భారీ వర్షాలతో బల్దియా అప్రమత్తం:మేయర్ విజయలక్ష్మి
- July 23, 2021
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగర ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా విస్తృత చర్యలు చేపట్టినట్టు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలియజేశారు.జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్షాకాల ఎమర్జెన్సీ కంట్రోల్ రూంను మేయర్ విజయలక్ష్మి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ...నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే సమస్యల పరిష్కారానికై వివిధ శాఖల అధికారులతో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని అన్నారు. జిహెచ్ఎంసితో పాటు జలమండలి, రెవెన్యూ, విద్యుత్, పర్యాటక, పోలీసు తదితర శాఖల అధికారులు ఈ కంట్రోల్ రూం లో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తారని తెలిపారు. నగరంలో వర్షాల వల్ల ఏవిధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 324 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నగరంలో నీటి నిల్వలు ఉండే ప్రాంతాల్లో నీటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి 200 మోటర్ పంపులను సిద్దంగా ఉంచామని పేర్కొన్నారు. నిరంతర వర్షాల వల్ల నగరంలోని రహదారుల్లో 3900 గుంతలు ఏర్పడగా వాటిని వెంటనే పూడ్చివేశామని చెప్పారు. ఈ గుంతలను పూడ్చివేయడానికి షెల్ క్యాప్ అనే మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు తెలియజేశారు. జిహెచ్ఎంసి కంట్రోల్ రూం నెంబర్ 040-21111111, డయల్ 100, మై జిహెచ్ఎంసి యాప్, జిహెచ్ఎంసి వెబ్ సైట్ తదితర మాద్యమాల ద్వారా 296 ఫిర్యాదులు అందాయని, వీటిలో కాల్ సెంటర్ ద్వారా 192, డయల్ 100 ద్వారా 32, మైజిహెచ్ఎంసి యాప్ ద్వారా 59, జిహెచ్ఎంసి వెబ్ సైట్ ద్వారా 13 ఫిర్యాదులు అందాయని వివరించారు. వీటిలో దీర్ఘకాలిక సమస్యలు మినహా మిగతా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించామని తెలిపారు. కూలిన చెట్లను, రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చివేయడం, రోడ్ల మరమ్మతులు తదితర పనులను చేపట్టడానికి తక్షణ మరమ్మతు బృందాలు, మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు, సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలతో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం టీమ్ లను కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు. జిహెచ్ఎంసి బృందాల అప్రమత్తత, తక్షణం స్పందించడం వల్లే ఇప్పటి వరకు ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు గానీ, సమస్యలు గాని ఎదురుకాలేదని గుర్తు చేశారు. జంట జలాశయాలు అయిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల తలుపులు ఎత్తి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతాల్లో ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత చర్యలు చేపట్టామని తెలియజేశారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ప్రతి సర్కిల్ లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. జిహెచ్ఎంసి జోనల్, డిప్యూటి కమిషనర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!







