బెంగళూరులోని జేఎన్‌సీఏఎస్ఆర్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి

- August 16, 2021 , by Maagulf
బెంగళూరులోని జేఎన్‌సీఏఎస్ఆర్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి
బెంగళూరు: వాతావరణ సమస్యలు మొదలుకొని వ్యవసాయం, వైద్యం, ఔషధ రంగం వరకు మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్నమైన పరిష్కారాల దిశగా విస్తృతమైన పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.
 
సోమవారం బెంగళూరులోని జవహార్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్‌సీఏఎస్ఆర్)ను ఉపరాష్ట్రపతి సందర్శించారు. అనంతరం విద్యార్థులు, శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు, వారి జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు పరిశోధనలు జరగాలన్నారు.
 
ముఖ్యంగా శాస్త్రీయ సమాజం వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న ఆయన, బెంగళూరుకు అపారమైన జలవనరులు ఉన్నాయని, వాటిని కాపాడుకోవడం మీద ప్రభుత్వం, ప్రజలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. జె.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్. చుట్టుపక్కల ఉన్న నీటి వనరులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు సూచించారు.
 
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తూ అద్భుతాలు సృష్టించే దిశగా పనిచేస్తున్న స్టార్టప్స్ ను ప్రోత్సహించడంతోపాటు 300కు పైగా పేటెంట్ (మేధోసంపత్తి) హక్కులను పొందిన జేఎన్‌సీఏఎస్ఆర్ శాస్త్రవేత్తలను ఉపరాష్ట్రపతి అభినందించారు. విస్తృతమైన అంశాలపై పరిశోధనలు చేసే జేఎన్‌సీఏఎస్ఆర్ శాస్త్రవేత్తలు.. సింథటిక్ బయాలజీ, కంప్యూటేషనల్ బయాలజీ, కృత్రిమ మేధ, ఉత్తమమైన సామర్థ్యం గల ఇంజనీరింగ్ సాధనాలు తదితర అంశాల్లో పరిశోధనలపై దృష్టిసారించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దీంతోపాటుగా సమాజంలో వేళ్లూనుకుపోయిన సమస్యలను కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రపంచస్థాయిలో పరిశోధనలు జరగాలన్నారు. 
 
ఏ దేశాభివృద్ధిలోనైనా ఆ దేశంలో జరిగే సాంకేతిక వృద్ధి కీలకమన్న ఉపరాష్ట్రపతి, దేశ జనాభాలో యువత సంఖ్య ఎక్కువగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. యువత నైపుణ్యానికి పదునుపెట్టి వారి సామర్థ్యాన్ని శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సద్వినియోగ పరుచుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల్లో బాల్యం నుంచే శాస్త్ర సాంకేతిక, విజ్ఞాన సంబంధిత అంశాలపై జిజ్ఞాస కలిగేలా ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పరిశోధన సంస్థల సరసన స్థానం దక్కించుకున్న జేఎన్‌సీఏఎస్ఆర్ ను అభినందించిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో సాంకేతిక, పరిశోధల రంగంలో రానున్న మార్పుల్లో ఈ సంస్థ కీలకంగా వ్యవహరిచనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020) ద్వారా విద్యార్థులు సరికొత్త విద్యాభ్యాస పద్ధతులను, వివిధ రకాలైన అంశాలను భిన్నమైన కోణాల్లో తెలుసుకునేందుకు, పరిశోధనలపై ఆసక్తి పెంచుకునేందుకు ప్రోత్సహిస్తుందన్న ఆయన, చిన్నారుల్లో బాల్యం నుంచే నైపుణ్యాభివృద్ధికి బాటలు వేయడం ద్వారా పోటీతత్వం పెరగుతుందని, తద్వారా భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పరిశోధలనకు మార్గం సుగమం అవుతుందన్నారు. 
 
విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను చేరుకునేందుకు కనబడిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఉపరాష్ట్రపతి, శ్రమకు మించిన ప్రత్యామ్నాయం లేదని అందుకే వీలైనంత ఎక్కువగా కష్టపడాలని పేర్కొఉ. ప్రస్తుత పరిస్థితినుంచి మరింత ఉత్తమమైన ఫలితాలు సాధించే దిశగా మన ప్రయత్నాలు సాగాలి అని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
అంతర్జాతీయ ఎనీ అవార్డు -2020కి ఎంపికైన భారతరత్న, ప్రముఖ సైంటిస్టు ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావును అభినందించిన ఉపరాష్ట్రపతి, భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా యువ శాస్త్రవేత్తలను ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు ప్రోత్సహిస్తున్నారన్నారు.
 
కార్యక్రమం ప్రారంభంలో ఇదే వేదిక నుంచి జె.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్. ఇన్నోవేషన్ అండ్ డెవలప్ సెంటర్ కు ఉపరాష్ట్రపతి అంతర్జాలం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్, ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్.బొమ్మై,  జేఎన్‌సీఏఎస్ఆర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జీయూ కులకర్ణి, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు సహా పలువురు శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com