ఎయిర్ అరేబియా విమానంలో కేవలం ముగ్గురే ప్రయాణికులు..

- August 10, 2021 , by Maagulf
ఎయిర్ అరేబియా విమానంలో కేవలం ముగ్గురే ప్రయాణికులు..

షార్జా: హైదరాబాద్‌ నుంచి షార్జాకు బయల్దేరిన ఎయిర్‌బస్‌ ఏ-320 ఎయిర్‌ అరేబియా విమానం. 180 మంది సామర్థ్యం కలిగిన ఈ విమానంలో కేవలం ముగ్గురే ప్రయాణికులు మాత్రమే ఉన్నారు.ఈ ముగ్గురూ తెలుగు ఎన్నారైలు.మూడు మాసాల క్రితం అత్యవసరంగా హన్మకొండకు వచ్చిన వీరు కరోనా, లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు.అనేక కష్టాలు, ఇబ్బందులు పడిన ఈ కుటుంబం తిరిగి ఇప్పుడు షార్జాకు చేరుకుంది. కరీంనగర్‌కు చెందిన బందం శ్రీనివాస్ రెడ్డి, పోటు హరిత రెడ్డి దంపతులు. పదేళ్లుగా దుబాయ్‌లో నివాసముంటున్నారు.హరిత రెడ్డి డా.ఇస్మాయిల్ హెల్త్ కేర్ గ్రూప్ లో వైద్యురాలిగా పని చేస్తుండగా,శ్రీనివాస్ రెడ్డి టెక్‌ మహేంద్ర కంపెనీలో కంట్రీ హెడ్ మరియు జనరల్ మేనేజర్ గా చేస్తున్నారు.

ఏప్రిల్‌ 18న హరిత రెడ్డి తండ్రి సత్యనారాయణ రెడ్డి కన్నుమూయడంతో ఈ దంపతులిద్దరూ కొడుకు సంజిత్‌ రెడ్డితో అదే రోజు హన్మకొండకు వచ్చారు. భారత్‌లో కరోనా వ్యాప్తితో ఏప్రిల్‌ 24 నుంచి యూఏఈ ప్రభుత్వం భారతీయ విమానాలపై నిషేధాన్ని విధించడంతో వారు ఇక్కడే ఇరుక్కుపోయారు.ఆరుసార్లు విమాన టికెట్లు కొన్నప్పటికీ మారుతున్న నిబంధనలతో ప్రతిసారీ ప్రయాణం వాయిదా పడింది, ఈ తరుణంలో వైద్యులు,ఆరోగ్య సిబ్బంది,దౌత్యవేత్తలు, గోల్డెన్‌ వీసా కలిగిన వారు తమ దేశంలోకి రావొచ్చని యూఏఈ ప్రభుత్వం ప్రకటించడంతో ఈ దంపతులిద్దరూ యూఏఈకు తిరిగొచ్చేందుకు దరఖాస్తు చేసుకోగా, అనుమతి లభించింది.
ఇక, ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కేవలం ఈ ముగ్గురితోనే ఎయిర్‌బస్‌ ఏ-320 ఎయిర్‌ అరేబియా విమానం హైదరాబాద్‌ నుంచి షార్జాకు చేరుకుంది.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)

   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com