భారతీయ సినిమా చరిత్రలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా 'ఆదిత్య 369'కు 30 ఏళ్లు

- July 17, 2021 , by Maagulf
భారతీయ సినిమా చరిత్రలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా \'ఆదిత్య 369\'కు 30 ఏళ్లు

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా 'ఆదిత్య 369'. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ రెండో చిత్రమిది. నేటికి (ఆదివారం - జూలై 18) 'ఆదిత్య 369' విడుదలై 30 సంవత్సరాలు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇదే. తరాల తారతమ్యం లేకుండా 30 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న చిత్రమిది. శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హీరో, దర్శక-నిర్మాతలు తమ అనుభవాలు - అభిప్రాయాలను పంచుకున్నారు.

వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి... సినిమా నెగెటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేసిన మొదట్టమొదటి సినిమా 'ఆదిత్య 369' - హీరో బాలకృష్ణ 

బాలకృష్ణ మాట్లాడుతూ "ఆదిత్య 369' విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు. ఎన్నిసార్లు చూసినా అదొక అద్భుతం, అజరామరం. అప్పుడు మేం చేసిన ప్రయత్నాన్ని ఆదరించి, ఇప్పటికీ చూస్తున్నారు. ఎప్పటికీ చూస్తుంటారు. ఆ సినిమా ఒక శ్రవణానందం, నయనానందం. కొన్నిటి గురించి ఎక్కువ మాట్లాడితే సూర్యుడిని వేలెత్తి చూపించినట్టు అవుతుంది. అటువంటిదే 'ఆదిత్య 369'. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అవి ప్రజల హృదయాల్లో, కళాభిమానుల లైబ్రరీలలో ఉండిపోయే సినిమాలు, వాళ్లు ఎప్పుడూ మాట్లాడుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ కోవకు చెందిన చిత్రమే 'ఆదిత్య 369'. ఒక 'పాతాళ భైరవి', 'మల్లీశ్వరి', 'దేవదాసు', 'సీతారామ కళ్యాణం', 'శ్రీకృష్ణ పాండవీయం', 'బొబ్బిలి పులి', 'కొండవీటి సింహం', 'సర్దార్ పాపారాయుడు', 'సింహా', 'లెజెండ్', 'మంగమ్మగారి మనవడు' - ఈ జాబితాలో నిలిచిపోయే సినిమా 'ఆదిత్య 369'. ఇవాళ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయ్యిందంటే చాలా సంతోషంగా ఉంది. 'అప్పుడే 30 ఏళ్లు అయ్యిందా?' అనిపిస్తుంది. మా నిర్మాత కృష్ణప్రసాద్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, సినిమాకు పనిచేసిన మిగతావాళ్ళు అదే హుషారుతో ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో చెప్పుకోవలసింది శివైక్యమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గురించి. ఈ సినిమా రూపొందడంలో ఆయనదే ప్రధాన పాత్ర. ఆయనే మా సంధానకర్త. మమ్మల్ని అందర్నీ కలిపింది ఆయనే. మొదట ఆయన, కృష్ణప్రసాద్ గారు, సింగీతం శ్రీనివాసరావుగారు వచ్చి నన్ను కలిశారు.ఇటువంటి సినిమా చేయడానికి నిర్మాతకు ధైర్యం ఉండాలి. దర్శకుడి ప్యాషన్ ఉండాలి. హీరోకి ప్యాషన్, ధైర్యంతో పాటు దాని గురించి అవగాహన ఉండాలి. ఆ పాత్రలే మమ్మల్ని ఎంచుకున్నాయి. చరిత్రలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలను అందరూ అనుకరించడం జరిగింది. మేం ట్రెండ్ సెట్టర్స్ అనుకోండి. కానీ, ఇటువంటి సినిమా ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. అందుకే, ఈ సినిమా గురించి మేమింత గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కృష్ణప్రసాద్ అప్పటికి యువ నిర్మాత. ఇటువంటి సినిమాను తీయడానికి ఆయన పూనుకోవడం ధైర్యసాహసాలతో కూడిన విషయం. నాకు నిర్మాత శ్రేయస్సు ముఖ్యం. అందుకని, కొత్త కథానాయికను తీసుకుంటానంటే అంగీకరించా. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మీద మాకు నమ్మకం ఉంది. సినిమా, సినిమాకు పోలీకలు లేకుండా ఎన్నో సినిమాలు తీసిన దర్శకుడు ఆయన. అన్ని తరాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎంతో అద్భుతంగా 'ఆదిత్య 369' తీశారు. అప్పట్లో ఈ సినిమా చేసేటప్పుడు చాలామంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. 'ఆదిత్య 369' టైటిల్ ఏంటి? సినిమాలో ఏం జరుగుతుంది? అని చర్చించుకున్నారు. ఏం జరుగుతుందో జనం ముందే ఊహిస్తే సినిమా ఎందుకు అవుతుంది? చాలా సినిమాలు ఆ విధంగా ఉంటున్నా... ఇదొక డిఫరెంట్ జానర్ ఫాంటసీ సినిమా. నాన్నగారు 'దేవాంతకుడు' చేశారు. అందులో కథ వేరే విధంగా వెళుతుంది. ఇందులో మరో విధంగా వెళుతుంది. ఈ సినిమాకు గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు పాత్ర. అంతకు ముందు 'తెనాలి రామకృష్ణ', 'మహామంత్రి తిమ్మరుసు' సినిమాల్లో  నాన్నగారు ఆ పాత్ర చేశారు. మళ్లీ ఆ పాత్రను అద్భుతంగా సృష్టించారు. ఆ యాంబియన్స్ బాగా క్రియేట్ చేశారు. ఈ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. ఇప్పుడు డిజిటల్ కెమెరాలు వచ్చాయి. అప్పుడు లేవు. గ్రాఫిక్స్ లేని రోజుల్లో, చలచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారి వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి... సినిమా నెగెటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే, నా సరసన కొత్త కథానాయిక మోహిని గారిని పెట్టి తీయడం ఎంతో ధైర్యసాహసాలతో కూడిన విషయం. జంధ్యాలగారి సంభాషణలు, ఇళయరాజా సంగీతం అద్భుతం. సందర్భానుసారంగా తన శైలికి భిన్నంగా, ప్రత్యేకమైన బాణీలు అందించారు. ఈ సినిమాకు కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. తెనాలి రామకృష్ణగా చంద్రమోహన్ చేశారు. అంతకు ముందు 'తెనాలి రామకృష్ణ'లో అక్కినేని నాగేశ్వరరావు చేసిన పాత్ర అది. అలాగే, మహామంత్రి తిమ్మరుసుగా సోమయాజులు చేశారు. జిక్కీగారు పాడిన 'జాణవులే...' పెద్ద హిట్. ఆ పాటలో ఆస్థాన నర్తకిగా సిల్క్ స్మితగారు చేశారు. సేనాధిపతిగా చలపతిరావుగారు నటించారు. డైలాగ్ లేని ఆర్టిస్టు కూడా అలా కనపడితే చాలు... క్యారెక్టర్ ఎలివేట్ అయ్యింది. ఉదాహరణకు, శ్రీకృష్ణదేవరాయలు భార్య పాత్రలో కిన్నెరగారు నటించారు. కత్తిసాము నేపథ్యంలో పోరాటాలను 'విక్రమ్' ధర్మగారు అద్భుతంగా రూపొందించారు. ఇప్పుడు ఆయన మనమధ్య లేరు. సుందరం మాస్టర్, ప్రభుదేవా, రాజు సుందరం అద్భుతంగా డాన్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమా కోసం ఆయన కత్తిసాము నేర్చుకుని మరీ చేశారు. ఏది ఎంత వరకూ సమపాళ్లలో ఉండాలో అంతే ఉంది. సింగీతం శ్రీనివాసరావు అద్భుతమైన స్క్రీన్ ప్లే రాశారు.  కెప్టెన్ ఆఫ్ ది షిప్... అందరి నుంచి అద్భుతమైన నటన రాబట్టుకున్నారు. ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రమిది. ఇటువంటి సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. భారతీయులు ఇటువంటి సినిమా చేయగలరని నిరూపించాం. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన మా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకి, నిర్మాత కృష్ణప్రసాద్కి, సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ, ప్రేక్షకదేవుళ్ళకు నా కృతజ్ఞతలు. కృష్ణప్రసాద్ నైతిక విలువలు ఉన్న నిర్మాత. వ్యాపారాత్మకంగా కాకుండా, తన కోసం కాకుండా సినిమా ఇండస్ట్రీ కోసం సినిమాలు తీశారు. 'ఆదిత్య 369' తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. నాతో 'వంశానికొక్కడు', 'భలేవాడివి బాసు', 'మిత్రుడు' తీశారు. అటువంటి నిర్మాత ఉండటం ఇండస్ట్రీ అదృష్టం.ఇండస్ట్రీకి చాలా అవసరం. ముందు ముందు 'ఆదిత్య 369'కి సీక్వెల్స్ చేయాలని నిర్ణయించుకున్నా" అని అన్నారు. 

అదే 'ఆదిత్య 369' ప్రత్యేకత - దర్శకులు సింగీతం శ్రీనివాసరావు

చిత్రదర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ "ఇవాళ 'ఆదిత్య 369' సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ముగ్గురికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారిలో మొదటి వ్యక్తి... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. ఒకరోజు ఆయనను ఫ్లైట్‌లో కలిసినప్పుడు ట్రావెలింగ్ టైమ్‌లో కథ చెప్పా. ఎంతో ఎగ్జైట్ అయ్యి, ఆయన కృష్ణప్రసాద్ గారికి చెప్పారు. తర్వాత మేం బాలకృష్ణగారికి చెప్పడం, ప్రాజెక్ట్ ఓకే కావడం జరిగాయి. ఎస్పీబీగారిని ఆ రోజు నేను కలవకపోతే... ఈ సినిమా ఉండేదో? కాదో? అనేది నాకు సందేహమే. ఆయన్ను కలవడం వల్ల సినిమా మొదలైంది. అదొక దైవఘటన. రెండో వ్యక్తి... బాలకృష్ణగారు. కథ అనుకున్న తర్వాత 'శ్రీకృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణగారు నటిస్తేనే ఈ సినిమా, లేకపోతే లేదు' అని కృష్ణప్రసాద్ గారు పట్టుబట్టారు. అద్భుతమైన ఆలోచన అని మేమంతా బాలకృష్ణ దగ్గరకు వెళ్లాం. నేను 30 నిమిషాల పాటు కథ చెబితే, ఆయన 30 సెకన్లలో ఓకే చేసేశారు. 'నాన్న కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకు కూడా చాలా రోజులుగా చేయాలని ఉంది' అని బాలకృష్ణగారు చెప్పారు. చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన లేకపోతే సినిమా ఈరకంగా రాదు. మూడో వ్యక్తి... శివలెంక కృష్ణప్రసాద్. నిర్మాత లేకపోతే ఏ సినిమా ఉండదు. నేను ఎప్పుడూ ఈ మాట చెబుతా. 'ఆదిత్య 369'కి వస్తే... ఇండియాలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా. టైమ్  మెషీన్ సినిమా. ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్న సినిమాను నిర్మించడానికి కృష్ణప్రసాద్ ముందుకు వచ్చారు. ఆయనకు హ్యాట్సాఫ్. ఆయనకు మాత్రమే సాధ్యమైంది. కృష్ణప్రసాద్ ని నా జోహార్లు. కొత్తమ్మాయి మోహిని, ప్రొఫెసర్ గా టినో ఆనంద్, అమ్రిష్ పురి గారు, ఇవాళ హీరోగా ఉన్న అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తరుణ్, అన్నపూర్ణమ్మ... చాలామంది ప్రతిభావంతులైన నటీనటులు సినిమాలో నటించారు. తెరవెనుక జంధ్యాల మాటలు సమకూర్చగా, ఇళయరాజా అందమైన సంగీతం అందించారు. ఎస్పీబీగారు, జానకి పాడారు. అయితే, ముఖ్యంగా చెప్పవలసినది జిక్కీగారు పాడిన 'జాణవులే...' పాట గురించి. అద్భుతంగా ఉంటుంది. వేటూరి, వెన్నెలకంటి, సిరివెన్నెల పాటలు రాశారు. టెక్నికల్ విషయాలకు వస్తే... పీసీ శ్రీరామ్, వీఎస్సార్ స్వామి, కబీర్ లాల్ - ముగ్గురు ఛాయాగ్రాహకులు పని చేశారు పేకేటి రంగాగారు ఫ్యూచర్ ఎపిసోడ్ కోసం వేసిన సెట్స్ చాలా ఇంపార్టెంట్ గా నిలిచాయని చెప్పాలి.గౌతమ్ రాజుగారు షార్ప్ కట్స్ తో ఎడిటింగ్ చేశారు.ఫ్యూచర్ నేపథ్యంలో చేసినటువంటి పాటకు శివ సుబ్రహ్మణ్యం అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు.రోబోటిక్ మూమెంట్స్ చేయాలనే ఐడియా ఆయనకు ఎలా వచ్చిందో గాని హ్యాట్సాఫ్. ప్రతి సినిమా పునఃపుట్టినరోజు చేసుకుంటుంది. అయితే, 'ఆదిత్య 369' ప్రత్యేకత ఏంటంటే... రిలవెన్స్. కాంటెంపరరీ రిలవెన్స్. అదెలా అంటే? ఈ మధ్య మా మనవరాలి పెళ్లి అమెరికాలో జరిగింది. మేం ఇండియాలో ఉన్నాం. పెళ్లిని లైవ్ లో చూశాం. వెంటనే నాకు అందరూ ఫోనులు. పెళ్లి, శుభాకాంక్షలు పక్కనపెడితే... 'సార్, మీరు ఆ రోజు ఆదిత్య 369లో టీవీలో పెళ్లి చూస్తారని చెప్పింది ఈ రోజు జరిగింది' అని. సినిమాలో పోలీస్ స్టేషన్ ను ఫైవ్ స్టార్ హోటల్ లా చేశాం. అదింకా రాలేదు. ఎయిర్ ట్రాఫిక్ గురించి చెప్పాం. అదింకా రాలేదు. భవిష్యత్తులో అవన్నీ వస్తాయి. ముఖ్యంగా చెప్పవలసిన ఇంకో విషయం ఏంటంటే... నాకు తెలిసిన అబ్బాయి పాణిని అని ఉన్నాడు. నాసాలో పని చేస్తున్నాడు. అతను ఆస్ట్రో ఫిజిసిస్ట్. గొప్ప శాస్త్రవేత్త. ఇద్దరు కొలీగ్స్ తో కలిసి ఇంతవరకు ప్రపంచంలో వచ్చిన టైమ్  మెషీన్ కథలన్నీ తీసుకుని ఒక ప్రాజెక్ట్ చేశారు. స్పీల్ బర్గ్ 'బ్యాక్ టు ఫ్యూచర్'తో సహా అన్ని కథలు తీసుకున్నారు. లైట్, క్వాంటమ్ థియరీ వాటి ప్రకారం చూసి, 'ఆదిత్య 369' టైమ్ మెషీన్ అనేటటువంటిది బెస్ట్ అని నిర్ణయించారు. ఎందుకు? అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే... "స్పీల్ బర్గ్ సినిమాలో కార్లు అలా స్పేస్ లో వెళ్లిపోయి మాయమవుతాయి. టైమ్ మెషీన్ టైమ్ లో ట్రావెల్ చేస్తుంది గానీ స్పేస్ లో కాదు. 'ఆదిత్య 369'ల టైమ్ మెషీన్ వర్టికల్ యాక్సెస్ లో అలా తిరిగి తిరిగి మాయమవుతుంది' అని. ఈ విధంగా ఇవాళ్టికీ ఎంతో రిలవెన్స్ ఉన్న సినిమా ఇది. నేనూ ఎన్నో సినిమాలు చేశాను. అవన్నీ ప్రతి ఏడాది పుట్టినరోజులు చేసుకుంటాయి. అయితే, అవి ఆ రోజుల్లో చాలా బావుంటాయని అనుకుంటాం. ఈ రోజులకు అన్వయించుకునే సినిమాలు కాదు. ఈ ఒక్క 'ఆదిత్య 369'ను మాత్రం అన్వయించుకోవచ్చు. అటువంటి ప్రత్యేకతను సినిమా సంతరించుకుంది. అందుకని, 'ఆదిత్య 369' 30 ఏళ్లు పూర్తి చేసుకుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సినిమాకు పని చేసిన వాళ్లందరికీ, సినిమాను చూసి ఇష్టపడి మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్లందరికీ ధన్యవాదాలు" అని చెప్పారు.
 
నా జీవితంలో 'ఆదిత్య 369' ఒక బెంచ్ మార్క్... ఈ సినిమా అంటే నాకు బాలు అంకుల్ గుర్తొస్తారు - నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్

చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "మా 'ఆదిత్య 369' సినిమా జూలై 19, 1991 విడుదలైంది. నా శ్రీమతి అనితాకృష్ణ నిర్మాతగా  అక్టోబర్ 2, 1987న శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థను స్థాపించాను. మేం నిర్మించిన తొలి సినిమా 'చిన్నోడు పెద్దోడు'. ఏప్రిల్ 1, 1988న విడుదలైంది. చంద్రమోహన్ గారు, రాజేంద్రప్రసాద్ గారు హీరోలుగా రేలంగి నరసింహారావు  దర్శకత్వం వహించిన ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. మా అంకుల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ చిత్రానికి సంగీత దర్శకుడు. తొలి సినిమా విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న సమయంలో బాలు అంకుల్ 'కృష్ణా, ఓ మంచి పెద్ద సినిమా చెయ్. నేను హీరోలతో మాట్లాడతాను' అన్నారు. 'థాంక్యూ అంకుల్. అంతకంటే కావాల్సింది ఏముంటుంది?' అన్నాను. మా మధ్య ఈ సంభాషణ జరిగిన ఐదారు నెలల తర్వాత ఒకసారి బాలుగారి నుంచి ఫోన్ వచ్చింది. 'అర్జంటుగా విజయా గార్డెన్స్ కు రా' అన్నారు. నేను వెళ్లాను. 'రాత్రి బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు పక్క సీటులో సింగీతం శ్రీనివాసరావు ఉన్నారు. మంచి కథ చెప్పారు. ఒక్కసారి వారిని కలిసిరా' అని చెప్పారు. వెంటనే సింగీతంగారి దగ్గరకు వెళ్లాను. ఆయన 'కొత్త పాయింట్ తో కథ రెడీ చేశా. ఎప్పట్నుంచో నా మనసులో ఉన్నది' అని 'ఆదిత్య 369' కథ చెప్పారు. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ కథ. చాలా కొత్తగా అనిపించింది. 'ఇదేంటి? టైమ్ లో ట్రావెల్ అవుతారా?' అని అడిగా. 'ఇది ఫిక్షనల్ కథ. ఫాంటసీ' అని చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయలు కాలానికి, ఆ తర్వాత భవిష్యత్తుకు హీరో హీరోయిన్లు ట్రావెల్ చేస్తారని, మీకు కావాలంటే రిఫరెన్స్ ఇస్తానని ఆయన రెండు మూడు వీడియో క్యాసెట్లు ఇచ్చారు. స్పీల్ బర్గ్ తీసిన 'బ్యాక్ టు ఫ్యూచర్' పార్ట్ 1,2తో పాటు 'టైమ్ ఆఫ్టర్ టైమ్' అని మరొకటి. అవన్నీ చూశా. నాకు చాలా కొత్తగా అనిపించాయి. అదే విషయం సింగీతంగారితో చెప్పాను. 'చాలా బావున్నాయి. కానీ, తీయడం సాధ్యమా?' అనే ఆశ్చర్యంలో ఉన్నాను. భారతీయ తెరపై రానటువంటి కథాంశంతో సినిమా తీయడం ఒక రకమైన సాహసమని సింగీతంగారితో చెప్పాను. ఆ తర్వాత బాలు అంకుల్ తో డిస్కస్ చేశా. 'కృష్ణా... భవిష్యత్తులో నువ్వు ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. ఈ సినిమా మాత్రం ఒక ల్యాండ్ మార్క్ లా నిలబడుతుంది. ముఖ్యంగా నీ సంస్థకు ఒక మైలురాయి అవుతుంది' అని మహానుభావుడు ఎస్పీబీ అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో వెంటనే సింగీతం శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లి 'సార్. నేను ఈ సినిమా చేస్తా' అని చెప్పాను. 'కృష్ణదేవరాయలు అంటే నందమూరి బాలకృష్ణగారు చేస్తే చాలా బావుంటుంది' అని బాలు అంకుల్ తో అన్నాను. ఆయన కూడా 'బాలకృష్ణగారు అయితే బావుంటుంది. ఆయనతో నేను మాట్లాడతాను' అని అన్నారు. మేం కాంటాక్ట్ చేయగా, బాలకృష్ణగారు అప్పాయింట్మెంట్ ఇచ్చారు. అరగంట, 45 నిమిషాల పాటు శ్రీనివాసరావు నేరేషన్ ఇచ్చారు. హీరోగారు వెంటనే ఓకే చేశారు.అప్పుడు ఈ సినిమా చాలా పెద్ద కమర్షియల్ హిట్. బాలకృష్ణ మొదటి నుంచి కమర్షియల్ హీరో. కానీ, అప్పుడు 'ముద్దుల మావయ్య', 'భలే దొంగ' సినిమాలు చేశారు. 'నారి నారి నడుమ మురారి' షూటింగ్ జరుగుతోంది. 'లారీ డ్రైవర్' జస్ట్ స్టార్ట్ అయ్యింది. అటువంటి సమయంలో ఒక కొత్తదనం ఉన్న సినిమా 'ఆదిత్య 369'. ఒక క్లాసిక్ ఫిల్మ్. దీనిని చేయాలని అనుకోవడం నా అదృష్టమని అనుకోవాలి. ఇవాళ నేను ఈ సినిమా గురించి మాట్లాడుకున్నానంటే... నందమూరి బాలకృష్ణగారు, సింగీతం శ్రీనివాసరావు, 'ఈ సినిమా చెయ్. నీకు మంచి పేరు వస్తుంది. చరిత్రలో మంచి సినిమాగా నిలబడుతుంది' అని చెప్పిన బాలు అంకుల్ కారకులు. ఈ ముగ్గురికీ నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఇళయరాజా సంగీత దర్శకులుగా, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకులుగా, జంధ్యాల మాటల రచయితగా జూన్, 1990లో సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయ్యాక శ్రీరామ్ కి సుస్తీ చేసింది. నాలుగైదు నెలల పాటు సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేశాం. అందులో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి సన్నివేశాలు తీయాలని అనుకున్నాం. అప్పుడు 'మీరు ఇబ్బంది పడవద్దు కృష్ణ. వీఎస్సార్ స్వామిగారు చేస్తే చాలా బావుంటుంది. కమాండ్ ఉన్న కెమెరామేన్. ఆయనతో నేను మాట్లాడతాను. శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి పీరియడ్ వర్క్ పూర్తయిన తర్వాత నేను మళ్ళీ జాయిన్ అవుతా' పీసీ శ్రీరామ్ చెప్పారు. సరేనని అన్నాను. వీఎస్సార్ స్వామిగారు వచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు కాలాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేలా పేకేటి రంగా భారీ సెట్స్ వేశారు. పీరియాడిక్ వర్క్ పూర్తయిన తర్వాత ఫ్యూచర్ ఎపిసోడ్ చేద్దామని అనుకున్నాం. పీసీ శ్రీరామ్ ని మణిరత్నం 'అంజలి' సినిమాకు తీసుకువెళ్లారు. అప్పుడు మేం కబీర్ లాల్ ని తీసుకున్నాం. అలా... వర్తమానకాలంలో నడిచే సన్నివేశాలకు పీసీ శ్రీరామ్, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సన్నివేశాలకు వీఎస్సార్ స్వామిగారు, భవిష్యత్తును చూపించే సన్నివేశాలకు కబీర్ లాల్ ఛాయాగ్రాహ బాధ్యతలు నిర్వర్తించారు. ముగ్గురు మహానుభావులతో పని చేశా. ఈ సినిమా చేయడం ఎప్పటికీ మరువలేని ఓ మంచి అనుభూతి. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద దర్శకులు, హీరోలు సెట్స్ చూడటానికి వచ్చేవారు. అందరూ చెప్పుకోనేవారు. అలా అందరూ రావడం నాకు బలాన్ని ఇచ్చింది. బాలకృష్ణగారు ఎనర్జీతో షూటింగ్ చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గెటప్ విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. డ్రస్సులు, ఆభరణాలు, మేకప్, డైలాగ్ డిక్షన్ విషయంలో... ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే? రేయింబవళ్లు ఆలోచించేవారు. పక్కన ఇతర సినిమా షూటింగులు చేస్తూ, ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని శ్రద్ధ వహించేవారు. సినిమా విడుదలై ఇప్పటికి 30 ఏళ్లు అయినప్పటికీ... శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ ఆహార్యం, భాష, ఉచ్ఛారణను మర్చిపోలేదంటే దాని వెనుక ఎంతో కృషి ఉంది. ప్రజలంతా సినిమాను ఎంతో అభినందించారు. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని అనిపించింది. అలాగే, ఫ్యూచర్... అప్పట్లో సీజీ వర్క్స్, గ్రాఫిక్స్ వంటివి ఏమీ లేవు. కొంచెం కష్టమైనా చేయగలని దర్శకుడు సింగీతంకి కాన్ఫిడెన్స్, క్లారిటీ ఉన్నాయి. టైమ్ మెషీన్ ను మాన్యువల్ గా రెడీ చేసి... అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతికత, కెమెరాల సహాయంతో అద్భుతంగా చేశాం. భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది ఊహాజనితం కాబట్టి వినోదాత్మకంగా చెప్పాలని ప్రయత్నించాం. సినిమాలో బ్రహ్మానందంగారితో ఆయన శ్రీమతి 'ఏవండీ. ఈ రోజు మన అమ్మాయి పెళ్లి. అందరినీ టీవీలో చూడమని చెప్పండి' అంటారు. ఇవాళ కరోనా మహమ్మారి వల్ల మనమంతా పెళ్లిలు, శుభకార్యాలకు వెళ్లలేక... వీడియోలు, యూట్యూబ్ లో చూసుకోవాల్సి వస్తోంది. దీనిని 30 ఏళ్ల క్రితం చెప్పడం అనేది మాకే ఆశ్చర్యకరమైన విషయం. ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. ఇది నాకు, నా సంస్థకు చాలా గుర్తింపు తీసుకొచ్చింది. దీని తర్వాత నేను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ 'మీరు ఆదిత్య 369 నిర్మాత కదా' అనేవారు. నాకు అంత గుర్తింపు, గొప్ప గౌరవాన్ని ఇచ్చిన చిత్రమిది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల దగ్గరకు మేం ఒక టూర్ వేశాం. ప్రతి థియేటర్ కార్లతో నిండిపోయేది. క్లాస్ పీపుల్ ఎంతోమంది వచ్చేవారు. 'ఎంత బావుందండీ' అంటూ మా దగ్గరకు వచ్చి ప్రశంసించేవారు. ముఖ్యంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్టును చాలా థ్రిల్ గా ఫీలయ్యారు. ఇటువంటి సినిమాను నాకు ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావుకి, దీనిని నమ్మి చేసిన నందమూరి బాలకృష్ణకి, ఈ సినిమా ప్రారంభానికి మూలపురుషుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని మళ్లీ చెబుతున్నా. అలాగే, మాస్ట్రో ఇళయరాజా గురించి మనం మాట్లాడుకోవాలి. అద్భుతమైన పాటలు ఇచ్చారు. 'రాజ నర్తకి' పాటకు వస్తే... ట్యూన్ అంతా సెట్ అయిన తర్వాత జిక్కిగారి చేత పాడిస్తే, ఆ ఓల్డ్ ఫీల్ వస్తుందని ఆయన అన్నారు. సింగీతం ఎగ్జైట్ అయ్యారు. చాలా బావుంటుందని అన్నారు. నిర్మాతగా నేను కొంత భయపడ్డా. 'ఇవాళ మనకు జానకిగారు, చిత్రా... వీళ్లంతా ఉన్నారు. జిక్కిగారు పాడి ఎన్నో ఏళ్లయింది.  ఆవిడతో పాడిస్తే ప్రయోగం అవుతుందా?' అని నాలో భయాన్ని, సంకోచాన్ని సింగీతంతో చెప్పాను. 'సార్, నిర్భయంగా ఉండండి. చాలా బావుంటుంది. మీరు చూడండి' అన్నారు. నిజంగా వారు చెప్పింది నిజమైంది. 'జాణవులే... నేర జాణవులే' పాట గురించి అందరూ మాట్లాడుకున్నారు. సినిమాలో పాటలు అన్నిటికీ నృత్య దర్శకుడిగా సుందరం మాస్టర్ పేరు వేశాం. అయితే, ఆయన కుమారులు ప్రభుదేవా, రాజు సుందరం కూడా ఈ సినిమాకు పని చేశారు. దర్బార్ లో ఉండే కాంపిటీషన్ సాంగ్ 'సురమొహం'ను రాజు సుందరం చేశారు. అతను చేసిన తొలి పాట అదే. అతడిని మా సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశాం. కళా దర్శకుడు పేకేటి రంగాగారికి ఈ సినిమా నంది అవార్డును తెచ్చింది. రేయింబవళ్లు ఆయన చేసిన కృషికి పురస్కారం దక్కింది. డ్రస్సుల దగ్గర నుంచి సెట్స్ వరకూ ఎన్నో స్కెచ్ లు వేశారు. మన సినిమా తర్వాత కబీర్ లాల్ హిందీకి వెళ్లారు. పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఎడిటర్ గౌతమ్ రాజు గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఫ్యూచర్ షాట్స్ మేం అనుకున్న క్వాలిటీలో రాకపోయినా... దర్శకుడితో ట్రావెల్ అయ్యి ఎంతో బాగా ఎడిటింగ్ చేశారు. నిజంగా వండర్స్ చేశారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిన సాంబశివరావుగారికి నంది అవార్డు వచ్చింది. సినిమాలో ప్రతి ఆర్టిస్టు చాలా బాగా చేశారు. తరుణ్ కూడా ఎంత బాగా చేశాడో. చిన్న వయసులో మంచి పెర్ఫార్మన్స్ చేశాడు. కథానాయిక విషయానికి వస్తే... ముందు మేం అప్పటికి అగ్రస్థాయిలో ఉన్నవాళ్లను అనుకున్నాం. కానీ, మాకు వర్కవుట్ కాలేదు. విజయశాంతిగారు సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అప్పటికి బాలయ్యబాబుతో కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నారు. అందుకని, మేం డీవియేట్ అయ్యాం. అప్పుడు 'ఈరమను రోజా' అని ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో అమ్మాయి బావుంటుందేమో చూడమని పీసీ శ్రీరామ్ చెప్పారు. ఆమెను చూడటం, తీసుకోవడం జరిగింది. అలా మోహిని మా సినిమాలోకి వచ్చారు. బడ్జెట్ పరంగా సినిమాకు ముందు అనుకున్నదాని కంటే కొంత పెరిగింది. అయితే, బయ్యర్లు సినిమా చూసిన తర్వాత 'బాగా ఖర్చుపెట్టి తీశారు' అని అందరూ కోపరేట్ చేశారు. ఈ సినిమాకు బాలసుబ్రహ్మణం అన్ని రకాలుగా నాకు వెన్నుముకలా నిలబడ్డారు. ఇవాళ ఆయన మనమధ్య లేకయినా... సినిమా గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు బాలు అంకుల్ గుర్తుకు వస్తారు. ఆ సినిమాకు మాత్రమే కాదు, ఆయన ఉన్నన్ని రోజులూ నైతికంగా నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. నాకు అండగా ఉన్నారు. నన్ను ప్రోత్సహించారు. 'ఆదిత్య 369' తర్వాత నేను ఎన్ని సినిమాలు చేసినా... నా జీవితంలో ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ అయ్యింది. ప్రేక్షకుల్లో మాత్రమే కాదు, పరిశ్రమలోనూ ఎంతో పేరు తీసుకొచ్చింది. 'ఆ రోజుల్లో మీరు అంతలా చేశారు' అంటుంటే... నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బు సంపాదిస్తాం. కానీ, పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ఈ సినిమా వల్ల నాకు వచ్చిన గౌరవం 30 ఏళ్లు తర్వాతే కాదు... 50 ఏళ్లయినా ఉంటుంది. ఈ సినిమాను ప్రేక్షకులు మర్చిపోలేరు. టాప్ 100 సినిమాల్లో 'ఆదిత్య 369' ఒకటి కావడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం" అని అన్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com