319 మంది ఆస్టర్ డాక్టర్లకు గోల్డెన్ వీసా

- August 01, 2021 , by Maagulf
319 మంది ఆస్టర్ డాక్టర్లకు గోల్డెన్ వీసా

యూఏఈ: ఆస్టర్ డీఎమ్ హెల్త్ కేర్ నెట్వర్క్ కు చెందిన 319 మంది డాక్టర్లకు గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది యూఏఈ. వైద్యరంగంలో ఆస్టర్ వైద్యులు, సిబ్బంది చేస్తున్న నిరంతర సేవలకు గుర్తింపుగా వారికి దీర్ఘకాలిక వీసాలను ప్రదానం చేసింది. తమ హెల్త్ కేర్ వైద్యుల సేవలను గుర్తించి..వారికి గోల్డెన్ వీసాలను మంజూరు చేయటం పట్ల ఆస్టర్ డీఎమ్ హెల్త్ కేర్ హర్షం వ్యక్తం చేసింది. యూఏఈ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి తమ నిబద్ధతను చాటుకునేలా మరింత ప్రోత్సహాం అందించినట్లైందని ఆస్టర్ డిఎమ్ హెల్త్‌కేర్ వ్యవస్థాపక ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆజాద్ మూపెన్ అన్నారు. డాక్టర్ ఆజాద్ మూపెన్ కు 2019లోనే గోల్డెన్ వీసా మంజూరు అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమ సిబ్బందికి కూడా గోల్డెన్ వీసాలు మంజూరు కావటం తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అన్నారాయన. గోల్డెన్ వీసా పొందిన డాక్టర్లకు అభినందనలు తెలిపారు. అలాగే వైద్యరంగంలో దూరదృష్టి గల పాలకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.గోల్డెన్ వీసా అందుకున్నవారిలో అస్టర్ డిఎమ్ హెల్త్‌కేర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అలీషా మూపెన్ కూడా ఉన్నారు.యూఏఈ ప్రజలకు వైద్య సేవలు అందించటంలో ఆమె నిరంతర కృషికి గోల్డెన్ వీసాతో సత్కరించారు.ఇదిలాఉంటే..ఆస్టర్ డీఎమ్ హెల్త్ కేర్ తొలుత ఒకే ఒక క్లినిక్ తో వైద్య సేవలను ప్రారంభించింది. 1987 లో దుబాయ్‌లో తొలి క్లీనిక్ ప్రారంభించింది. ఆ తర్వాత 7 దేశాలలో విస్తరించి ప్రపంచవ్యాప్తంగా 27 ఆస్పత్రులు, 115 క్లినిక్‌లు, 223 ఫార్మసీలను ఏర్పాటు చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com