్పుడు థర్డ్ మంత్ ప్రెగ్నన్సీ, డాక్టర్ దగ్గరకి కన్సల్టేషన్కి  నేను, సుధాకర్ వెళ్లాం. నేను కాకుండా  అక్కడ ఇంకా నలుగురు ఇండియన్స్, మిగతా వాళ్ళు వేరే దేశస్థులు ఉన్నారు.

ఎవర్ని పిలుస్తోందో ...వాళ్ళు ఇంకా రారు ఏంటి,... పిలిచిన వాళ్ళ పని అయ్యితే, ఆ తర్వాత మాది త్వరగా అవ్వుతుంది, ఇంటికి వెళ్లిపోవచ్చు అని నేను, సుధా డోర్ వంక , కూర్చున్న మిగతా పేషెంట్స్ వంక మీరా...? మీరా..? యెవండోయి ...పిలిచేది మిమ్మల్నే , వెళ్ళవయ్యా బాబు ..వెళ్ళు అన్నట్టు చూస్తున్నాం.

ఇంతలోనే రిసెప్షనిస్ట్, కౌంటర్ నుంచి మా ముందర కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళ  దగ్గరకి వెళ్లి కార్డు చూపించి అడుగుతోంది. తర్వాత మా దగ్గరకి గబగబా నడుచుకుంటూ వచ్చి,
 'ఆర్ యూ ఎంఖైతా? అంది.
'నో.' అన్నా

కొంచెం అసహనంగా  తన చేతిలో ఉన్న క్లినిక్ కార్డు చూపిస్తూ .. " హలో.. ఈస్ దిస్ యూ? అని అడిగింది.

'అంకిత ఉపాధ్యాయుల' నా  పేరు, నా ఫోన్ నెంబర్ , అడ్రస్ అన్ని డీటెయిల్స్ రాసి వున్న క్లినిక్ కార్డు అది. అది నాదే అయ్యేసరికి గతుక్కుమన్నా .." నన్నా పిలిచింది ..' అన్నా  సుధ తో "  తను కూడా అవునా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ తో  నా వంక , కార్డు వంక, రిసెప్షనిస్ట్ వంకా మార్చి మార్చి చూసారు.

' ఈజ్ దిస్ యువర్ నేమ్" అని కొంచెం గొంతు పెద్దది చేసి, మొహం చిరాకుగా పెట్టి అడిగింది.

'ఎస్, ఇట్స్ మై నేమ్' అని ఖంగారుగా అన్నాను. 'బట్ ఇట్స్ నాట్ ప్రొనౌన్స్డ్ఇన్ దట్

 వే.." అని నేను పూర్తి గా చెప్పే లోపలే...
'ప్లీజ్  కం విత్ మీ " నా టైం అనవసరం గా వేస్ట్ చేసావు కదా అన్నట్టు విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

తర్వాత ఇంటికి వెళ్ళి పోయాక, సుధా తో బాధగా అన్నా  'ఎంత అందమైన పేరుని ఖూనీ  చేసిందో. అసలు వింటుంటేనే నాకు జువాలజీలో చదివిన 'ఎంకైలోస్టోమా డుయోడినల్' గుర్తుకు వస్తోంది. అంటే ఏలిక పాము...వాక్ ' అని మొహం వికారంగా పెట్టా.

'బాధపడకు ఎంకైత' అని నవ్వేసారు.

ఛాన్స్ దొరికితే చాలు నన్ను ఆటపట్టించటం లో వచ్చే ఆనందం తనకి కోటి రూపాయలు ఇచ్చినా రాదు.

నేను చేతిలో ఉన్న కుషన్ విసిరా తన మీదకి ..కుషన్ పట్టుకుని 'ఎంకైత ....ఎంకీట...' అంటూ కూనిరాగం తియ్యటం మొదలుపెట్టారు. 

'అసలు, ఆ రిసెప్షనిస్ట్ నిన్ను 'ఎంకీట' అని పిలిచి ఉండాల్సింది ..నండూరి వారి ఎంకి లా ఉండేది' అని ముసిముసిగా నవ్వారు. 

'మొన్న పార్టీలో, మిమ్మల్ని మటుకు మీ కొలీగ్స్ ఎలా పిలిచారు...సు ... ని పొట్టి చేసి

...ద ని...డా...చేసి లాగి.. పీకి ...సుడా.......క, సుడా......క ' అని నేను తెచ్చి పెట్టుకుని గట్టిగా , పగలబడి నవ్వేసరికి.. ఉలిక్కిపడ్డారు.

మళ్ళీ నేనే కంటిన్యూ చేసా, ' నాకు తలుచుకుంటూనే ఒళ్ళు మండిపోతోంది. మా అమ్మ ఎంత ఏరి కోరి నాకు ఈ పేరు పెట్టిందో, వింటే ఎంత బాధ పడుతుందో అన్నా' ఆ తర్వాత ఇద్దరం ఇంకా సంభాషణ పొడిగించకుండా వెళ్లి పడుకున్నాం.

సాయంత్రం  ఉల్లిపాయ  పకోడీలు వేసి, వేడి వేడి గా రెండు  ప్లేట్స్ లో తీసుకొచ్చారు. అసలే మార్నింగ్ సిక్నెస్ పీక్ లో ఉంది నాకు, ఒకటే వికారం. ఏ పనీ చేయలేకపోతున్న, ఏమి తిన లేకపోతున్నా . "దా ..తిను. పకోడీలు" అని ప్లేట్ లో ఇచ్చారు.

"నాకేమి వద్దు... అసలే కోపం తో ఒళ్ళు మండిపోతుంటే ఏంటి మీరు .." అంటూ చున్నీతో ముక్కు మూసుకున్న.

'ఫైర్ ఇంజిన్ పిలవనా?' అని మధ్య లో కుళ్ళు జోక్ వేసారు.

'ఐ ప్యాడ్ లు వచ్చిన కాలం లో ఇలాంటి ఇంటిపేరు ఉంటే, మరి యూ ప్యాడ్ యయూల  అనే పిలుస్తారు.' అన్నా.

'వాళ్ళు  ఏమి నిన్ను కావాలని బాధపెట్టే ఉద్దేశంతో అనలేదు , ఎలా పలకాలో తెలీక, ప్రతి చోట ఇలా చెప్పుకు పోతే మనకి, వాళ్లకి టైం వేస్ట్. అందుకని మన పేరు లో ఉన్న అక్షరాలు ఏమి వాళ్ళు పలికినా మనమే వాళ్ళ దగ్గరకి ..ఆ ..ఆ ...వచ్చే... వచ్చే .. అంటూ వెళ్లిపోవటమే" అంటూ...

"దేశం కానీ దేశం లో ఉన్నాం అందుకని మన కోపాలు, ఉక్రోషాలు ఇలా మింగేయ్యటమే"... అంటూ రొండు పకోడీలు పరపరా నమిలి , ఒకేసారి మింగేసి  పకపకా నవ్వేసారు.

అప్పటి నుంచి ఎన్నో సందర్భాలలో, నా పేరు ఖండ ఖండాలుగా కోసేసి, చిత్ర విచిత్రంగా పలికేసారు.నేను ఎన్నో సార్లు చెప్పటానికి ప్రయత్నించాను కానీ క్లినిక్ స్టాఫ్ మారటం వలనో,నేను కొత్త ప్లేసెస్ కి వెళ్ళటం వలనో మళ్ళీ ఎక్కడికక్కడ మొదటికొచ్చింది. అప్పటి నుంచి పేరులో ఏముంది లే అని రాజీ పడ్డాను. 

నా డెలివరీ కి రెండు వారాలు ముందరే మా అమ్మ, నాన్న వచ్చారు. డెలివరీ అయ్యింది. అమ్మాయి పుట్టింది. నాకు, సుధాకి మోస్ట్ మెమొరబుల్ డేస్.  హాస్పిటల్ లో డాక్టర్  చెక్ అప్ కి వచ్చి ... 'మమ్మీ.. హౌ అర్ యు టుడే అని' ఇంకేవో అడిగి,చెక్ అప్ చేసి వెళ్ళింది. నర్సస్ కూడా 'మమ్మీ ..మమ్మీ...' అని  అంటుంటే అమ్మ ఆశ్చర్యం గా అడిగింది, ' పట్టుమని పాతిక ఏళ్ళు లేవు నీకు, వాళ్ళందరూ నలభయి ఏళ్ళ వాళ్ళలా ఉన్నారు. నిన్ను పట్టుకుని మమ్మీ ఏంటే.'

'నోరు తిరగక,  నా పేరుని ఖూనీ చేస్తూ పిలిచే కంటే ఇదే బెట్టర్ లే అని జరిగిన విషయం గబగబా చెప్పా, మళ్ళీ సుధా వస్తే ఎక్కడ నన్ను ఆటపట్టించటం మొదలెడతారో అని. 

డెలివరీ అవ్వగానే మా అత్త గారు, మామ గారు కూడా వచ్చారు.ఇంకా అందరికి మనవరాలిని చూసి అంతా ఇంతా ఆనందం కాదు. 

పాపాయికి  పేరు పెట్టటం గురించి  డిస్కషన్ జరుగుతున్నప్పుడు. మా  అత్త గారు రకరకాల కొత్త పేర్లు సజెస్ట్ చేసారు అమ్మ కూడా చెప్పింది యూనీక్  పేరు పెట్టి, షార్టుఫోర్మ్ తో పిలవండి అని.  నాకు ఎందుకో ఆలా ఇష్టం లేదు.అవన్నీ వద్దు అన్నా.అమ్మ, అత్తగారు ఇద్దరు దేవుళ్ళు పేర్లు కలుపు,మేము అనుకున్నాం అని అంటే నామకరణం రోజున బియ్యం లో రాద్దాం అంత పొడుగు పేరు రిజిస్టర్ లో రాయటం  కష్టం, పాస్పోర్ట్ లో పట్టదు అని అన్నా. చివరికి   'సింపుల్ గా, అందరు పలికేటట్లు గా 'జయ' అని పెట్టాము' మా అత్తగారి పేరు ' జయలక్ష్మి', మా  అమ్మ పేరు 'జయంతి' ఇద్దరి పేర్లు పెట్టినట్టు అయ్యింది.

మా అత్తగారు ఆనందంతో పొంగిపోయారు, అందరు మోడరన్ అండ్ స్టైలిష్  పేర్లు  పెడుతుంటే నేను ఆవిడ మీద, అమ్మ మీద ఉన్న  ప్రేమాభిమానాలతో   పాత కాలం పేరు అయినా వాళ్ళ ఇద్దరి పేరు పెట్టానని. నేను బెస్ట్ కోడలు అండ్ కూతురు అని రకరకాల బిరుదులు ఇచ్చారు. ఆవిడ కోడళ్ళు అందరి లోకి నాకు ఫస్ట్ మార్క్స్ వేసారు. 

అసలు సంగతి తెలిసింది కాబట్టి అమ్మ ముసిముసి గా నవ్వుకుంది. అక్కడే ఉన్న సుధాకర్ 'ఎంకైత ...ఎంకైత'  అని విని వినపడకుండా, రాగయుక్తం గా పాడుతున్నారు, నేను తన వంక చిరుకోపం గా చూసేసరికి 'ఏం కథ, ఏం కథ'  అంటూ  మాట మార్చి నవ్వు ఆపుకుంటూ రూమ్ లోకి వెళ్లారు.

కాలచక్రం గిర్రున తిరిగింది.  జయని మా ఇంటి పక్కనే ఉన్న  ప్రైమరీ స్కూల్ లో  జాయిన్ చేసాము. ప్రైమరీ వన్ లో ఉంది. చారెడేసి కళ్ళు, బాబ్ కట్, ఎప్పుడు ఆక్టివ్ గా, స్మైలీ గా ఉంటుంది.ఇంటికి  వచ్చిన దగ్గర నుంచి స్కూల్ లో విషయాలు అన్ని కళ్ళు తిప్పుకుంటూ చెప్తుంది. మూడు నెలలు తర్వాత స్కూల్ లో ఫస్ట్  పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ .. చైల్డ్ కూడా అటెండ్ అవ్వాలి అన్న మాట.  ఫామ్ టీచర్ ని చూసి. ' హలో మిస్ వాన్గ్.' అన్నా. జయ నా వంక గుర్రున చూసింది.

 కిండర్గార్టెన్లో చదివిన  మూడు ఏళ్ళు, దేవుడు దయ వలన తన టీచర్స్ పేర్లు 'మిస్ మిషెల్, మిస్సెస్ డైసీ,మిస్ రేచెల్', హాయ్ గా , ఏ గందరగోళం లేకుండా పిలిచా.... ఇప్పుడు ప్రైమరీ లో మొదలయ్యింది నాకు ఈ తంటా.  

తనని పట్టించుకోకుండా నేను టీచర్ చెప్పే ఫీడ్బ్యాక్ వింటున్నా. చాలా ఆక్టివ్, వెరీ పొలైట్, ఫాస్ట్ లెర్నర్  అని ఇంకా చాలా పాజిటివ్ గా ప్రెయిజ్ చేసింది.. 
ఆవిడ తో, 'థాంక్ యూ, మిస్ ఓంగ్' అన్నా. జయ చేతులు కట్టుకుని, తల దించింది. నాకు దాని బాడీ లాంగ్వేజ్ తెలుసు.కోపం వస్తే అలా చేతులు ఫోల్డ్ చేస్తుంది. నేను టీచర్ పేరు తప్పు పలికానని అర్ధమయ్యింది.. టీచర్ నేను ఎలా పిలిచినా పట్టించుకోవట్లా ... బహుశా ఆవిడ కూడా నా లాగ రాజీ పడింది ఏమో!  ఎవరు ఎలా పిలిచినా పలకటానికి.

పాపాయి ని చూసి నాకు ఇంకా ఖంగారు వేసి అసలు ఆవిడ పేరు  పూర్తి గా మర్చిపోయి .' బై.. బై .. మిస్ ఆంగ్' అని నీళ్లు నములుతూ అన్నా.  ' హావ్ ఆ నైస్ వీకెండ్' అని చెప్పి వచ్చేసాం నేను పాపాయి.

ఇంటికి వచ్చేంత వరకు నాతో ఏమి మాట్లాడల, పిలుస్తుంటే పలకల, పిల్ల అలిగింది నా మీద. ఇంటికి వచ్చాక, డ్రెస్ చేంజ్  చేసుకుని ఫ్రెష్ అప్  అయ్యి , ఐ పాడ్ లో అమ్మకి  స్కైప్ కాల్ చేసింది. 

'హాయ్ బుజ్జి  తల్లి వచ్చేసావా స్కూల్ నుంచి, అన్నం తిన్నావా ?' అంది అమ్మ

' యు నో అమ్మమ్మ వాట్ హాప్పీన్డ్  టుడే' అంది.
'ఏమయ్యింది రా ' అంది అమ్మ.
'మమ్మీ  ఎంబారస్డ్  మీ  ఇంఫ్రంట్ అఫ్ మై టీచర్స్' అంది రహస్యం గా నాకు వినపడకూడదు అన్నట్టు గా. 
పోనిలే, రక్షించింది మా అమ్మ కి ఫోన్ చేసి, వాళ్ళ నాన్నకో, బామ్మకో చెయ్యకుండా.అని మనసులో అనుకున్నా.

 నేను ఈ లోపల  ప్లేట్ లో అన్నం కలిపి తీసుకు వెళ్ళా. ముద్దలు కలిపి పెడుతుంటే గుటుక్కు గుటుక్కు  మింగేస్తోంది, గబగబా చెప్పాలన్న తాపత్రయం లో, 

'షీ కుడ్ నాట్ ప్రొనౌన్స్ మై టీచర్'స్ నేమ్ ప్రొపర్లీ. నాట్ వన్ టైం అమ్మమ్మ త్రీ టైమ్స్' అని మూడు వేళ్ళు చూపిస్తూ నా  వంక చూసింది  పాపాయి.

అమ్మ నవ్వేస్తూ..'.ఓహ్ అదా .. మీ టీచర్ ఎవరు?' అంటే

 'ఫామ్ టీచర్ ఈజ్ మిస్ ఒంగ్ .. కో ఫారం టీచర్ ఈజ్ మిస్టర్ కుంగ్' అంది పాపాయి.

'ఒంగునే వాళ్ళు కుంగునే వాళ్ళు తప్ప లేరా మీ స్కూల్ లో'  అని కిసుక్కున నవ్వి అంది అమ్మ.

'వాట్ అమ్మమ్మ' అంది పాపాయి అర్ధం కాక. 

అమ్మ 'ఏమి లేదు లే' అని . 'మనకి వాళ్ళ పేర్లు పిలవటం కష్టం.. వీ కెన్ నాట్  ప్రొనౌన్స్ అండ్ దే టూ కెన్ నాట్  ప్రొనౌన్స్ అవర్  నేమ్స్' అంది 

'బట్ అమ్మమ్మ,  దే ప్రొనౌన్స్ మై నేమ్ వెరీ వెల్' అంది పాపాయి. 

'బికాజ్  యువర్ నేమ్ ఈజ్  ఈజిలీ ప్రొనౌన్సిబుల్' అంది అమ్మ.

దాని  పేరు వెనకాల చాట భారతం అంతా నెమ్మదిగా, నచ్చచెప్పింది అమ్మ.

'వీ వాంటెడ్ టు యాడ్ వెంకట, నాగ, శివ, దుర్గ, జయ..కానీ అది పెట్టలా, బికాజ్ టూ లాంగ్, డిఫికల్ట్ టు రైట్ అండ్  విల్ నాట్ ఫిట్ ఇన్ ద పాస్పోర్ట్ అని అంది. 

జయ కొంచెం సేపు  మౌనంగా ఆలోచనల లోకి వెళ్ళింది. 

'కెన్ యూ స్పెల్ మై యాక్చువల్ ఫుల్ నేమ్ అమ్మమ్మ' అని అడిగి నోట్ చేసుకుంది. 

స్పెల్లింగ్ అండ్  ప్రొనంసియెషన్ ఒక మాదిరి గా నేర్చుకోవటానికి జయకి  ఒక వారం పట్టింది. ఈ వారం రోజులు, ఎప్పుడు చూసినా తన పేరు ఇంపోజిషన్ లా రాసింది. పోనిలే హాండ్రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది అనుకున్న.

నెక్స్ట్ వీక్ స్కూల్ కి ఎర్లీగా వెళ్ళింది.. ఇంకో రెండు రోజులు అలానే చేసే సరికి నాకు డౌట్  వచ్చి అడిగా 'ఎందుకు ఎర్లీ గా వెళ్తున్నావు అంటే ,' ఓరల్ ప్రాక్టీస్' అని నవ్వింది.

' ఐ యాం   టీచింగ్ మై ఫ్రెండ్స్ హౌ టూ  ప్రొనౌన్స్ మై నేమ్' అంది. 

'బట్ దే ఆల్రెడీ నో హౌ టు ప్రొనౌన్స్ యువర్ నేమ్'. అని నేను అంటే. 

'నాట్ మై యాక్టుల్ నేమ్ బట్ ది నేమ్స్ విచ్ అమ్మమ్మ అండ్ బామ్మ  వాంటెడ్ టు  నేమ్ వెంఖట, నగ, శివ, దుర్గ .... (వారం ప్రాక్టీస్ చేసినా పాపం పాపాయి కి నోరు తిరగట్ల)  యూ నో మై ఫ్రెండ్స్ అర్ వెరీ మచ్  ఎంజాయింగ్ టు  లెర్న్ అండ్ ప్రొనౌన్స్. ఇట్స్ లాట్స్ ఆఫ్ ఫన్ మమ్మీ అండ్ ఇట్స్ ఆల్సో ఫన్  టు  హియర్ థెం సెయింగ్ , 'వింఖతో, సివో, నగో, దుర్గో, జయ, సుడాక యూపాడ్ యయి యుల'

'ఐ విల్ టీచ్ థెం టు  ప్రొనౌన్స్ ఆల్ ది నేమ్స్ దట్ ఐ నో. ఈవెంట్యుఅల్లీ, థెయ్ విల్ ఎక్సల్ ఇన్ ప్రొనౌన్సిన్గ్ దీస్ నేమ్స్, లెర్న్ అదర్ నేమ్స్ అండ్ దే కెన్ కరెక్ట్ అదర్ పీపుల్ అండ్ ఇట్ విల్ బి లైక్ వన్ డే ఆల్ విల్ ప్రొనౌన్స్ ఇండియన్  నేమ్స్ కర్రెక్ట్లీ '  అంటూ స్కూల్ బాగ్ తీసుకుని రోడ్ మీద  స్కూల్ వరకు....'వింఖతో ,నగో,సివో,దుర్గ,,జయ,..... అదే జపం చేస్తూ వెళ్ళింది.

 ఆ చిన్ని బుర్రలో ని ఆలోచనలకి, తెలివితేటలకు, నేను ఆనందంతో అవాక్కయి స్కూల్ కి వెళ్తున్న జయనే  చూస్తూ నుంచున్నా.

--- జానకి జ్యోతి విశ్వనాధ, సింగపూర్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com