అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి జయంతి కన్నుమూత..

- July 26, 2021 , by Maagulf
అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి జయంతి కన్నుమూత..

అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూసారు. ఆమె వయసు 76 ఏళ్లు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె ఈ రోజు ఉదయం కన్నుమూసారు. జయంతి విషయానికొస్తే.. ఆమె ప్రముఖ కన్నడ సినిమా ‘జేను గూడు’ సినిమాతో 1963లో  హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం ‘భార్య భర్తలు’. ఈమె తెలుగులో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలకే  పరిమితమైంది. అప్పట్లోనే 1960, 70, 80లలో జయంతి తన చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా మూడు దశాబ్దాలుగా హీరోయిన్‌గా నటించింది. ఈమె కేవలం తెలుగు, కన్నడ చిత్రాలకే పరిమితం కాలేదు. తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా ఏడు అవార్డులను అందుకుంది. అంతేకాదు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 1965లో ‘మిస్ లీలావతి’ సినిమాకు గాను ఉత్తమనటి  రాష్ట్రపతి అవార్డు అందుకుంది. ఈమెకు కన్నడ ప్రభుత్వం అభినయ శారద అనే బిరుదు కూడా ప్రధానం చేసారు.

ఈమె అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని బళ్లారిలో 6 జనవరి 1945లో జన్మించింది. ఈమె ప్రముఖ నటుడు దర్శకుడు పేకేటి శివరాం‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమెకు కృష్ణ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు.

జయంతి విషయానికొస్తే.. ఈమె అప్పటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, రాజ్ కుమార్, విష్ణు వర్ధన్, జెమినీ గణేషన్, ఎంజీఆర్., శివాజీ గణేషణ్‌తో బాలీవుడ్ నటులు షమ్మీ కపూర్‌తో పలువురు అగ్ర నటుల సరసన నటించింది. హిందీలో చివరగా ఈమె షారుఖ్, దీపికా హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలో నటించింది. తెలుగులో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ’సైరా నరసింహారెడ్డి’  సినిమాలో కనిపించింది.  ఈమె రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 1998లో లోక్‌సభ ఎన్నికల్లో లోకశక్తి పార్టీ తరుపున చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమె మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగిరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  గత కొన్నేళ్లుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఈమె తుది శ్వాస విడిచారు. అప్పట్లో ఈమె చనిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com