జీసీఏఏ స్పష్టత తర్వాతే టికెట్లు బుక్ చేసుకోండి..విదేశాల్లోని ప్రవాసియులకు సూచన

- July 22, 2021 , by Maagulf
జీసీఏఏ స్పష్టత తర్వాతే టికెట్లు బుక్ చేసుకోండి..విదేశాల్లోని ప్రవాసియులకు సూచన

యూఏఈ: కోవిడ్ నేపథ్యంలో విధించిన ట్రావెల్ బ్యాన్ తో 16 దేశాల్లోని వేలాది మంది యూఏఈ వచ్చే సమయం కోసం వెయ్యి కల్లతో ఎదురుచూస్తున్నారు. ప్రవాసియులు తమ సొంత దేశాల్లో చిక్కుకొని పోయి తమ మూడు నెలలుగా యూఏఈలోని తమ ఇళ్లకు, ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు. సౌతాఫ్రికాకు చెందిన వారైతే ఏకంగా ఆరు నెలలుగా అక్కడే చిక్కుబడిపోయారు. ఇంకొందరు వీసా గడువు ముగిసేందుకు రోజుల గడువే ఉండటంతో తమ భవిష్యత్తుపై ఆందోళనగా, యూఏఈ తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ ఎదురు చూస్తూ టెన్షన్ల మధ్య రోజులు గడుపుతున్నారు. ఇలాంటి వాళ్లంతా ఏదో ఒక మార్గంలో యూఏఈకి తిరిగొచ్చి తమ ఉద్యోగాల్లో చేరేందుకు ఏ అవకాశం ఉన్నా విడిచిపెట్టడం లేదు. ట్రావెల్ గడువు ముగిసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వచ్చిన మరుక్షణమే టికెట్ల బుకింగ్ కోసం  ఎగబడుతున్నారు. అయితే..ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని, ట్రావెల్ బ్యాన్ పై తమ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతే టికెట్లను బుక్ చేసుకోవాలని యూఏఈ డీజీసీఏ సూచించింది. పరిస్థితులకు అనుగుణంగా ఆయా దేశాల్లో కోవిడ్ తీవ్రతను యూఏఈ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, సరైన సమయంలో సరైన నిర్ణయం వెలువడుతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు ట్రావెల్ బ్యాన్ ముగింపు తేదిలపై సంకేతాలు అందుతున్నా..వైరస్ తీవ్రత నేపథ్యంలో బ్యాన్ కొనసాగుతూ వస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. తొందరపడి టికెట్లకు డబ్బులు పోసి ప్రవాసియులు తమ డబ్బును, కాలాన్ని వృధా చేసుకోవద్దని హితువు పలికింది.

ప్రస్తుతం యూఏఈ 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. బ్యాన్ లిస్టులో ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇండోనేషియా, లైబీరియా, నమీబియా, నేపాల్, నైజీరియా, పాకిస్తాన్, ఉగాండా, సియెర్రా లియోన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వియత్నాం, జాంబియా ఉన్నాయి. అయితే..ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ రెండు వారాలు క్వారంటైన్ లో ఉన్న తర్వాత యూఏఈ చేరుకోవచ్చు. ఇంకొందరు ఒక్కో టికెట్ కు Dh25,000 చెల్లించి ఛార్టెర్డ్ ఫ్లైట్ లో తిరిగొస్తున్నారు. ఇంకొందరు అర్మేనియా, ఉజ్బెకిస్తాన్, సెర్బియా, ఇథియోపియా, ఖతార్ వెళ్లి అక్కడ 15 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి యూఈఏ చేరుకుంటున్నారు. క్వారంటైన్ కోసం ఒక్కో ప్రయాణికుడికి Dh9,000 ఛార్జ్ చేస్తున్నారు. ఉద్యోగాలపై ఆందోళనతో యూఏఈ తిరిగొచ్చేందుకు డిమాండ్ ఉండటంతో ట్రావెల్ ఏజెంట్లు, క్వారంటైన్ ఛార్జ్ లు భారీగానే ఉంటున్నాయి. ట్రావెల్ వ్యాన్ ఎత్తివేస్తారనే సంకేతాలు రాగానే ఎయిర్ లైన్స్, ట్రావెల్ ఏజెంట్లు బుకింగ్ లు ప్రారంభించటం తర్వాత అందుకు విరుద్ధ ప్రకటనతో బుకింగ్స్ రద్దు అవటం కొన్నాళ్లుగా సాధారణంగా జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత తాము ఫ్లైట్ సర్వీసులపై స్పష్టత ఇచ్చిన తర్వాతే టికెట్లు బుక్ చేసుకోవాలని జీసీఏఏ ప్రవాసియులను సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com